వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఇది ప్రత్యేకమైన బడ్జెట్ అని అందరూ ముందే ఊహించారు. ఈ దశాబ్దంలోనే ఇది భిన్నమైన బడ్జెట్‌గా చరిత్రలోకి ఎక్కుతుందని విశ్లేషణలు వచ్చాయి. చాలా అంచనాలు, ఆంకాంక్షల నడుమ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు.

మళ్లీ ఆర్థిక కార్యకలాపాలను గాడిన పెట్టడం ఎలా? తరిగిపోతున్న ఆర్థిక వనరులు, పెరుగుతున్న ఆర్థిక లోటు నడుమ బ్యాలెన్స్ షీట్‌ను ఎలా సమతుల్యం చేస్తారు? ఎలాంటి చర్యలు తీసుకుంటారు? లాంటి ప్రశ్నలు అందరి బుర్రలనూ తొలచేశాయి.

బడ్జెట్‌లో కొన్ని కఠినమైన చర్యలు ఉంటాయని చాలా మంది ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. రుణ భారంతోపాటు లోటు కూడా పెరిగినా.. ప్రజా వినియోగంపై వీలైనంత ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తూ దీన్ని సిద్ధం చేసి ఉంటారని భావించారు. మరోవైపు నిరుద్యోగ రేటు తగ్గించంతోపాటు ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా చర్యలు ఉంటాయని విశ్లేషించారు.

నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2021-2022ను దాదాపు అందరూ ఈ కోణాల్లో నుంచే చూశారు.

ఆర్థిక లోటు ఎందుకు పెంచారు?

గతేడాది ప్రకటించిన ప్యాకేజీతో పెరిగిన ఆర్థిక లోటు ప్రస్తుతం జీడీపీలో 9.5 శాతం వరకు ఉన్నట్లు నిర్మల చెప్పారు. దీన్ని 3.5 శాతానికి తగ్గించాలని ముందుగా లక్ష్యం నిర్దేశించుకున్నారు. అయితే, రుణాలతోపాటు ఇతర విధానాల్లో ఆర్థిక వ్యవస్థలోకి ఎక్కువ నగదును ప్రవేశ పెట్టడం ద్వారా వృద్ధిని గాడిలో పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

వచ్చే ఏడాది (2021-22)లో ఆర్థిక లోటును 6.8 శాతానికి కట్టడి చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. ఈ లోటు కేవలం 5 నుంచి 5.5 శాతం మధ్య ఉండొచ్చని చాలా మంది ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. దీన్ని 6.8 శాతానికి పెంచడం ద్వారా ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించినట్లు కనిపిస్తోంది. అయితే, దీని వల్ల చాలా పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థపై రుణ భారం మరింత పెరుగుతుంది.

కానీ, ఇదొక వ్యూహం. ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పించడం ద్వారా, ముఖ్యంగా మౌలిక పెట్టుబడుల రూపంలో, దేశానికి లబ్ధి చేకూరుతుంది. ముఖ్యంగా కొత్త ఉద్యోగాల కల్పనకు, వృద్ధి రేటు పెరగడానికి వీలు కల్పిస్తుంది.

రైతులకు ప్రయోజనం ఏమిటి?

ప్రతి బడ్జెట్‌లోనూ రైతుల కోసం ప్రత్యేక కేటాయింపులు ఉంటాయి. మోదీ ప్రభుత్వం కూడా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టంచేసింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. దీంతో రైతులకు ప్రయోజనాలు చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలతో ముందుకు వచ్చింది.

ముఖ్యంగా రైతులకు మరింత ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా పంట వ్యయానికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) 1.5 రెట్లు ఉండేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరోవైపు గోధుమ, వరి, పత్తి తదితర పంటల రైతులకు ప్రత్యేక ఉపశమన చర్యలు ప్రకటించింది. కిసాన్ క్రెడిట్ పథకానికి ఈ సారి రూ.16,50,000 కోట్లు కేటాయించారు. గతేడాది ఇది కేవలం 15 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 10 శాతం కేటాయింపులను పెంచారు.

మరోవైపు ఆరోగ్య సంరక్షణ, రోడ్ల నిర్మాణం, విత్తనాల పంపిణీ, నీటి సరఫరా ఇలా అన్ని విధాలుగా రైతులకు ఉపశమనం కలిగించే దిశగా చర్యలు ప్రకటించారు.

పీఎం కిసాన్ పథకం కింద కేటాయింపులను ప్రభుత్వం పెంచింది. విత్తనాలు నాటడం నుంచి కోతల వరకు, ఏ సమస్య వచ్చినా సాయం చేసేందుకు పంటల బీమాకు కూడా కేటాయింపులు పెంచారు. వ్యవసాయ రుణాల పరిమితిని కూడా పెంచారు.

వ్యవసాయ రంగం గాడిన పడేందుకు ఈ చర్యలు కొంతవరకు వీలుకల్పిస్తాయి. జీడీపీలో వ్యవసాయ రంగం పాత్ర మరింత పెరిగడంతోపాటు రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.

మహిళలకు ఏం ప్రయోజనం?

గతేడాది మహిళల కోసం చాలా ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టారు. వీటిని ప్రస్తుతం కొనసాగిస్తున్నారు.

గతేడాది బడ్జెట్‌లో మహిళలకు పెద్దపీట వేశారు. ఈ సారి కూడా ప్రతి రంగంలోనూ వారికి సముచిత ప్రాధాన్యం కల్పించారు. విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు ఇలా అన్ని రంగాల్లోనూ వారిని దృష్టిలో ఉంచుకొని కేటాయింపులు చేశారు.

మౌలిక పెట్టుబడులకు ఈ సారి కేటాయింపులు భారీగా పెంచారు. ఆరోగ్య రంగంలో ఎక్కువ కేటాయింపులు చేశారు. గతేడాది లక్ష కోట్ల రూపాయల వరకు ఉన్న ఈ కేటాయింపులను ఈ సారి రూ.2,23,846 కోట్లకు పెంచారు.

అంటే కోవిడ్-19 వ్యాప్తి నడుమ ఆరోగ్య రంగంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల మహిళలకు కూడా ప్రయోజనం చేకూరుతుంది.

ఉజ్వల యోజన లాంటి పథకాలతో మహిళలకు ప్రయోజనం చేకూరుతుంది. గతేడాది 8 కోట్ల మందిగా ఉన్న లబ్ధిదారుల సంఖ్యను ఈ సారి తొమ్మిది కోట్లకు పెంచనున్నట్లు నిర్మల తెలిపారు. దీంతో మహిళలకు ప్రయోజనాలు దక్కుతాయి.

బడ్జెట్ 2021

మధ్యతరగతి ప్రజలకు ఏమిటి?

ఆర్థిక వ్యవస్థకు మధ్య తరగతి ప్రజలు వెన్నెముక లాంటివారని ప్రభుత్వం మొదట్నుంచీ చెబుతోంది. వారి పన్నులతోనే దేశం ముందుకు వెళ్తోందని చెబుతూ వస్తోంది. ఈ సారి పన్ను చెల్లింపు దారుల సంఖ్య 6.8 కోట్లకు పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

తమకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తారని ప్రతి బడ్జెట్‌లోనూ మధ్యతరగతి ప్రజలు ఎదురుచూస్తుంటారు. ఈ సారి కూడా బడ్జెట్‌పై వారు చాలా ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నారు. ప్రస్తుతం వారికి వినియోగానికి అందుబాటులో ఉండే ఆదాయాన్ని పెంచుతున్నారు. పెట్టుబడుల పరిమితి కూడా పెంచుతున్నారు. కొన్ని పన్నులు కూడా తగ్గిస్తున్నారు.

కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఏటీసీ కింద ట్యాక్స్ రిబేట్‌, స్టాండార్డ్ డిడక్షన్, మెడీక్లెయిమ్ రిబేట్‌లను పెంచుతారని ఆశించారు.

అయితే, ప్రభుత్వం పన్ను విధానాల్లో ఎలాంటి మార్పులనూ చేయలేదు. కొత్త పన్నులు మాత్రం ఏమీ విధించడంలేదని స్పష్టంచేసింది. అంటే గతేడాది తరహాలోనే పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

జీఎస్‌టీ

మరోవైపు పారదర్శకత, సులభతర లావాదేవీలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఎలాంటి ఇబ్బందులూ లేని పన్ను మదింపు విధానాలు, పన్ను వ్యవస్థలను మెరుగుపరచడం లాంటి చర్యలను తీసుకుంది. అంటే మీ ఆదాయపు పన్ను రిటర్నులను త్వరగా ప్రాసెస్ చేస్తారు. త్వరగా రీఫండ్ వచ్చేస్తుంది.

మరికొన్ని కొత్త మార్పులను కూడా తీసుకొచ్చారు. రిటర్నుల్లో ఏమైనా తేడా కనిపిస్తే.. ఆరేళ్ల వరకు పాత కేసులను కూడా అధికారులు మళ్లీ పరిశీలిస్తారు.

జీఎస్‌టీ విషయంలోనూ రిటర్న్స్ దాఖలు చేయడం, వాటిని ప్రాసెస్ చేయడం లాంటి పనులను సులభతరం చేశారు. పన్ను ఎగవేతదారులను అడ్డుకోవడం ద్వారా జీఎస్‌టీ వాటా పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది.

ముఖ్యంగా ప్రభుత్వం నిర్మాణపరమైన మార్పులు, పారదర్శకతపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది. వ్యవస్థలను సులభతరం చేసేందుకు ప్రయత్నించింది.

మరోవైపు వృద్ధులకు ఒక చిన్న ఉపశమనాన్ని ప్రభుత్వం కలిగించింది. దీన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. కేవలం పింఛను లేదా వడ్డీపై మాత్రమే జీవిస్తున్న 75ఏళ్లకుపైబడిన వృద్ధులు ఐటీ రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరంలేదని ప్రభుత్వం తెలిపింది. ఏదైనా పన్నును కట్టాల్సి వస్తే, వారు నగదు తీసుకునే బ్యాంకులే మొత్తం చూసుకుంటాయని స్పష్టంచేసింది.

ఆర్థిక వ్యవస్థ

కొత్త మార్పులతో ఫలితాలు ఇవీ..

ఒక ఆర్థిక నిపుణుడిగా బడ్జెట్‌లో మూడు, నాలుగు రంగాలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని నేను భావిస్తాను.

వీటిలో మొదటిది తయారీ రంగం. ఈ రంగంలో వృద్ధి వేగం పుంజుకుంటేనే జీడీపీలో వృద్ధి కనిపిస్తుంది. నిరుద్యోగ రేటు కూడా తగ్గుతుంది.

కోవిడ్-19 వ్యాప్తి నడుమ నిరుద్యోగ రేటు తీవ్రంగా ప్రభావితమైంది. డిసెంబరులో అయితే నిరుద్యోగ రేటు పది శాతం వరకు పెరిగింది. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది.

చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు. గ్రామాలకు పరిమితమైన నిరుద్యోగం ప్రస్తుతం పట్టణాలకు భారీగా విస్తరించింది. పట్టణాల్లో నేడు చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు.

దీంతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని అందరూ భావించారు. ఆర్థిక లోటు పెరుగుతున్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదు వచ్చేలా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మౌలిక పెట్టుబడులపై ఎక్కువ దృష్టి సారించింది.

ఈ సారి చాలా కస్టమ్స్ సుంకాలను తగ్గించడం మనం గమనించొచ్చు. ఉక్కు, బంగారం, వెండి.. ఇలా చాలా వస్తువులపై సుంకాలను తగ్గించారు. దీంతో ఈ రంగాల్లో తయారీ పెరుగుతుంది. ఫలితంగా కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుంది. మరోవైపు అంకుర సంస్థలకు పన్ను వెసులుబాటులను పెంచారు.

కంపెనీల చట్టంలోని చిన్న కంపెనీల నిర్వచనంలోనూ తాజాగా మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా ఎక్కువమంది కంపెనీలను స్థాపించి, ఉపాధిని కల్పించేందుకు వీలుగా చర్యలు తీసుకున్నారు. ఇది తయారీ రంగంతోపాటు సేవల రంగానికీ వర్తిస్తుంది.

రైతుల ఆదాయం రెట్టింపు చేసే కోణంలోనూ తాజాగా చర్యలు తీసుకున్నారు. ఆరోగ్య రంగంలోనూ కేటాయింపులు పెంచారు. గతేడాది కూడా విద్యా రంగానికి కేటాయింపులు పెంచారు. ప్రస్తుతం అదే రీతిలో పెంచుకుంటూ వెళ్లారు. ముఖ్యంగా డిజిటల్ విద్యకు పెద్దపీట వేశారు.

పన్ను వ్యవస్థలను మరింత సులభతరం చేయడంపై దృష్టి సారించారు. మీరు డిజిటల్ రూపంలో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తే.. పది కోట్ల టర్నోవర్ వరకూ మీరు ఆడిట్ చేయించుకోవాల్సిన పనిలేకుండా మార్పులు చేశారు.

ఆదాయపు పన్ను విషయంలో ఈ బడ్జెట్ అంచనాలను అందుకోలేదు. కరోనావైరస్ వ్యాప్తి నడుమ ప్రభుత్వం చేయడానికి కూడా పెద్దగా ఏమీలేదని మాకు కూడా అనిపించింది. ముఖ్యంగా సాధారణ పౌరులకు ఉపాధి కల్పించడంపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టింది. దేశంలో స్వావలంబన సాధించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, వాణిజ్యం సులభతరం చేయడం లాంటి అంశాలపై కేంద్రం దృష్టి సారించింది.

ఈ చర్యలను పరిశీలిస్తుంటే ప్రభుత్వం సరైన దిశలోనే ముందుకు వెళ్తున్నట్లు అనిపిస్తోంది. అయితే, ప్రభుత్వం నుంచి ప్రజలు ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారు.

కరోనావైరస్ వ్యాప్తి నడుమ జీడీపీ కోతకు గురైనప్పటికీ.. 35 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి చాలా ధైర్యం కావాలి. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, రోడ్ల నిర్మాణం, విద్యుత్ పంపిణీ, సౌర విద్యుత్.. ఇలా అన్ని రంగాలపైనా దృష్టి కేంద్రీకరిస్తూ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Benefits for the common man in this budget
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X