Budget 2022: రెండు విడతలుగా పార్లమెంటు సమావేశాలు, జనవరి 31 నుంచి, ఫిబ్రవరి 1న బడ్జెట్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే సమావేశాలను కొనసాగించనున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి.
పార్లమెంట్ సమావేశాల తేదీలపై లోక్ సభ సచివాలయం ప్రకటన విడుదల చేసింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఆ తర్వాత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంది. మొదటి విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జనవరి 31న ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల నిర్వహణ కోసం పార్లమెంట్‌లో శానిటేషన్ పనులు, ఇతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పరిశీలించారు. 60ఏళ్లు పైబడిన ఎంపీల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బడ్జెట్ సమావేశాలకు పార్లమెంట్‌లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
The 8th session of 17th Lok Sabha will commence on January 31 and is likely to conclude on April 8. Union Budget to be presented at 11 am on February 1 pic.twitter.com/bAQOgl8il0
— ANI (@ANI) January 14, 2022
ఇటీవల పార్లమెంట్‌లో 400 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కాగా, పార్లమెంట్‌లో 1409 సిబ్బందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 402మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. పాజిటివ్‌గా నిర్ధారణ వారిలో 200 మంది లోక్‌సభ సిబ్బంది, 69 మంది రాజ్యసభ సిబ్బంది, 133 మంది అనుబంధ సిబ్బందిగా అధికారులు వెల్లడించారు. కాగా, పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు కూడా ఇటీవల కరోనా బారినపడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications