Budget 2024: 300 యూనిట్లు కరెంట్ ఫ్రీ.. తీపికబురు చెప్పిన నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. డిజిటల్ రూపంలోనే బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ ఇది ప్రజల బడ్జెట్ అని, గత పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భుత ప్రగతిని సాధించిందని తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
దేశంలోని ప్రజలందరి అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని, గత పదేళ్లలో భారతదేశ ఆర్థిక పరిస్థితి ఉన్నత స్థాయికి చేరుకుందని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. ఇక బడ్జెట్ ప్రసంగంలో నిర్మల సీతారామన్ కీలక ప్రకటన చేశారు.

కరెంట్ కష్టాలు లేని దేశ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. దేశంలో కోటి ఇండ్లపై సోలార్ సెటప్స్ ను ఏర్పాటు చేస్తామని నిర్మల సీతారామన్ వెల్లడించారు. ప్రతి ఇంటికి 300 యూనిట్ల సోలార్ విద్యుత్తు ఉచితంగా అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. దీనివల్ల ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం 15 వేల నుంచి 18 వేల రూపాయలు ఆదా అవుతుందని ఆమె పేర్కొన్నారు.
దేశంలోని ప్రజల కరెంటు కష్టాలను, కరెంటు చార్జీల బాదుడు ను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్మల సీతారామన్ ప్రకటనతో అర్థమవుతుంది. అయితే సోలార్ సెటప్స్ వల్ల ఉత్పత్తి అయిన విద్యుత్తులో ప్రజల అవసరాలకు పోగా మిగిలిన విద్యుత్తును పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చు అని నిర్మల సీతారామన్ తెలిపారు.
అంతేకాదు గత పదేళ్లలో అందరికీ ఇల్లు, గ్యాస్, నీళ్లు ఇచ్చామని శతాబ్దంలోని అతిపెద్ద సంక్షోభం అయిన కరోనాను ఎదుర్కొన్నామని అభివృద్ధిని సాధించామని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్ ఇదే తమ మంత్రమని నిర్మల సీతారామన్ తెలిపారు.












Click it and Unblock the Notifications