Budget 2025: గిగ్ వర్కర్లకు కేంద్ర బడ్జెట్ గుడ్‌న్యూస్
పార్లమెంటులో శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో గిగ్ వర్కర్లకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. ఈ శ్రమ్ పోర్టల్ కింద గిగ్ వర్కర్లను నమోదు చేసి గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. పీఎం జన్ ఆరోగ్య యోజన పథకం కింద గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం కలుగుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ కార్మికుల సంక్షేమం కోసం సామాజిక భద్రతా పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) మోడ్‌లో అమలు చేస్తారు.

ఈ మోడల్‌ను అవలంబించడానికి రాష్ట్రాలు ప్రోత్సహిస్తాం. పీపీపీ ప్రతిపాదనలను సిద్ధం చేయడానికి ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఫండ్ (IIPDF) పథకం నుంచి సహాయం పొందవచ్చు అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం, భారతదేశ గిగ్ ఎకానమీ 2030 నాటికి 23 మిలియన్లకు పైగా ప్రజలకు ఉపాధి కల్పించనుంది.
పీఎం ఆరోగ్య బీమా యోజన కింద గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం స్వాగతించదగ్గ పరిణామమని స్విగ్గీ ప్రతినిధి దినకర్ పేర్కొన్నారు.
మరోవైపు, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రాలకు అందజేసే రుణాలపై మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. మూలధన వ్యయాల కోసం 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు సంస్కరణలు అమలుచేస్తే ప్రోత్సాహకాలు ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు.
ఉడాన్ పథకాన్ని మరిన్ని రూట్లకు విస్తరించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఇప్పుడు అమలుచేస్తున్న రూట్లకు అదనంగా మరో 120 రూట్లలో కొత్త ఉడాన్ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. మొత్తంగా వచ్చే పదేళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణ సదుపాయం కల్పించడమే లక్ష్యమని ప్రకటించారు. అదేవిధంగా బీహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇక, వేతన జీవులకు భారీ ఊరట కలిగిస్తూ రూ. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications