Viral Video: చూస్తుండగానే కూలిపోయిన భవనాలు.. భారీ వర్షాలతో అల్లాడుతున్న హిమాచల్‍ప్రదేశ్..
భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అల్లాడుతోంది. జిల్లాలో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఏడు భవనాలు కూలిపోయాయి. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బస్టాండ్‌కు ఆనుకుని ఉన్న ఏడు భవనాలు కూలిపోతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. భారీ వర్షాల కారణంగా భవనాల్లో పగుళ్లు ఏర్పడి మూడు రోజుల క్రితమే వాటిని ఖాళీ చేయించామని నరేష్ వర్మ అనే అధికారి తెలిపారు.
ఎడతెరిపి లేని వర్షాలు, కొండచరియలు విరిగిపడడంతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో మరో 13 మంది మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్‌లో 12 మంది మరణించగా, ఉత్తరాఖండ్‌లోని పౌరి జిల్లాలో బుధవారం మరొకరు మరణించారు. 400కు పైగా రోడ్లు మూసుకుపోయాయని, పలు ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ (IMD) రెండు రాష్ట్రాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటలలో సిమ్లాతో సహా రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో అతి భారీ వర్షాలతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలుకురుస్తాయని అంచనా వేసింది.

సిమ్లా, సిర్మౌర్, కాంగ్రా, చంబా, మండి, హమీర్‌పూర్, సోలన్, బిలాస్‌పూర్తో పాటు తొమ్మిది జిల్లాలకు ఒక మోస్తరు నుంచి భారీ వర్ష హెచ్చరిక జారీ చేశారు. కాంగ్రా, కులు, మండి, సిమ్లా, సోలన్ సిర్మౌర్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ ఆరెంజ్ హెచ్చరికను కూడా జారీ చేసింది.
#WATCH | Himachal Pradesh: Several buildings collapsed due to landslides in Anni town of Kullu district.
— ANI (@ANI) August 24, 2023
(Visuals confirmed by police) pic.twitter.com/MjkyuwoDuJ
భారీ వర్షాల దృష్ట్యా, సిమ్లా, మండి, సోలన్ జిల్లాల్లో బుధవారం నుంచి రెండు రోజుల పాటు అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. కులు-మండి రహదారి కుండపోత వర్షాల కారణంగా కులు జిల్లాలో బుధవారం వందలాది వాహనాలు నిలిచిపోయాయి. పండోహ్ మీదుగా ఉన్న ప్రత్యామ్నాయ మార్గం కూడా దెబ్బతింది. శిథిలాల తొలగింపు పనులు జరుగుతున్నాయి. జాతీయ రహదారి 21 (మండి-కులు రహదారి), NH 154 (మండి-పఠాన్‌కోట్) రహదారులు దెబ్బతిన్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో ఈ నెలలో వర్షాలకు సంబంధించిన సంఘటనలలో ఇప్పటి వరకు 120 మంది మరణించారు. జూన్ 24 న రాష్ట్రంలో రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 238 మంది మరణించారు. 40 మంది తప్పిపోయారు.












Click it and Unblock the Notifications