40 అడుగుల గనిలో పడిన బస్సు..15 మంది మృతి..
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి 8.30 గంటలకు ప్రయివేట్ బస్సు గని సమీపంలోని ఓ గోతిలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో అక్కడిక్కడే 11 మంది మృతిచెందగా, 12 మందికిపైగా గాయపడినట్లు సమాచారం.
దుర్గ్ జిల్లాలోని ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఓ డిస్టిలరీ కంపెనీలో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగులను ఇళ్లకు తీసుకొస్తున్న బస్సు అదుపుతప్పి 40 అడుగుల లోతున్న గోయ్యిలో పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం కుమ్హారీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖాప్రీ గామం సమీపంలో చోటుచేసుకుంది. బస్సు గనిలో పడిపోవడం గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి పరుగులు పెట్టారు. పలువురు పోలీసులకు సమాచారం చేరవేసారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటినా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 40 అడుగుల కింద పడిపోయిన బస్సులోంచి మృతదేహాలను, క్షతగ్రాతులను బయటకు తీశారు.

ప్రమాదంపై మృతుల బంధువులకు సమాచారం..
ప్రమాద స్థలానికి అనేక అంబులెన్స్‌లు, స్థానికులు చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనలో 15 మంది మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ప్రమాదంలో మరణించిన వ్యక్తులను పోలీసులు గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాదంపై మృతుల బంధువులకు పోలీసులు సమాచారం అందిస్తున్నామని అధికారులు తెలిపారు.
ప్రమాదంపై స్పందించిన ప్రధాని, రాష్ట్రపతి..
బస్సు పడిపోయిన గోయ్యి ప్రధాన రహదారి పక్కనే ఉంది. దీని లోతు 40 అడుగుల కంటే ఎక్కువగా ఉంటుందని అధికారులు అంటున్నారు. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి స్పందించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ సోషల్‌మీడియా వేదికగా పోస్టుచేశారు.












Click it and Unblock the Notifications