Bypoll Results: త్రిపురలో బీజేపీ హవా, కేరళలో కాంగ్రెస్ అభ్యర్థి చాందీ ఘన విజయం
న్యూఢిల్లీ: దేశంలో పలు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఫలితాలు శుక్రవారం వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు త్రిపుర, కేరళలో జరిగిన ఉపఎన్నికల పూర్తి ఫలితాలు వెల్లడయ్యాయి. త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలోని ధన్‌పూర్, బోక్సానగర్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని ఎన్నికల సంఘం వెల్లడించింది.
66 శాతం మైనారిటీ ఓటర్లు ఉన్న బోక్సానగర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి తఫజ్జల్ హుస్సేన్ 30,237 ఓట్లతో గెలుపొందారు. హొస్సేన్‌కు 34,146 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి సీపీఐ(ఎం)కు చెందిన మిజాన్ హొస్సేన్‌కు 3,909 ఓట్లు వచ్చాయి.

గిరిజన జనాభా గణనీయంగా ఉన్న ధన్‌పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి బిందు దేబ్‌నాథ్ 18,871 ఓట్లతో విజయం సాధించారు. దేబ్‌నాథ్‌కు 30,017 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి సీపీఐ(ఎం) అభ్యర్థి కౌశిక్ చందాకు 11,146 ఓట్లు వచ్చాయి.
పోలింగ్ సమయంలో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ప్రతిపక్ష సీపీఐ(ఎం) ఓట్ల లెక్కింపును బహిష్కరించింది. ఈ రెండు స్థానాల్లో అధికార బీజేపీ, సీపీఐ(ఎం)ల మధ్య ప్రత్యేక పోరు జరిగింది. మిగిలిన రెండు ప్రత్యర్థి పార్టీలు తిప్రమోతా, కాంగ్రెస్‌లు అభ్యర్థులను నిలబెట్టలేదు. కాగా, సెప్టెంబర్ 5న ఉప ఎన్నికల పోలింగ్ జరగ్గా.. రెండు స్థానాల్లో సగటున 86.50 శాతం పోలింగ్ నమోదైంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య సోనామురా బాలికల పాఠశాలలో కౌంటింగ్ జరిగింది.

సీపీఐ(ఎం) ఎమ్మెల్యే శాంసుల్ హక్ మరణంతో బాక్సానగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ధన్‌పూర్ ఎమ్మెల్యే పదవికి కేంద్ర మంత్రి ప్రతిమా భూమిక్ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధన్‌పూర్ సీటును తొలిసారిగా గెలుచుకున్న బీజేపీ.. ఉప ఎన్నికల్లో దానిని నిలబెట్టుకుంది.
మైనారిటీల ప్రాబల్యం ఉన్న బోక్సానగర్ స్థానాన్ని అధికార పార్టీ సీపీఐ(ఎం) నుంచి కైవసం చేసుకుంది. ఈ విజయాలతో 60 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీ సంఖ్య 33కి పెరిగింది. దాని మిత్రపక్షమైన IPFTకి ఒక ఎమ్మెల్యే ఉండగా, ప్రతిపక్షం టిప్ర మోతాకు 13 మంది ఎమ్మెల్యేలు, సీపీఐ(ఎం)కి 10, కాంగ్రెస్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

కేరళ పూత్తుపల్లి ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం
కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ మరణంతో పూత్తుపల్లి నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానికి రికార్డు స్థాయిలో 53 ఏళ్లపాటు చాందీ ప్రాతినిథ్యం వహించారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తరపున ఊమెన్ కుమారుడు చాందీ ఊమెన్ బరిలోకి దిగారు. తాజాగా ఫలితాలు వెలువడ్డాయి. కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కంచుకోట అయిన పూత్తుపల్లికి జరిగిన ఉపఎన్నికలో ఆయన కుమారుడు చాందీ ఊమెన్ ఘన విజయం సాధించారు. చాందీ ఊమెన్ తన సమీప ఎల్డీఎఫ్ అభ్యర్థిపై 36వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.












Click it and Unblock the Notifications