అతి త్వరలో దేశవ్యాప్తంగా CAA - బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రకటన - కరోనా వల్లే ఆలస్యమైంది
కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్యలో అతి త్వరలోనే అమెరికాను దాటేస్తోందన్నంత వేగంగా భారత్ లో కొత్త కేసులు నమోదవుతున్నా.. బీహార్ ఎన్నికల సందడితో దేశమంతా రాజకీయ కార్యకలాపాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇదే క్రమంలో అతి త్వరలోనే దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను అమలు చేయబోతున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు.
గతేడాది డిసెంబర్ లో పార్లమెంట్ ఆమోదం పొందిన వివాదాస్పద సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు జరగడం, మార్చిలో కరోనా లాక్ డౌన్ కారణంగా ఆందోళనలకు బ్రేక్ పడటం, అదే క్రమంలో సీఏఏ చట్టబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కావడం తెలిసిందే. చట్టంగా రూపొందిన సీఏఏను కరోనా కారణంగానే ఇన్నాళ్లూ అమలు చేయలేకపోయామన్న నడ్డా.. అది త్వరలోనే అమలులోకి వస్తుందని చెప్పారు.

వచ్చేఏడాది ప్రారంభంలో జరుగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం భారీ ప్రణాళికలు రచిస్తోన్న బీజేపీ.. చిన్న సమావేశాలను సైతం పెద్ద నేతలతోనే నిర్వహిస్తున్నది. బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా సోమవారం సిలిగిరిలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో పాల్గొని, ఎన్నికల వ్యూహంపై చర్చోపచర్చలు జరిపారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీసీఏ అమలుపై వ్యాఖ్యలు చేశారు.
బెంగాల్ లో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, ప్రజలను విభజించి పాలిస్తూ, కుటిల రాజకీయాలు చేస్తోన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి బుద్ధి చెబుతామని నడ్డా అన్నారు. మమతా హయాంలో హింసాత్మక రాజకీయాలు, కట్-మనీ సంస్కృతికి ప్రజలు విసిగిపోయారని.. ఓటుతోనే సమాధానం చెబుతారని నడ్డా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications