'చిన్నమ్మ'కు జవాబు రాజీవ్ గాంధీ!: శశికళ మరో సోనియా... కాదా?
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకున్నారు. ఆమె బాధ్యతలు కూడా స్వీకరించారు. అయితే, రెండు విషయాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. కొందరు వ్యతిరేకించినప్పటికీ.. శశికళకు ఆ పదవి దక్కుతుందనే వాదనలు మొదటి నుంచీ ఉన్నాయి.
అయితే, ఆ పదవిలోను కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గురువారం ఉదయం వానగరంలోని శ్రీవారి మండపంలో పార్టీ నేతలు సమావేశమయ్యారు. పద్నాలుకు తీర్మానాలు ఆమోదించారు. శశికళకు పదవిని కట్టబెట్టారు.

ఈ రెండు ఆసక్తికరం
ఆసక్తికరమై విషయమేమంటే శశికళను మధ్యంతర లేదా తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మరో విషయం.. ఆమెను ఎన్నుకోలేదని, నియమించబడ్డారని పార్టీ స్పష్టంగా పేర్కొంది. తద్వారా ఆమె పార్టీకి తాత్కాలిక చీఫ్ మాత్రమే అని, కొత్త వారిని ఎన్నుకునే వరకేనని చెప్పే ప్రయత్నాలు చేశాయి.

వ్యతిరేకత రాకుండా ప్లాన్
ఎవరి నుంచి తీవ్ర విమర్శలు, వ్యతిరేకత రాకుండా ఉండేందుకు పక్కా ప్లాన్ ప్రకారమే ఇలా చేసి ఉంటారని అంటున్నారు. ఒకటి శశికళను ఎన్నుకోలేదని, నియమించామని చెప్పడం, రెండు.. తాత్కాలిక చీఫ్ మాత్రమే అని పార్టీ వర్గాలు చెప్పడం చర్చకు దారి తీశాయి.
జయలలిత మృతి చెంది దాదాపు ఇరవై అయిదు రోజులు అవుతోంది. పార్టీని ముందుకు నడిపించేందుకు శశికళ మినహా మరొకరు లేరని భావించడం వల్లే పార్టీ సీనియర్లు ఆమె వైపు మొగ్గు చూపించారు. అన్నాడీఎంకే పార్టీ ఏకవ్యక్తి పార్టీ. జయలలిత ఉన్నప్పుడు.. రెండో స్థానం ఎవరిది అనే చర్చనే లేదు.

ఆప్షన్ లేకనే శశికళ
జయలలిత మృతి అనంతరం శశికళ పేరు బాగా వినిపించినా కొందరు వ్యతిరేకించారు కూడా. జయలలిత నెచ్చెలి, ఆమెతో పాటు 40 ఏళ్లు కలిసి వెనుక నుంచి నిర్ణయాలలో కీలక పాత్ర పోషించినందునే శశికళకు పదవి కట్టబెట్టారు. పార్టీలో నెంబర్ టూ లేకపోవడం వల్ల.. జయ మిత్రురాలైన శశికళనే ఇప్పుడు పార్టీ వర్గాలకు ఆపద్భాందుగా కనిపించారు.

పన్నీరు సెల్వంపై ఊహాగానాలు చెలరేగినా..
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి శశికళకే దక్కుతుందని అందరికీ అర్థమైంది. అయితే శశికళ పుష్ప వ్యతిరేకించడం, పన్నీరు సెల్వం, ఇతర సీనియర్ నేతలు శశికళకు దూరం జరుగుతున్నారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో కొంత ఉత్కంఠ కనిపించింది. కానీ పన్నీరు సెల్వం సహా అందరూ ఆమెకు జై కొట్టారు.

శశికళ మరో సోనియా గాంధీయా?
ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ. తాత్కాలికమైనా కేసులు, పార్టీలో ఎంతో కొంత అసంతృప్తులు వంటి పలు వివాదాలు ముగిశాక పార్టీ పగ్గాలను పూర్తిగా ఆమె చేతిలో పెట్టే అవకాశాలే ఉన్నాయి. ఇప్పటికే ఆమె సీఎం కావాలని నేతలు కోరుకుంటున్నారు. అయితే, అప్పటి దాకా శశికళ మరో సోనియా గాంధీ అవుతారా అనే చర్చ సాగుతోంది.
2004లో సోనియా గాంధీ ప్రధాని పదవిని తిరస్కరించారు. దీంతో మన్మోహన్ సింగ్ తెరపైకి వచ్చారు. అయితే, పదేళ్ల పాటు మన్మోహన్ ప్రధాని అయినప్పటికీ.. వెనుక ఉండి చక్రం తిప్పింది మాత్రం సోనియా అని అంటుంటారు. ఇప్పుడు తమిళనాట చిన్నమ్మనే సీఎం అవుతారని మంత్రులు సహా పలువురు చెబుతుండటం వల్ల శశికళ మరో సోనియా కాదని.. అంటున్నారు.

సీఎం పదవిపై...
ఇప్పుడు పన్నీరు సెల్వం ఆమెకు మద్దతు ప్రకటించారు. ఆయనకు సీఎం పదవి పైన హామీ వచ్చి ఉంటుందని అంటున్నారు. కేసులు తేలాక అది వేరే విషయం. ప్రస్తుతానికి శశికళ చెప్పినట్లుగా ఆయన నడుచుకోవచ్చునని అంటున్నారు. జయ మృతి అనంతరం, తాను సీఎం అయ్యాక శశికళను కలిసేందుకు ఒకటికి రెండుసార్లు పన్నీరు సెల్వం పోయెస్ గార్డెన్ వెళ్లారు. పన్నీరు సీఎం అయినా చక్రం తిప్పేది శశికళనే అవుతుందనే ప్రచారం సాగుతోంది. అదే అయితే శశికళ మరో సోనియా గాంధీ అయినట్లవుతుందని అంటున్నారు. అయితే, ఇప్పుడు పార్టీ చీఫ్ బాధ్యతలు స్వీకరించిన శశికళ.. సీఎం పదవి వైపు పావులు కదిపే ప్రణాళికలో భాగంగానే పలువురు నేతలు ఆమె సీఎం కావాలని కోరుకోవడంగా కనిపిస్తోందంటున్నారు.

నాడు రాజీవ్ గాంధీ, నేడు శశికళ
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను నియమించారు. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని శశికళను పార్టీ చీఫ్‌గా నియమించడంపై కొందరు విమర్శలు చేశారు. అయితే, దీనికి అన్నాడీఎంకే పార్టీ వర్గాలు ఆసక్తికర పైన పాయింట్ లాగుతున్నాయి.
శశికళ పార్టీ పగ్గాలు చేపట్టక ముందు నుంచే అన్నాడీఎంకే పార్టీ వర్గాలు ఓ పాయింట్ లాగుతున్నాయి. ఇందిరా గాంధీ చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీ పైలట్ అని, ఆ సమయంలో ఆయనను అనూహ్యంగా తెరపైకి తీసుకు వచ్చారని, అలాంటప్పుడు శశికళకు పదవి కట్టబెడితే ఏమిటని అంటున్నారు.
శశికళకు రాజకీయ అనుభవం లేదని అంటున్నారని, కానీ నలభై ఏళ్ల పాటు జయలలిత వెనుక ఆమె ఉన్నారని, దాదాపు అమ్మ ప్రతి నిర్ణయం వెనుక ఆమె ఉన్నదని అంటున్నారు. ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేకున్నా.. ఆమె సత్తా తెలిసినందువల్లే, పార్టీ పగ్గాలు ఆమెకు ఇస్తేనే పార్టీకి లాభమని భావించే పగ్గాలు అప్పగించామని అంటున్నారు.

సీఎం పదవిపై ట్విస్ట్‌లు
పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత శశికళ కొద్ది రోజులకు సీఎం పదవి కూడా చేపడతారనే వాదనలు ఉన్నాయి. దీనిపై శశికళ పెదవి విప్పడం లేదు. అయితే నిన్నటి దాకా నేతలు, ఇప్పుడు మంత్రులు కూడా త్వరలో శశికళ సీఎం అవుతారని చెబుతుండటం గమనార్హం.