ఆ పని చేయగలరా?: అరవింద్ కేజ్రీవాల్‌కు యోగి ఆదిత్యనాథ్ సవాల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీని ఆప్ ప్రభుత్వం డంపింగ్ యార్డులా మార్చేసిందని ధ్వజమెత్తారు. విదేశాల నుంచి అక్రమ వలసలను అడ్డుకోవడంలో విఫలమైందని విమర్శించారు.
బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్నారని.. వారికి అన్ని రకాల సౌకర్యాలను ఆప్ ప్రభుత్వం కల్పిస్తోందని యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. ఢిల్లీని డంపింగ్ యార్డులా చేసిందని విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం యమునా నదిని మురికి కాలువగా మార్చిందని మండిపడ్డారు.
కుంభమేళా సందర్భంగా మంత్రులతో కలిసి ఇటీవల ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆరించినట్లు యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఇక్కడున్న యమునా నదిలో కేజ్రీవాల్ మునగగలరా? అని అరవింద్ కేజ్రీవాల్‌కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సవాల్ విసిరారు. దీనికి నైతిక సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

నొయిడా-ఘజియాబాద్ రోడ్లకు ఢిల్లీలోని అధ్వాన రహదారులకు చాలా తేడా ఉందన్నారు యోగి. ఢిల్లీలో మురుగు పొంగిపొర్లుతోందని విమర్శించారు. నీటి సమస్య కొరత ఢిల్లీ ప్రజలను వేధిస్తోందన్నారు. 24 గంటల విద్యుత్ షరఫరా చేయలేకపోతోందన్నారు. అంతేగాక, ప్రజల నుంచి మూడు రెట్లు ఛార్జీలు అదనంగా వసూలు చేస్తోందని మండిపడ్డారు.
మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కేజ్రీవాల్ పార్టీపై ధ్వజమెత్తారు. ఆప్ నేతల పని అబద్ధాలు చెప్పడమేనని ఎద్దేవా చేశారు యోగి ఇదిత్యనాథ్. మరోవైపు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. అబద్ధాల పోటీ పెడితే అరవింద్ కేజ్రీవాల్ తొలి స్థానంలో ఉంటారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications