వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రుడు లేకుంటే భూమికి మనుగడే లేదా... నేలకూ, జాబిలికీ ఉన్న బంధమేంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చంద్రుడు

"చంద్రుడు ఎర్రగా ఉంటే తీవ్రంగా గాలులు వీస్తాయి. పాలిపోయినట్లు ఉంటే వర్షం కురుస్తుంది. తెల్లగా ఉంటే వర్షమూ మంచూ అసలు కురవనే కురవవు." తరతరాలుగా ఈ భూమ్మీది ప్రజలు వాతావరణంలో వచ్చే మార్పుల గురించి చంద్రుని వంక చూస్తూనే ఉన్నారు. నిజమే, భూమి మీది వాతావరణాన్ని చంద్రుడు చాలా సున్నితంగా ప్రభావితం చేస్తాడు. వాతావరణ వ్యవస్థల్లో కూడా చంద్రుని ప్రభావం లేకుండా పోదు.

450 కోట్ల సంవత్సరాల కిందట రెండు పురాతన గ్రహాలు ఒకదానితో ఒకటి ఢీకొని, రెండూ కలిసిపోయి భూమిగా ఏర్పడ్డాయి. ప్రోటో ఎర్త్, థియా అనే ఈ రెండు గ్రహాలు ఢీకొనే సమయంలోనే ఒక చిన్న శిల పరిమాణంలోని ద్రవ్యరాశితో మన చంద్రుడు ఏర్పడ్డాడు. విశాలమైన అంతరిక్షంలో చంద్రుడు మనకు అత్యంత దగ్గరగా ఉంటాడు. మన ఉనికిలో అంతర్భాగంగా ఉంటాడు. తన కదలికల ద్వారా భూమి మీద ఉన్న జీవరాశిపై ప్రభావం చూపుతుంటాడు.

చంద్ర గమనం వల్ల భూమిపై కలిగే ప్రభావాల గురించి ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. నిజంగా చంద్రుని ప్రభావం మనపై ఎప్పుడు ఉంటుంది? దీనితో పాటు చంద్ర ప్రభావం అంటూ చెప్పే కల్పిత అంశాలేంటో గుర్తించడం కూడా ఇప్పుడు మనముందున్న సవాలు.

అస్థిర కక్ష్య

సముద్రపు ఆటుపోట్ల ద్వారా భూమిపై చంద్రుడు కలిగించే ప్రభావాన్ని మనం చూడొచ్చు. భూమి ప్రతిరోజూ తన చుట్టు తాను తిరుగుతున్నప్పుడు చంద్రుని గురుత్వాకర్షణ ప్రభావం వల్ల సముద్రాలలోని నీరు సమీపంలోని నేల వైపుకు ఆకర్షితమవుతుంది. ఫలితంగా నీరు ఉవ్వెత్తుగా లేస్తుంది. అదే సమయంలో భూభ్రమణం కారణంగా ఏర్పడ్డ అపకేంద్ర బలంతో నీరు నేల నుంచి సముద్రం లోపలి వైపుకు కూడా అంతే ఎత్తుతో వెళ్తుంది. ఈ అలల కింద భూమి తిరుగుతూ ఉంటుంది. అందుకే సముద్రంలో ప్రతిరోజూ రెండు చొప్పున అధిక, అల్ప ఆటుపోట్లు ఏర్పడతాయి.

ప్రతీ 18.6 ఏళ్లకు ఒకసారి చంద్రుని కక్ష్య భూమధ్యరేఖకు గరిష్టంగా +5 లేదా కనిష్టంగా -5 డిగ్రీలు కదులుతూ ఉంటుంది. 1728లో తొలిసారిగా గుర్తించిన ఈ ప్రక్రియను 'లూనార్ నోడల్ సైకిల్' అని పిలుస్తారు. భూమధ్యరేఖకు చంద్రుని కక్ష్య దూరంగా వెళ్లినప్పుడు అల్ప ఆటుపోట్లు, భూమధ్యరేఖకు సమాంతరంగా వచ్చినప్పుడు అధిక ఆటుపోట్లు ఏర్పడుతుంటాయి.

వాతావరణ మార్పుల కారణంగానే సముద్రమట్టాలు పెరుగుతున్నాయని నాసా చెబుతోంది. దీనికి తోడు 'లూనార్ నోడల్ సైకిల్' కూడా ప్రభావం చూపిస్తే 2030ల నాటికి అధిక ఆటుపోట్లతో కూడిన వరదలు గణనీయంగా పెరుగుతాయని వెల్లడించింది.

సహజ సిద్ధంగా, మానవ చర్యల ఫలితంగా సముద్ర మట్టాలు ఎలా స్పందిస్తాయి. వాటివల్ల తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఎలాంటి ప్రభావాలు కలుగుతాయో అనే అంశంపై 'నాసా సీ లెవల్ చేంజ్ సైన్స్ టీమ్' లీడ్, పరిశోధక శాస్త్రవేత్త బెంజమిన్ హామ్లింగ్టన్ ఆసక్తి చూపుతున్నారు. హామ్లింగ్టన్ కాలిఫోర్నియాకు వెళ్లకముందు వరద ప్రభావిత ప్రాంతమైన కోస్టల్ వర్జీనియాలో నివసించేవారు.

'తీర ప్రాంత సమాజాలపై వరదలు విస్తృతమైన ప్రభావాన్ని చూపుతాయి. ఉద్యోగ అవకాశాలను, వ్యాపార నిర్వహణను కష్టతరం చేస్తాయి. ప్రస్తుతం ఇది ఇబ్బందికర అంశంగా ఉంది. కానీ రానున్న కాలంలో దీన్ని మర్చిపోవడం కష్టమే. దీంతో బతకడం కూడా కష్టమే అవుతుంది' అని ఆయన అన్నారు.

చంద్రుడు

చంద్రుని ప్రభావంతో కూడిన ఈ వరదలు మౌలిక వసతులను నాశనం చేయడంతో పాటు తీరప్రాంత హద్దులను చెరిపేస్తాయి. 'ఒక దశాబ్దానికి, మరో దశాబ్దానికి మధ్య వచ్చే వరదల సంఖ్య 4 రెట్లు పెరగవచ్చు. భూమిపైనున్న అన్ని ప్రాంతాలను లూనాల్ నోడల్ సైకిల్ ప్రభావితం చేస్తుంది. ప్రతిచోట సముద్ర మట్టాలు పెరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అధిక ఆటుపోట్లతో కూడిన వరదలు వేగంగా పెరగడాన్ని మనం చూస్తాం' అని హామ్లింగ్టన్ అన్నారు.

'లూనార్ నోడల్ సైకిల్' కారణంగా మానవజాతికి చాలా సవాళ్లు ఎదురుకావొచ్చు. కానీ తీరప్రాంత పర్యావరణంలో నివసించే వన్యజాతి అస్తిత్వానికే ఇది ముప్పుగా మారనుంది.

రట్‌గర్స్ యూనివర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్ ఐలియా రాష్లిన్, ఉప్పు బయళ్లలోని దోమల జనాభాకు లూనార్ నోడల్ సైకిల్‌కు మధ్య ఉండే సంబంధం గురించి అధ్యయనం చేశారు.

నోడల్ సైకిల్ గరిష్ట స్థితిలో ఉన్నప్పుడు అధిక ఆటుపోట్లతో కూడిన వరదలు, దోమల ఆవాసాలను భూభాగం వైపుకు నెట్టుతాయని రాష్లిన్ చెప్పారు. ఈ వరదలు తమతో పాటు కిల్లిఫిష్‌లను తీసుకువస్తాయి. ఉప్పునీటిలో, నిల్వ నీటిలో ఈ రకమైన చేపలు ఉంటాయి. ఇవి గుడ్లను, లార్వా, ప్యూపా దశల్లో ఉన్న దోమలను తినేసి వాటి జనాభాను తగ్గిస్తాయి.

''అందువల్ల నోడల్ సైకిల్ గరిష్ట స్థితిలో ఉన్నప్పుడు దోమల జనాభా తక్కువగా ఉంటుంది'' అని రాష్లిన్ తెలిపారు. ''నోడల్ సైకిల్ పతన దశలో ఉన్నప్పుడు దోమల ఆవాసాలు కదలకుండా ఉంటాయి. ఫలితంగా వాటి జనాభా పెరగుతుంది.''

ఇది కేవలం దోమల వరకే పరిమితం కాదు. ఎన్నో జాతులపై ప్రభావితం చూపుతుంది. ఉప్పునీటి బయళ్లలో రొయ్యలు, పీతలు, నత్తలు, మిడతలు లాంటి ఇతర కీటకాలు జీవిస్తుంటాయి. ఇవన్నీ తీరప్రాంతాల్లోని పక్షులకు, చేపలకు ఆహారంగా ఉంటాయి.

''గరిష్ట స్థితిలోని లూనార్ నోడల్ సైకిల్ ప్రభావం, సముద్రమట్టాల పెరుగుదల రెండూ కలిస్తే ఉప్పునీటి బయళ్లు మునిగిపోయే ప్రమాదం ఏర్పడుతుందని'' రాష్లిన్ చెప్పారు.

salt marsh

ఉప్పునీటి బయళ్లలోని జీవులు మునిగిపోయినప్పుడు వాటిని ఆహారంగా తీసుకునే చేపలు ఇతర జాతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఈ ఉప్పునీటి బయళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఉంటాయి. ఇవి 75శాతం చేప జాతులకు నర్సరీలుగా ఉన్నాయి.

భూమిపై ఉండే పలు వ్యవస్థలతో పోలిస్తే ఈ ఉప్పు నీటి బయళ్లు కార్బన్‌ను అధిక మొత్తంలో నిల్వ చేసుకుంటాయి. ఈ విధంగా ఇవి పర్యావరణంలోనూ ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఉప్పునీటి బయళ్ల కంటే కూడా మంచి నీటి చిత్తడి నేలలు 10 రెట్లు ఎక్కువగా కార్బన్‌ను గ్రహిస్తాయి. వరదలు, సముద్రమట్టాలు పెరగడం వల్ల మంచినీటి బయళ్లు కూడా తీవ్ర మార్పులకు గురవుతాయి.

''మంచినీటి చిత్తడి నేలలు రోజంతా అలల పోటులో హెచ్చుతగ్గులను ఎదుర్కొంటాయి. ఉప్పునీటి బయళ్లతో పోలిస్తే ఇవి మరింత జీవవైవిధ్యాన్ని కలిగి ఉంటాయి'' అని నార్తర్న్ కెంటరీ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త క్రిస్టిన్ హాప్‌ఫెన్స్‌పెర్గర్ చెప్పారు. ఆమె మంచినీటి బయళ్ల గురించి అధ్యయనం చేశారు.

''మొక్కల్లో, ఆహార గొలుసు ప్రాథమిక దశలో మార్పు మొదలవగానే వాటిపై ఆధారపడే జంతువులు, చేపలు, పక్షులు, కీటకాలు, మొక్కల్లో కూడా మార్పు మొదలవుతుంది. ఎందుకంటే అవి నిపుణులు కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటాయి. లవణీయత పెరిగేకొద్ది మంచినీటి బయళ్లు కూడా బాగా ప్రభావితం అవుతాయి.

సముద్రమట్టాలు పెరిగేకొద్దీ మంచినీటి చిత్తడి నేలల లవణీకరణ పెరుగుతూనే ఉంటుంది. తరచుగా వరదలు వస్తుంటే ఈ చిత్తడినేలలు ఎక్కువగా ఉప్పదనానికి గురవుతుంటాయి.

అలల ఆటుపోట్లు లేని ప్రపంచం విభిన్న వాతావరణ పరిస్థితులను కలిగి ఉండేది. సముద్ర ప్రవాహాల చలనాన్ని ప్రభావితం చేసే అంశాల్లో అలలు కూడా ఉన్నాయి. వెచ్చని నీటి సముద్ర ప్రవాహాల వల్ల వెచ్చని వాతావరణం, చల్లని నీటి సముద్ర ప్రవాహాల వల్ల చల్లని, పొడి వాతావరణం ఏర్పడుతుంది.

భూమిపై వాతావరణాన్ని ఏర్పరిచే ముఖ్యమైన అంశాలను కూడా లూనార్ నోడల్ సైకిల్ ప్రభావితం చేస్తుంది. సాధారణంగా భూమధ్యరేఖ వెంట బలమైన గాలులు దక్షిణ అమెరికా నుంచి ఇండోనేసియా వైపుకు వెచ్చని నీటిని వెదజల్లుతాయి. వాటి స్థానంలో చల్లని నీటిని ఏర్పరుస్తాయి.

ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పుడు ఈ గాలులు బలహీనపడతాయి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వాతావరణం ప్రభావితం అవుతుంది. దక్షిణ అమెరికాలోని పశ్చిమ తీరం వద్ద వెచ్చని నీటి ఉపరితలం ఏర్పడుతుంది. చల్లని నీరు సముద్రం లోపలే ఉండిపోతుంది. దీనివల్ల ఒక్కోసారి తడి ప్రాంతాల్లో కరువు ఏర్పడవచ్చు... పొడి ప్రాంతాల్లో వర్షాలు కురవవచ్చు.

మరోవైపు లానినా ప్రభావం, ఎల్‌నినోకు వ్యతిరేక ప్రభావాలను చూపుతుంది. లానినా ఏర్పడినప్పడు సాధారణం కన్నా బలమైన గాలులు వీస్తాయి. ఇవి వెచ్చని నీటిని ఆసియా వైపుకు నెట్టుతాయి. అమెరికా తీర ప్రాంతాల్లోని చల్లటి నీరు ఉత్తరవైపుకు చేరుతుంది. దీని ఫలితంగా దక్షిణాదిన శీతాకాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా... ఉత్తరాన సాధారణం కన్నా చల్లగా ఉంటాయి.

లానినో, ఎల్‌నినో ప్రభావాలు రెండూ కూడా ఎన్‌నినో సదరన్ ఆసిలేషన్ (ఈఎన్‌ఎస్ఓ)లో భాగంగా ఉంటాయి. (ఫసిపిక్ మహాసముద్రంపై సముద్ర మట్టంలో గాలి ఒత్తిడిలో మార్పును సదరన్ ఆసిలేషన్ సూచిస్తుంది.)

లూనార్ టైడల్ గురుత్వాకర్షణ బలం వల్ల ఏర్పడే సముద్రపు అల ప్రభావం కారణంగానే లానినో, ఎల్‌నినో ప్రభావాలు ఏర్పడతాయని ఓహియో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సూచించారు. చంద్రుని 18.6 ఏళ్ల నోడల్ చక్రం ఆధారంగానే ఎన్‌నినో సదరన్ ఆసిలేషన్‌ను అంచనా వేయవచ్చని టోక్యో యూనివర్సిటీ నివేదికలో పేర్కొంది.

''సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలపై లూనార్ నోడల్ ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుందని యూకే నేషనల్ ఓషనోగ్రఫీ సెంటర్ శాస్త్రవేత్త ఫిల్ వుడ్‌వర్త్ చెప్పారు. అలల ప్రవాహాలను చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ప్రభావితం చేస్తుంది. అందుకే సముద్ర ఉపరితలాల కదలికలు ఏర్పడతాయి. ఇది ముఖ్యంగా ఉత్తర పసిఫిక్ ప్రాంతానికి వర్తిస్తుంది అని వుడ్‌వర్త్ అన్నారు.

గాలి, నేల, మంచు

రాబోయే దశాబ్దాలలో లూనార్ నోడల్ సైకిల్ వల్ల గణనీయ మార్పులు జరుగనున్నాయి. ఆలోగానే మనకు తెలిసిన కొన్ని ఇతర మార్గాల్లో చంద్రుడు, భూమిని ప్రభావితం చేయనున్నాడు.

ధ్రువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను, ఆర్కిటిక్ మంచులో హెచ్చు తగ్గులను చంద్రుడు ప్రభావితం చేస్తాడని భావిస్తున్నారు. ఇక్కడ చంద్రుని 18.6 ఏళ్ల నోడల్ చక్రం ప్రభావం ఏమీ లేదు. చంద్రుని కాంతిలో ఉండే నెలవారీ వ్యత్యాసం ఈ ప్రభావాన్ని చూపుతుంది. పౌర్ణమి రోజున ధ్రువాలు 0.55 డిగ్రీ సెల్సియస్ వెచ్చదనాన్ని కలిగి ఉంటాయని ఉపగ్రహ కొలతల ద్వారా తెలిసింది.

అలల వల్ల మంచు ఫలకలు విరగడంతో పాటు, సముద్రపు ఉష్ణ ప్రవాహాల్లో మార్పులు జరుగుతాయి.

చంద్రుడు సముద్ర గర్భంలో, ఉపరితలంపై అలల ప్రవాహాలతో పాటు తరంగాలను ఏర్పరుస్తాడని నేషనల్ ఓషనోగ్రఫీ సెంటర్ మరైన్ ఫిజిక్స్ అండ్ ఓషన్ క్లైమేట్ నిపుణులు క్రిస్ విల్సన్ పేర్కొన్నారు. ''ఈ ప్రవాహాలు సముద్రపు మంచును కరిగించడం లేదా విచ్ఛిన్నం చేస్తాయి.''

సముద్రాల్లోని నీరు, మంచుపై మాత్రమే కాకుండా భూమి, వాతావరణంపై కూడా చంద్రుని వల్ల అలలు ప్రభావాన్ని చూపుతాయి.

భూమిపై కూడా సముద్రపు ఆటుపోట్ల తరహాలోనే చంద్రుడు ప్రభావం చూపుతాడు. భూకంపాలు రావడానికి, అగ్నిపర్వతాలు బద్దలు కావడానికి చంద్రుడే కారణం అని భావిస్తున్నారు.

వాతావరణంలో జరిగే ఆటుపోట్ల వల్ల వాతావరణ పీడనంలో మార్పులు కలుగుతాయి. చంద్రుని కారణంగా వాతావరణ పీడనంలో కలిగే మార్పులను 1847లో తొలుత గుర్తించారు. నీటిలో జరిగినట్లే చంద్రుని గురుత్వాకర్షణ బలం వల్ల భూమిపై కూడా చలనాలు ఏర్పడతాయి.

''వాతావరణ పీడనంలో మార్పులు, గాలి ఉష్ణోగ్రతలతో ముడిపడి ఉంటాయి. ఈ సందర్భంలో గాలి అణువులు, నీటి ఆవిరి రూపంలో ఎక్కువ తేమను కలిగి ఉంటాయి. ఫలితంగా వర్షపాతానికి కారణమవుతాయి'' అని రాయల్ మెటలర్జికల్ సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లిజ్ బెంట్లీ చెప్పారు. ఫలితంగా తక్కువ పీడనం వల్ల తడి వాతావరణం, ఎక్కువ పీడనం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

కానీ, వాతావరణ ఆటుపోట్లపై చంద్రుని ప్రభావం సూర్యునితో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంటుంది. చంద్రుని ప్రభావం కారణంగా కేవలం 1 శాతం వర్షపాతమే నమోదవుతుందని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు నివేదికలో తెలిపారు.

చంద్రుని ప్రభావం భూమిపై కొన్నిసార్లు సూక్ష్మంగా, మరికొన్నిసార్లు చాలా లోతుగా ఉంటుంది. కొంతమంది శాస్త్రవేత్తలు చంద్రుని కారణంగానే భూమి మీద మనుగడ సాధ్యమవుతోందని వాదిస్తారు. భూమి స్థిరంగా తిరిగేలా, భూమిపై స్థిరమైన వాతావరణం ఏర్పడేలా చంద్రుడే సహాయపడుతున్నారని అంటారు. చంద్రుడు లేకుంటే భూమి అస్థిరంగా కదులుతుండేది. భూకక్ష్యకు అనుగుణంగా ధ్రువాలు గణనీయంగా కదులుతాయి. రుతువులు, రాత్రి పగళ్లు అన్నీ చాలా భిన్నంగా ఉండేవని అంటారు.

కానీ, భూమిపై ఏర్పడుతోన్న ఆటుపోట్లు చంద్రున్ని మన నుంచి దూరం చేస్తున్నాయి. ఈ ఆటుపోట్ల కారణంగా ప్రతీ ఏడాది చంద్రుడు, భూమికి 4 సెం.మీ దూరం జరుగుతున్నాడు. చంద్రుని కంటే భూమి వేగంగా తిరుగుతుంది. కాబట్టి గురుత్వాకర్షణ శక్తి చంద్రున్ని వేగంగా లాగుతుంటుంది. తద్వారా చంద్రుడు తిరిగే వేగం కాస్త పెరగడంతో, దాని కక్ష్య కూడా పెద్దదిగా మారుతుంది.

విశాలమైన విశ్వంలో చంద్రుడు మనకు సన్నిహిత మిత్రుడు. చంద్రుడు లేకుంటే భూమి చాలా ఒంటరి గ్రహంగా మారి ఉండేది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Can the earth survive without the moon or What is the connection between the earth and the moon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X