వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CARA: భారత్‌లో బిడ్డను దత్తత తీసుకోవడం ఎందుకంత కష్టం, నిబంధనలు ఏం చెబుతున్నాయి, ప్రక్రియ ఏమిటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
CARA

"దత్తత కోసం CARA లో దరఖాస్తు పెట్టుకుని మూడేళ్లయింది.. ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాం. మా వంతు ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇంతకుముందు CARA హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేస్తే సమాచారం ఇచ్చేవారు. ఈమధ్య వాళ్లు స్పందించట్లేదు. మాలాంటి వాళ్లందరి కోసం ఒక ఫేస్‌బుక్ గ్రూపు ఉంది. అక్కడి నుంచే మాకు కొద్దో గొప్ప సమాచారం వస్తుంటుంది. ఇటీవల రూల్స్ మారాయి. కానీ, వాటి గురించి ఎవరికీ స్పష్టత లేదు. ఎవరిని అడిగినా సరైన సమాచారం ఇవ్వట్లేదు. మేం ఇలా ఎంత కాలం వేచి చూడాలో తెలియట్లేదు. రోజు రోజుకూ ఆశ సన్నగిల్లుతోంది" అన్నారు 37 ఏళ్ల స్రవంతి.

స్రవంతి దంపతులకు నాలుగేళ్ల బాబు ఉన్నాడు. రెండవ బిడ్డ కోసం CARAలో దరఖాస్తు పెట్టుకున్నారు. స్రవంతి లాగ దరఖాస్తు పెట్టుకుని ఏళ్ల తరబడి వేచి చూస్తున్నవాళ్లు ఎంతోమంది ఉన్నారు.

భారతదేశంలో బిడ్డను దత్తత తీసుకోవడం అంత కష్టమా? నిబంధనలు ఏం చెబుతున్నాయి? దత్తత ప్రక్రియ ఏమిటి?

దత్తత అంటే ఏమిటి?

అనాథ, వదిలివేసిన లేదా విడిచిపెట్టిన పిల్లలను చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా తమ బిడ్డలుగా చేసుకోవడాన్నే దత్తత అంటారు. కడుపున పుట్టిన బిడ్డపై ఎలాంటి హక్కులు, అధికారాలు, బాధ్యతలు ఉంటాయో దత్తత తీసుకున్న బిడ్డపై కూడా అవే హక్కులు, అధికారాలు, బాధ్యతలు చట్టబద్ధంగా తల్లిదండ్రులకు సంక్రమిస్తాయి.

అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలను దత్తత తీసుకోవచ్చు.

CARA అంటే ఏమిటి? ఇది ఏం చేస్తుంది?

సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (CARA) అనేది భారతీయ పిల్లలను దత్తత తీసుకోవడానికి నోడల్ అథారిటీ.

  • ఇది భారత ప్రభుత్వంలోని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ క్రింద పనిచేసే చట్టబద్ధమైన సంస్థ.
  • దీనికి దేశంలోను, దేశం బయట దత్తత (భారతీయ పిల్లల)ను నియంత్రించడానికి, పర్యవేక్షించడానికి అధికారం ఉంది.
  • పిల్లలను దత్తత తీసుకోవాలనుకునేవాళ్లు CARA (కారా) ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి.
  • హేగ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్-కంట్రీ అడాప్షన్, 1993 నిబంధనలను భారతదేశం 2003లో ఆమోదించింది. ఈ ఒప్పందం ప్రకారం భారతీయ పిల్లలను వేరే దేశాల్లో ఉన్నవారు కూడాదత్తత తీసుకోవచ్చు. దేశం బయట (ఇంటర్-కంట్రీ) దత్తతల నియంత్రణ, పర్యవేక్షణ కారా ఆధ్వర్యంలోనే ఉంటుంది.
  • భారతదేశంలో అనాథ, వదిలివేసిన లేదా విడిచిపెట్టిన పిల్లలను దత్తత తీసుకోవడానికి కారా ప్రాథమిక మార్గం. కారా అనుబంధ లేదా గుర్తింపు పొందిన దత్తత ఏజెన్సీల ద్వారా ఈ పని జరుగుతుంది.
  • కారా సంస్థను 1990లో స్థాపించారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015 కింద దీనికి చట్టబద్ధత కల్పించారు.

CARA లో దరఖాస్తు పెట్టుకోవడానికి అర్హతలేమిటి?

దత్తత కోసం కారాలో దరఖాస్తు పెట్టుకునేవారిని ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్ (పీఏపీ) అంటారు. దత్తత ప్రక్రియ ముగిసేవరకు వీరిని ఇదే పేరుతో వ్యవహరిస్తారు. దత్తత తీసుకోవడానికి ఈ కింది అర్హతలు, ప్రమాణాలు ఉండాలి.

1. పీఏపీలు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా స్థిరపడినవారై ఉండాలి. ప్రాణాంతకమైన వ్యాధులేవీ ఉండకూడదు.

2. పెళ్లితో సంబంధం లేకుండా ఎవరైనా దత్తతకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. వారికి కడుపున పుట్టిన బిడ్డలు ఉన్నా కూడా మరో బిడ్డను దత్తత తీసుకోవచ్చు. అయితే, ఈ కింది షరతులు వర్తిస్తాయి.

  • a) పెళ్లయిన జంటలలో, భాగస్వాములిద్దరి అంగీకారం ఉండాలి.
  • b) ఒంటరి మహిళ అయితే ఆడ, మగ ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు.
  • c) ఒంటరి పురుషుడు మాత్రం ఆడపిల్లను దత్తత తీసుకోలేరు. కేవలం మగపిల్లాడిని దత్తత తీసుకోవచ్చు.

3. కనీసం రెండేళ్లు స్థిరమైన వైవాహిక బంధంలో ఉన్న జంటకు మాత్రమే బిడ్డను దత్తతకు ఇస్తారు.

4. కారాలో రిజిస్ట్రేషన్ తేదీ నాటికి పీఏపీల వయసును పరిగణలోకి తీసుకుని ఏ వయసు పిల్లలను దత్తత తీసుకోవడానికి వారికి అర్హత ఉందో నిర్ణయిస్తారు. ఈ కింది పట్టిక చూడండి.

5. దంపతులు దత్తతకు దరఖాస్తు పెట్టుకుంటే ఇద్దరి ఉమ్మడి వయసును పరిగణిస్తారు.

6. తల్లిదండ్రులకు, దత్తత తీసుకోబోయే బిడ్దకు మధ్య కనీసం 25 సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉండాలి.

7. అయితే, బంధువుల పిల్లలను లేదా సవతి పిల్లలను దత్తత తీసుకునేవారికి వయసు ప్రమాణాలు వర్తించవు.

8. ముగ్గురు లేదా అంత కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి దత్తత ఇవ్వరు. దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. రెగ్యులేషన్ 2లోని సబ్ రెగ్యులేషన్ (21) కింద స్పెషల్ నీడ్ చిల్డ్రన్ (ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు) అయితే, రెగ్యులేషన్ 50లో నిర్వచించినట్టుగా దత్తత ఇవ్వడానికి కష్టమయ్యే పిల్లలు అయితే, బంధువుల లేదా సవతి పిల్లలు అయితే.. ఆ జంటకు ముగ్గురు లేదా నలుగురు పిల్లలున్నా దత్తతకు ఇవ్వవచ్చు.

9. దరఖాస్తు చేసుకున్న తేదీని పరిగణిస్తూ, సీనియారిటీ బట్టి దత్తత ఇస్తారు.

దత్తత

భారతదేశంలో దత్తత చట్టాలు ఏం చెబుతున్నాయి?

భారతదేశంలో దత్తతకు సంబంధించి రెండు చట్టాలు ఉన్నాయి. ఒకటి హిందూ దత్తత, నిర్వహణ చట్టం 1956 (HAMA), రెండవది జువెనైల్ జస్టిస్ యాక్ట్‌ 2015.

హిందూ దత్తత చట్టం కేవలం హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ మతాలకు చెందిన వారు HAMA కింద పిల్లలను దత్తత తీసుకోవచ్చు.

ముస్లింలు, క్రిస్టియన్లు, పర్షియన్లు, యూదులకు ఈ చట్టం వర్తించదు. ఈ మతాలకు చెందినవారు 1890 గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ కింద పిల్లలకు కేవలం గార్డియన్లుగా మాత్రమే ఉండగలరు.

హిందూ దత్తత చట్టం నిబంధనలు

ఈ చట్టం హిందువులకు తమ బంధువుల పిల్లలను దత్తత తీసుకోవడానికి వెసులుబాటు కలిపిస్తుంది.

  • ఈ చట్టం ప్రకారం దత్తతకు ఇరువర్గాల వారి నుంచి అంగీకారం తప్పనిసరిగా ఉండాలి.
  • ఒక పురుషుడు ఒక ఆడ పిల్లను దత్తత తీసుకోవాలని అనుకుంటే, ఇద్దరి మధ్య 21 ఏళ్ల తేడా ఉండాలి.
  • ఒక మహిళ ఒక మగ పిల్లాడిని దత్తత తీసుకోవాలని అనుకుంటే కూడా వారి మధ్య 21 ఏళ్ల తేడా ఉండాలి.
  • దత్తత తీసుకునే వారు మానసికంగానూ, ఆర్థికంగానూ బిడ్డ బాగోగులు చూసుకునే పరిస్థితిలో ఉండాలి.
  • దత్తత ఇచ్చేవారు కూడా బిడ్డ సొంత తల్లిదండ్రులు, లేక సహజ సంరక్షులు అయివుండాలి.
  • ఒక్కసారి బిడ్డను దత్తత తీసుకున్న తరువాత, ఆ బిడ్డపై సర్వ హక్కులు దత్తత తీసుకున్న తల్లిదండ్రులకే ఉంటాయి.
  • దత్తత తీసుకునే ముందు ఆ బిడ్డకి ఇచ్చిన ఆస్తులు లేక బహుమతులు ఏమైనా ఉన్నా అవి ఆ బిడ్డకే చెందుతాయి.

జువెనైల్ జస్టిస్ యాక్ట్‌ 2015లోని కొన్ని ముఖ్యాంశాలు...

జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం, దత్తత ఇచ్చేవారు, తీసుకునేవారు ఒకరికొకరు పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. అలాగే, ఏ కులం, మతం వారైనా ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు. దీనికి తప్పనిసరిగా CARA నియమావళిని అనుసరించాలి.

  • జువెనైల్ జస్టిస్ యాక్ట్ చాప్టర్ 8 లోని సెక్షన్ 56 నుంచి 73 వరుకు ఉన్న నిబంధనల ప్రకారం, దంపతులు మాత్రమే పిల్లలను దత్తత తీసుకోవచ్చు. ఇద్దరి సమ్మతి ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటారు.
  • ఈ యాక్ట్‌లో కూడా ఆర్థికంగా, శారరీకంగా, మానసింగా వారు బిడ్డను మంచి వాతావరణంలో పెంచగలరు అన్న నమ్మకం ఉంటేనే దత్తత తీసుకోవచ్చు.
  • ఎన్జీవోలు కూడా దత్తత తీసుకోవచ్చు. అయితే, ఎన్జీవోలు లేదా అనాథ శరణాలయాలకు అధికారిక రిజిస్ట్రేషన్ ఉండాలి.
  • ఒంటరిగా ఉండే పురుషుడు ఆడపిల్లను దత్తత తీసుకోరాదు.

ఏ పిల్లలు దత్తతకు వెళ్లవచ్చు?

1. అనాథ, వదిలివేసిన లేదా విడిచిపెట్టిన పిల్లలు. వీరిని దత్తత తీసుకోవడానికి చట్టబద్ధమైన అనుమతి ఉంది అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్ణయించాలి.

2. బంధువుల పిల్లలు దత్తత వెళ్లవచ్చు.

3. సవతి పిల్లలు దత్తతకు వెళ్లవచ్చు.

ఎన్నారైలకు, విదేశీయులకు నిబంధనలు

భారతదేశం 2003లో హేగ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్-కంట్రీ అడాప్షన్, 1993ని ఆమోదించిన తరువాత, దత్తత విషయంలో భారతీయ తల్లిదండ్రులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ 2014లో నరేంద్ర మోదీ ప్రధాని పదవిని చేపట్టిన తరువాత దత్తత చట్టాల్లో సవరణలు తీసుకువచ్చి ఇండియన్ పేరెంట్స్‌కు, ఎన్నారైలకు సమాన ప్రాధాన్యాలను కల్పించారు.

  • ఎన్నారైలే కాక హేగ్ కన్వెన్షన్‌ను ఆమోదించిన ఏ దేశవాసులైనా భారతీయ పిల్లలను దత్తత తీసుకోవచ్చు.
  • వీరు దత్తత కోసం ఆథరైజ్డ్ ఫారిన్ అడాప్షన్ ఏజెన్సీని లేదా సంబంధిత సెంట్రల్ అథారిటీని సంప్రదించాలి. ఒకవేళ ఆ దేశాలలో ఇలాంటి సంస్థలు లేకపోతే, అక్కడి ప్రభుత్వ విభాగాన్ని లేదా దీనికి సంబంధించిన భారత దౌత్య విభాగాన్ని సంప్రదించాలి.
  • పై సంస్థలు/విభాగాలు దత్తత తీసుకోవాలనుకునే జంట గురించి హోం స్టడీ చేసి రిపోర్ట్ అందించిన తరువాత, ఆ జంట చైల్డ్ అడాప్షన్ రిసోర్స్ ఇంఫర్మేషన్ అండ్ గైడెన్స్ సిస్టం ద్వారా తమ అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోవాలి. కావలసిన డాక్యుమెంట్లన్నీ సమర్పించాలి.
  • వీరికి సీనియారిటీ బట్టి దత్తత అవకాశాలు ఉంటాయి.
  • దత్తత లభించిన తరువాత రెండు నెలల లోపు విదేశీ తల్లిదండ్రులు భారతదేశానికి వచ్చి బిడ్డను తీసుకెళ్లాలి. కారా నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వస్తే బిడ్డకు వీసా వస్తుంది.

కారాలో రిజిస్టర్ చేసుకున్న తరువాత దత్తత ప్రక్రియ ఎలా సాగుతుంది?

కారాను స్థాపించడం ద్వారా దేశంలో దత్తత విధానాన్ని కేంద్రీకృతం చేసినప్పటికీ, దత్తత ప్రక్రియ మొత్తం జిల్లా స్థాయిలో జరుగుతుంది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రొటెక్షన్ ఆఫీసర్ (ఎన్ఐసీ) దేవేంద్ర చారి దత్తత ప్రక్రియను బీబీసీకి వివరించారు.

"మొదట ఆన్‌లైన్‌లో కారా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. దానితో పాటు ఏడు పత్రాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీ ఫొటో, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మెడికల్ సర్టిఫికెట్, డేట్ ఆఫ్ బర్త్, మ్యారేజ్ సర్టిఫికెట్.. ఇవి అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ లివ్ ఇన్ బంధంలో ఉన్నవాళ్లు లేదా విడాకులు తీసుకున్నవాళ్లు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే దాని గురించి వివరంగా చెప్పాలి. అక్కడితో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

తరువాత, వాళ్ల దరఖాస్తు జిల్లా స్థాయి ఏజెన్సీకి వస్తుంది. ఏజెన్సీ అధికారులు దరఖాస్తు పెట్టుకున్న వ్యక్తులను (పీఏపీలను) పిలిపించి వారు అప్‌లోడ్ చేసిన పత్రాలన్నిటినీ తనిఖీ చేస్తారు. అలాగే రూ. 6000 డీడీ తీసుకుంటారు.

అనంతరం, హోం స్టడీ చేస్తారు. సంబంధిత అధికారిని పీఏపీ ఇంటికి పంపిస్తారు. వాళ్లు చెప్పినదంతా నిజమా, కాదా, ఇరుగుపొరుగుతో ఎలా వ్యవహరిస్తున్నారు, కడుపున పుట్టిన పిల్లలు ఉన్నారా లేదా వంటి విషయాలన్నీ ధృవీకరిస్తారు. కారాలో రిజిస్టర్ చేసుకున్న నెల లోపు హోం స్టడీ జరగాలి. తరువాత హోం స్టడీ రిపోర్టును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. అప్పటి నుంచి పీఏపీలు వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటారు. సీనియారిటీ ప్రకారం, వెయిటింగ్ లిస్ట్ ముందుకు కదులుతూ ఉంటుంది" అని దేవేంద్ర చారి చెప్పారు.

దేశంలో ఎక్కడి నుంచైనా కారాలో దరఖాస్తు పెట్టుకోవచ్చుగానీ, తమ జిల్లా పరిధిలో మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలని ఆయన చెప్పారు. అంటే అది నేషనల్ పోర్టల్ కానీ పర్యవేక్షణ జిల్లా పరిధిలోనే జరుగుతుంది.

"దరఖాస్తు పెట్టుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు ఏవైనా మూడు రాష్ట్రాలను ఎంపిక చేసుకోవచ్చు. అప్పుడు ఆ రాష్ట్రాల నుంచే పిల్లలను వారికి దత్తతకు ఇస్తారు. ఉదాహరణకు మీరు దిల్లీలో ఉంటే దిల్లీ పరిధిలోనే రిజిస్టర్ చేసుకోవాలి. కానీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు.. ఇలా మూడు రాష్ట్రాల ప్రిఫరెన్స్ ఇవ్వవచ్చు. అప్పుడు ఈ మూడు రాష్ట్రాల నుంచే మీకు పిల్లలను దత్తత ఇస్తారు. ఏ ప్రిఫరెన్స్ లేకపోతే దేశంలోని ఏ మూల నుంచైనా మీకు పిల్లలను దత్తత ఇస్తారు."

కారాలో రిజిస్టర్ చేసుకోగానే ఒక ఐడీ, పాస్‌వర్డ్ ఇస్తారని, అభ్యర్ధులు లాగిన్ అయి మన అప్లికేషన్ స్టేటస్ తెలుసుకుంటూ ఉండవచ్చని దేవేంద్ర చారి చెప్పారు.

"దత్తతకు బిడ్డ రెడీగా ఉంటే పీఏపీలకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన 48 గంటల్లో స్పందించి రిజర్వ్ చేసుకోవాలి. ఏ రాష్ట్రం, ఏ జిల్లా నుంచి మీకు బిడ్డను దత్తత ఇచ్చారో, అక్కడకు వెళ్లి బిడ్డను తెచ్చుకోవాలి. అక్కడి నుంచి వేరే ప్రక్రియ మొదలవుతుంది. ఈ ప్రక్రియ కోర్టుకు వెళుతుంది. కోర్టు, దత్తత ప్రక్రియను ధృవీకరించాల్సి ఉంటుంది" అని ఆయన వివరించారు.

బిడ్డను ఇంటికి తీసుకెళ్లిన తరువాత రెండేళ్ల పాటు నాలుగు దశల్లో (ఆరు నెలల కొకసారి) తనిఖీ జరుగుతుందని దేవేంద్ర చారి చెప్పారు. దత్తత తీసుకున్నవారు బిడ్డను సరిగ్గా చూసుకుంటున్నారో లేదో, బిడ్డ మానసిక, శారీరక ఆరోగ్యం స్థిరంగా ఉందో లేదో పరిశీలిస్తారు.

"ఈ రెండేళ్లలోపు దత్తత తీసుకున్న తల్లిదండ్రులు బిడ్డలను వెనక్కు ఇచ్చేసే వెసులుబాటు కూడా ఉంది. కానీ, అలా చేయవద్దని మేం కౌన్సిలింగ్ ఇస్తాం. ఒకవేళ బిడ్డకు ప్రాణాంతకమైన వ్యాధులు లేదా దీర్ఘకాల రోగాలు ఉంటే తప్ప, వెనక్కి ఇవ్వకుండా ఉండేలా ప్రయత్నిస్తాం. వెనక్కు ఇచ్చేసిన తరువాత, మళ్లీ బిడ్డ కావాలనుకుంటే కష్టమే. వాళ్లు మళ్లీ కారాలో దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. వారికి బిడ్డను దత్తతకు ఇచ్చే అవకాశాలు దాదాపు శూన్యం" అని చెప్పారు దేవేంద్ర.

రెండేళ్ల తనిఖీ లోపు ఊరు మారితే, అక్కడి జిల్లా పరిధిలో ఉన్న ఏజెన్సీకి మన అప్లికేషన్ మార్చుకోవచ్చని దేవేంద్ర చెప్పారు.

"ఉదాహరణకు మీరు దిల్లీ నుంచి హైదరాబాదుకు మారితే అక్కడికి ఈ ప్రక్రియను బదిలీ చేసుకోవచ్చు. మొత్తం నాలుగు తనిఖీల్లో రెండు దిల్లీలో జరిగితే, మిగతా రెండు హైదరాబాద్‌లో జరుగుతాయి. రెండేళ్లు ఒకేచోట ఉండిపోవాలన్న రూలేమీ లేదు. భారతదేశంలో ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా తనిఖీలు చేయించుకోవచ్చు. రీలొకేట్ అనే ఆప్షన్ ఉంటుంది" అని ఆయన వివరించారు.

CARA, దత్తత

రాష్ట్ర స్థాయిలో CARA తో కలిసి పనిచేసే సంస్థలు

స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ (SARA): రాష్ట్ర స్థాయిలో దత్తత దానికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించడానికి, ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు జువెనైల్ జస్టిస్ యాక్ట్‌ 2015లోని సెక్షన్ 67 కింద స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ (SARA)ని ఏర్పాటు చేస్తాయి. ఇవి కారాతో సమన్వయం కలిగి ఉంటాయి.

స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA): రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే సంస్థ. జువెనైల్ జస్టిస్ యాక్ట్‌ 2015లోని సెక్షన్ 65 కింద దీనికి చట్టబద్ధమైన గుర్తింపు ఉండాలి. అనాథ, వదిలివేసిన లేదా విడిచిపెట్టిన పిల్లలు దత్తతకు వెళ్లేవరకు వాళ్ల సంరక్షణ బాధ్యతలు చూస్తుంది.

ఆథరైజ్డ్ ఫారిన్ అడాప్షన్ ఏజెన్సీ (AFAA): విదేశీయులు భారతీయ పిల్లలను దత్తత తీసుకోవడానికి సహకరించే సంస్థ. దీనికి కారా ఆథరైజేషన్ ఉండాలి.

డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU): జిల్లాలలో అనాథ, వదిలివేసిన లేదా విడిచిపెట్టిన పిల్లలను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే యూనిట్. అలాంటి వారిని గుర్తించి, వారు దత్తతకు సిద్ధంగా ఉన్నారని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుంచి ధృవీకరణ పొందడం DCPU బాధ్యత.

కారా నిబంధనల్లో సవరణలు

పీఏపీలను బిడ్డను దత్తతకు ఇచ్చిన తరువాత కోర్టు దీన్ని ధృవీకరించాల్సి ఉంటుంది. అయితే, కోర్టుల్లోనే దత్తత ప్రక్రియ చాలాకాలం ఆగిపోతోందని ఎంతోమంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో దత్తత పెండింగ్ కేసులు వేలల్లో ఉన్నాయని దేవేంద్ర చారి కూడా అంగీకరించారు.

ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకే, ఇటీవల కారా నిబంధనల్లో సవరణలు చేస్తూ, ధృవీకరణ ప్రక్రియను జిల్లా మెజిస్ట్రేట్‌కు మార్చారు.

ఈ కొత్త నిబంధన 2022 సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఇకపై దత్తతకు దరఖాస్తు పెట్టుకున్నవారి విచారణ జిల్లా మెజిస్ట్రేట్‌కు వెళుతుంది.

"పాత కేసులకు కోర్టులోనే విచారణ కొనసాగుతుంది. ఇప్పటి నుంచి దరఖాస్తు పెట్టుకునేవారికి చివరి ధృవీకరణ ప్రక్రియను డీఎం నిర్వహిస్తారు. గతంలో దరఖాస్తు పెట్టుకున్నవారు ఎవరైనా, తమ కేసును డీఎంకు మార్చమని కోరితే, వెంటనే మారుస్తారు. లేదంటే కోర్టులోనే కొనసాగుతాయి" అని వివరించారు దేవేంద్ర.

కారా ప్రక్రియపై విమర్శలు

కారాలో రిజిస్టర్ చేసుకున్న దగ్గర నుంచీ ఎప్పుడు మా వంతు వస్తుందా అని ఎదురుచూడడమే తప్ప మరో చాయిస్ లేదంటున్నారు పీఏపీలు .

37 ఏళ్ల రిషికేశ్ 2019లో కారాలో రిజిస్టర్ చేసుకున్నారు. వారికి పిల్లలు కలుగలేదు. దాంతో, దత్తతకు దరఖాస్తు పెట్టుకున్నారు. బిడ్డ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

"మేం అప్లయి చేసుకుని మూడేళ్లు పూర్తి కావొస్తోంది. అన్ని వెరిఫికేషన్లు చేసుకుని బిడ్డను దత్తత ఇవ్వడానికి టైం పడుతుందన్నది నిజమే, ఒప్పుకుంటాను. కానీ, మూడేళ్లు పూర్తయితే హోం స్టడీ ఎక్స్పైర్ అయిపోతుంది. మళ్లీ మేం మొత్తం డాక్యుమెంట్లు అన్నీ సబ్మిట్ చేసి, హోం స్టడీ పునరుద్ధరించాలి. ఇది చాలా కష్టం. కారాలో రిజిస్టర్ చేసుకున్న దగ్గర నుంచి ఎన్నో పత్రాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎన్నో తనిఖీలు.. ప్రక్రియ చాలా సుదీర్ఘంగా, క్లిష్టంగా ఉంటుంది. మూడేళ్ల తరువాత మళ్లీ మొదటికొస్తుందంటే.. చాలా అలిసిపోతున్నాం. మా అప్లికేషన్‌కు మూడేళ్లు పూర్తవబోతోంది. మేం హోం స్టడీ రెన్యూ చేసుకోవాలి. తలుచుకుంటేనే నీరసం వస్తోంది" అంటూ రిషికేశ్ వాపోయారు.

అసలు సంతానం లేనివారికి మొదటి ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

"కారాలో ఎవరికీ ప్రాధాన్యం లేదు. అది అన్యాయం అనిపిస్తుంది. ఒక బిడ్డ ఉండి, రెండో బిడ్డ కోసం అప్లయి చేసుకున్నవారికి, అసలు బిడ్డలు లేక దత్తతకు దరఖాస్తు పెట్టుకున్నవారికీ ఒకటే ప్రాధాన్యం అంటే కష్టం కదా. మాలాంటివారికి మొదట ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది" అని ఆయన అన్నారు.

కారాలో దత్తత ప్రక్రియ ఆలస్యమవుతుంది అనే విమర్శపై దేవేంద్ర చారి మాట్లాడుతూ, "కారా గురించి, దత్తత ప్రక్రియ గురించి అవగాహన పెరగడం వలన విమర్శలూ పెరుగుతున్నాయి. ఇదొక కారణం. సంతానం లేనివారు, కడుపున పుట్టిన బిడ్డలున్నా అప్లయి చేసుకునేవారు..ఈ రెండు కేటగిరీలు ఉండడంతో అప్లికేషన్లు డబుల్ అవుతున్నాయి. కానీ, అంతమంది పిల్లలు దొరకట్లేదు. సప్లయి తక్కువగా ఉంటోందన్నది మరొక కారణం" అన్నారు.

దేశంలో చాలామంది అనాథ పిల్లలు ఉన్నారు, కోవిడ్ తరువాత అనాథలు పెరిగిపోయారని మనమంతా అనుకుంటాం కానీ, ఇది చాలా క్లిష్టమైన అంశం అని దేవేంద్ర చెప్పారు.

"పిల్లలు దొరికినప్పుడు వాళ్ల ఆరోగ్య పరిస్థితి పరిశీలించి, అంతా బావుంటేనే దత్తతకు ఇస్తారు. ప్రభుత్వం దగ్గర రెండు నెలలు మాత్రమే పిల్లలు ఉంటారు. రెండు నెలల్లోపే దత్తతకు వెళ్లిపోతారు. అయితే, దొరికిన పిల్లలంతా దత్తతకు అనువుగా ఉండరు. హెచ్ఐవీ ఉండొచ్చు, గుండె జబ్బులు ఉండొచ్చు. అలాంటివాళ్లను దత్తతకు ఇవ్వరు. సాధారణంగా 0-2 సంవత్సరాల పిల్లలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. 4 ఏళ్లు దాటిన పిల్లలు తక్కువమంది ఉంటారు. వాళ్లని దత్తత తీసుకునేవాళ్లు కూడా తక్కువగా ఉంటారు. 4 ఏళ్లు దాటినవాళ్లు అనాథ శరణాలయాలకు వెళతారు. అక్కడ వాళ్లని పలురకాల కారణాలతో అట్టిపెట్టుకుని ఉంటారు. ఆస్తులున్నాయనో, ఫండ్స్ కోసమో, ఇంకోరకంగా ఉపయోగపడతారనో ఏవో కారణాలతో పిల్లలను దత్తతకు ఇవ్వరు. అనాథ శరణాలయాల వాళ్లు దత్తతకు ఇవ్వాలి. ఇస్తేనే మేం ప్రాసెస్ చేయగలం. ఆ బిడ్డను పీఏపీలకు దత్తత ఇవ్వగలం. ఇంత క్లిష్టంగా ఉంటుంది. అందుకే ఆలస్యమవుతుంది" అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
CARA: Why is it difficult to adopt a child in India, what are the rules and what is the process?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X