IT Refunds : ఐటీ రిఫండ్ కోసం ఎదురూచూస్తున్నారా ? మీకో గుడ్ న్యూస్..
దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలుకు కేంద్రం ఇచ్చిన గడువు సమీపిస్తోంది. ఈ నెల 31తో ఈ గడువు ముగియనుంది. దీంతో ఆదాయపు పన్ను శాఖకు భారీఎత్తున రిటర్న్స్ వచ్చి పడుతున్నాయి. వీటిని అంతే వేగంగా ప్రాసెస్ చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. అలాగే రిఫండ్స్ చెల్లింపుల కార్యక్రమం కూడా వేగంగా సాగుతోంది. దీనికి సంబంధించిన వివరాల్ని తాజాగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)ఛైర్మన్ నితిన్ గుప్తా వెల్లడించారు.
ఐటీ రిటర్న్ దాఖలు చేసేందుకు ఈ నెల 31తో గడుపు ముగుస్తున్న నేపథ్యంలో ప్రతీ రోజూ భారీ ఎత్తున రిటర్న్స్ దాఖలవుతున్నాయి. ఇప్పటివరకూ ఈ ఆర్ధిక సంవత్సరంలో 4 కోట్ల రిటర్న్స్ దాఖలైనట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)ఛైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. వీటిని అంతే త్వరగా ప్రాసెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఐటీ శాఖ రిటర్న్స్ ప్రాసెస్ కోసం ఏఐ పరిజ్ఞానం వాడుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నితిన్ గుప్తా ప్రాసెసింగ్ పై మరో కీలక అంశం కూడా వెల్లడించారు.

ఐటీ రిటర్న్స్ ప్రాసెసింగ్ కోసం గరిష్టంగా 16 రోజుల గడువు పెట్టినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)ఛైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. ఇప్పటికే లక్షలాది రిటర్న్ లు ప్రాసెసింగ్ పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. తాజాగా ఒక్క రోజులోనే 42 శాతం రిటర్న్స్ ప్రాసెస్ చేసినట్లు తెలిపారు. అలాగే రిటర్న్ లు దాఖలు చేసిన 4 కోట్ల మందిలో 80 లక్షల మందికి రిఫండ్ కూడా చెల్లించినట్లు పేర్కొన్నారు. మిగతా వారికి కూడా త్వరలో రిటర్న్ ప్రాసెస్ చేసి రిఫండ్స్ చెల్లిస్తామన్నారు.
2022-23 ఆర్ధిక సంవత్సరానికి వ్యక్తిగత, కార్పోరేట్ పన్నులు కలిపి రూ.16.61 కోట్లు వసూలు అయ్యాయి. గతేడాది 2021-22తో పోలిస్తే ఇది 17.67 శాతం అధికమని సీబీడీటీ ఛైర్మన్ వెల్లడించారు. వాస్తవానికి ఆదాయపు పన్ను శాఖలో మానవ వనరుల కొరత తీవ్రంగా ఉందని, కేంద్రం నుంచి సహకారం లభిస్తే మరింత వేగంగా రిటర్న్ లు ప్రాసెస్ చేసి రిఫండ్స్ ప్రాసెస్ చేస్తామని ఆయన తెలిపారు. దీంతో ఉన్న సిబ్బందితోనే వేగంగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications