సీబీఐ కొత్త డైరెక్టర్ తేలేది ఆనాడే...! 24న హై పవర్ కమిటీ భేటీ
ఢిల్లీ : సీబీఐ కొత్త డైరెక్టర్ నియామకంపై ఈనెల 24న హై పవర్ కమిటీ భేటీ కానుంది. ఇటీవల సీబీఐలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో నయా డైరెక్టర్ ఎవరనేది ఉత్కంఠగా మారింది. అయితే కేంద్రం తాత్కాలిక డైరెక్టర్ గా ఎం. నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ఆయన నియామకం చెల్లదని, చట్టవిరుద్ధమని వాదిస్తున్నారు. ఈమేరకు హై పవర్ కమిటీలో సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీకి లేఖ రాశారు. సీబీఐకి కొత్త డైరెక్టర్ నియామకంపై నిర్ణయం తీసుకోవడానికి త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.
హైపవర్ కమిటీలో ప్రధాని మోడీ సహా విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.సిక్రి సభ్యులుగా ఉన్నారు. సీబీఐలో ఆరోపణాస్త్రాల చిచ్చు రేగడంతో అలోక్ వర్మ, రాకేశ్ అస్థానాను గతేడాది బలవంతపు సెలవులపై పంపింది కేంద్రం. అయితే కేంద్రం తీరును సవాల్ చేస్తూ అలోక్ వర్మ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అలోక్ వర్మకు తిరిగి పగ్గాలు అప్పగించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. అలా తిరిగి బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఆయనను సీబీఐ నుంచి బదిలీ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో తాత్కాలిక డైరెక్టర్ గా నాగేశ్వరరావును నియమించింది. అయితే నాగేశ్వరరావు నియామకాన్ని కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే గాకుండా ఆ పార్టీ సీనియర్ మల్లికార్జున ఖర్గే మోడీకి లేఖ రాశారు. సీబీఐ కొత్త డైరెక్టర్ నియామకంపై సమావేశం కావడానికి.. ఖర్గే లేఖ రాసిన మరునాడే 24వ తేదీని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications