CBSE: 19 ఏళ్ల కుర్రాడు రాసిన ఒక్క బ్లాగ్ తో కదిలిన సామ్రాజ్యం..
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి డిజిటల్ మూల్యాంకన ప్లాట్‌ఫామ్ (OSM) వివాదం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. సైబర్‌సెక్యూరిటీ లోపాలు, డేటా లీకేజీ ఆరోపణలతో ఈ పోర్టల్‌ను తాత్కాలికంగా నిలిపివేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే, సీబీఎస్ఈ డిజిటల్ మూల్యాంకన ప్లాట్‌ఫామ్ భద్రతకు ఎటువంటి రాజీ జరగలేదని, వ్యవస్థలు లేదా డేటా భద్రతకు ఎలాంటి విఘాతం కలగలేదని ఈ కాంట్రాక్ట్ పొందిన 'కోఎమ్ట్ ఎడ్యుటెక్’ (CoEMT Edutech) డైరెక్టర్ వీఎస్ఎన్ రాజు స్పష్టం చేశారు.
ఈ వివాదం వెనుక అసలు కథ 19 ఏళ్ల నిసర్గ అధికారి అనే యువకుడు రాసిన ఒక బ్లాగ్‌తో మొదలైంది. ఈ పోర్టల్‌లో ఉన్న తీవ్రమైన సాంకేతిక లోపాలను అతడు బయటపెట్టడంతో ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దాంతో పోర్టల్‌ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఈ వ్యవహారం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. రాహుల్ గాంధీ వంటి ప్రతిపక్ష ఎంపీలు రంగంలోకి దిగి సీబీఎస్ఈపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల వివాదంలో చిక్కుకున్న 'గ్లోబరేనా' (ప్రస్తుత కోఎమ్ట్) సంస్థకే ఈ కీలకమైన కాంట్రాక్ట్ ఎలా ఇస్తారని వారు ప్రశ్నించారు.

పారదర్శకమైన ఈ-బిడ్డింగ్.. పేరు మార్పుపై వివరణ
ఈ ఆరోపణలపై కోఎమ్ట్ డైరెక్టర్ వీఎస్ఎన్ రాజు స్పందిస్తూ.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వంటి దిగ్గజ సంస్థలతో పోటీ పడి, అత్యంత పారదర్శకమైన ఈ-బిడ్డింగ్ ప్రక్రియ ద్వారానే తాము ఈ కాంట్రాక్టును గెలుచుకున్నామని వివరించారు. ఇక గ్లోబరేనా నుండి కోఎమ్ట్‌గా పేరు మార్చడంపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ఇది కంపెనీల చట్టం ప్రకారం జరిగిన సాధారణ రీబ్రాండింగ్ ప్రక్రియ మాత్రమేనని చెప్పారు. 2019 నాటి తెలంగాణ ఇంటర్ వివాదంలో తమ కంపెనీ ఎటువంటి తప్పు చేయలేదని హైకోర్టు, సుప్రీంకోర్టులు తేల్చేశాయని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం స్కాన్ చేసిన ఆన్సర్ షీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులలో 95 నుండి 97 శాతం మందికి అవి ఇప్పటికే అందాయని వెల్లడించారు.
20 కోట్ల పేజీల మూల్యాంకనం.. వెల్లువెత్తిన ఫిర్యాదులు!
ఈ ఏడాది సీబీఎస్ఈ ప్రవేశపెట్టిన ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ ద్వారా దాదాపు 9.8 మిలియన్ల జవాబు పత్రాలను (సుమారు 20 కోట్ల పేజీలు) డిజిటల్‌గా మూల్యాంకనం చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల నుండి సాంకేతిక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. డిజిటల్ కాపీలను తనిఖీ చేసేటప్పుడు మూల్యాంకనదారులు సరిగా స్క్రోల్ చేయకపోవడం, పేజీలు మిస్ అవ్వడం, పేలవమైన స్కానింగ్ కారణంగా చాలా మందికి అసాధారణంగా తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
రంగంలోకి కేంద్ర విద్యాశాఖ.. ఐఐటీల సమీక్ష
ఈ వివాదం ముదరడంతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తక్షణమే రంగంలోకి దిగింది. విద్యార్థులకు ఊరట కలిగిస్తూ రీ-ఎవాల్యుయేషన్ (పునర్మూల్యాంకనం) ఫీజును రూ. 700 నుండి భారీగా తగ్గిస్తూ కేవలం రూ. 100 గా నిర్ణయించింది. అలాగే దరఖాస్తు గడువును కూడా పొడిగించింది. మరోవైపు, ఈ డిజిటల్ మౌలిక సదుపాయాలలో ఉన్న సాంకేతిక లోపాలను సరిదిద్దడానికి మరియు పోర్టల్‌ను స్థిరీకరించడానికి ఐఐటీ మద్రాస్ (IITM), ఐఐటీ కాన్పూర్ (IITK) సంస్థలకు చెందిన నిపుణుల సాంకేతిక బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం.














Click it and Unblock the Notifications