ట్రయల్ రూంలో సీసీటీవీ-స్మృతి ఇరానీ కేసు: నిందితుడు ఉద్యోగే
పనాజీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కేసులో నిందితుడిని గోవా పోలీసులు గుర్తించారు. పది రోజుల క్రితం గోవాలోని ఓ ఫ్యాబ్ ఇండియా షోరూంకు వెళ్లిన స్మృతి ఇరానీకి ట్రయల్ రూం సమీపంలో సీసీ కెమెరా కనిపించగా, పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు చేధించారు.
దుకాణం రహస్య కెమెరా ఉదంతానికి కారకుడైన వ్యక్తిని గుర్తించినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. ఇక్కడి కండోలిమ్ గ్రామంలోని ఫ్యాబ్ ఇండియా దుకాణంలో దుస్తులు మార్చుకునే గది కనిపించే విధంగా కెమెరా దిశను మార్చడంలో అక్కడే పని చేసే ఒక ఉద్యోగి హస్తం ఉన్నట్లుగా తేలింది.

ఈ కేసుకు వెంటనే అదుపులోకి తీసుకున్న అయిదుగురిలో సదరు ఉద్యోగి కూడా ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు.
మంత్రి స్మృతి ఇరానీ ఫిర్యాదు చేసిన వెంటనే అక్కడే ఉన్న నిందితుడు హడావుడిగా ఆ కెమెరా దిశను మారుస్తున్న దృశ్యాన్ని మరో సీసీటీవీ కెమెరా రికార్డు చేసిందన్నారు. దీంతోపాటూ నిందితుడిగా భావిస్తున్న ఉద్యోగికి వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలు సైతం లభించాయన్నారు. అతడితో సహా మరికొందరు కూడా ఈ నేరంలో భాగస్వాములై ఉండవచ్చన్నది పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications