మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సీఈసీ కసరత్తు.. దీపావళిని దృష్టిలో ఉంచుకొని షెడ్యూల్ ప్రకటించాలన్న పార్టీలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే ముంబైలో ఈసీ బృందం పర్యటించింది. దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించాలని రాజకీయ పార్టీలు కోరినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల సన్నద్ధతపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 26 నాటికి మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని గుర్తు చేశారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముంబైలో జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు సూపరింటెండెంట్లు, మున్సిపల్ కమిషర్లు, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నిక సంఘం సమావేశమైంది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఫేక్ వార్తలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. తప్పుడు సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారంపై అరికట్టేవిధంగా సత్వరమే యాక్షన్ తీసుకోవాలని ఆదేశించారు.

ఎన్నికల సన్నద్ధతలో భాగంగా మహారాష్ట్రలోని అన్ని రాజకీయ పార్టీలు, అధికారులను కలిసినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. దీపావళి వంటి పండుగలను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధాన పార్టీలు కోరిన నేపథ్యంలో దీనిపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అటు ఇటీవల పార్లమెంటు ఎన్నికల సందర్భంగా జరిగిన నేరాలపై దృష్టి పెట్టి దర్యాప్తు వేగవంతం చేయాలని రాష్ట్ర పోలీసులను కోరారు.
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను 1,00,116 పోలీంగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ తెలిపింది. గత మూడేళ్లుగా సొంత జిల్లాలో లేదా ప్రస్తుత పోస్టింగ్‌లో ఉన్న అధికారులను బదిలీ చేయాలని మాహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీఐ కోరింది. పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలను జిల్లా ఎన్నికల అధికారులు స్వయంగా పరిశీలించాలని సూచించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నిల్లో గరిష్టస్థాయిలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నిల్లో ముంబై చుట్టుపక్కల ఉన్న కొలాబా, కల్యాణ్ వంటి ప్రాంతాల్లో అత్యల్ప పోలింగ్ నమోదైందని గుర్తు చేశారు. ఈనేపపథ్యంలో పట్టణ ఓటర్ల ఉదాసీనతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఆయా రాజకీయ పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగిస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో యుబిటి శివసేన, ఎన్సీపీ ( శరద్ పవార్ ) , కాంగ్రెస్ తో కూడిన మహా వికాస్ అఘూడి కూటమి, వర్సెస్ బిజేపీ, శివసేన ( షిండే వర్గం ), ఎన్సిపీ ( అజిత్ పవార్ వర్గం)లతో కూడిన మహా యుతి అలయన్స్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. అటు సీఈసీ దాదాపు వచ్చే నెలలోనే ఎన్నికలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications