DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ షాక్ ? దాదాపు ఖరారు..!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న కరువు భత్యం (DA)పై వారికి షాక్ తప్పేలా లేదు. ఈసారి కరువు భత్యం పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వం పిసినారిగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. 8వ వేతన సంఘం సిఫార్సుల కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ఉద్యోగులకు ఈసారి కరువు భత్యం ఊరటనిస్తుందని భావించగా.. అలాంటిదేమీ లేదని తేలిపోతోంది. ఈ మేరకు కేంద్రం డీఏ పెంపును ఖరారు చేసినట్లు సమాచారం.
ఈసారి డీఏ పెంపు ఇంతేనా?
ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ కనిష్టంగా 2 శాతం, గరిష్టంగా 5 శాతం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో 2 శాతం పెరిగితే ప్రస్తుతం ఉన్న మూలవేతనం(బేసిక్ పే) లో 58 శాతం నుంచి 60 శాతానికి పెరిగే ఛాన్స్ ఉంది. గరిష్టంగా 5 శాతం పెరిగినా అత్యధికంగా 63 శాతానికి మాత్రమే ఇది చేరనుంది. ఎందుకంటే కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ డిసెంబర్ 2025కి ప్రకటించిన అఖిల భారత వినియోగదారుల ధరల సూచీని 148.2 వద్దే ఉంచింది.

మార్పుల్లేని ధరల సూచీ
ద్రవ్యోల్బణం ప్రభావం నుండి జీతాలు, పెన్షన్లను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం ఎప్పటికప్పుడు సవరిస్తారు. అయితే ఈ సవరణకు ప్రాతిపదికగా పారిశ్రామిక కార్మికుల కోసం అఖిల భారత వినియోగదారుల ధరల సూచీని తీసుకుంటారు. కానీ తాజాగా ప్రకటించిన సూచీని ఎలాంటి మార్పులు లేకుండా అలాగే ఉంచడంతో కరువు భత్యం గరిష్టంగా 5 శాతం పెరిగి 63 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం జూలై 2025లో 54 శాతంగా ఉన్న డీఏను 58 శాతానికి పెంచింది. ఇప్పుడు డీఏను ఖరారు చేసినా మార్చి లేదా ఏప్రిల్ లో కేంద్రం ఆమోదం తర్వాతే ఇది అమల్లోకి వస్తుంది. అయితే బకాయిలు మాత్రం చెల్లిస్తారు.

మూలవేతనంలో డీఏ విలీనం
మరోవైపు గతేడాది నవంబర్ లో 8వ వేతన సంఘం నియామకం తర్వాత ఉద్యోగ సంఘాలు డీఏను మూలవేతనంలో కలిపేయాలనే డిమాండ్లు మొదలుపెట్టాయి. డిఎ ఇప్పటికే ద్రవ్యోల్బణం కంటే వెనుకబడి ఉండటం, బంగారం ధరలు పెరుగుతూనే ఉండటంతో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర ఉపశమన చర్యగా డియర్‌నెస్ అలవెన్స్‌ను ప్రాథమిక వేతనంతో విలీనం చేసే ప్రతిపాదన లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది












Click it and Unblock the Notifications