Draupadi Murmu : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు జడ్ ప్లస్ భద్రత-కేంద్రం నిర్ణయం
ఎన్డీయే తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిగా ఎంపికైన జార్ఖండ్ గవర్నర్ ద్రౌపదీ ముర్ముకు కేంద్రం ఇవాళ జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల వరకూ ఆమె ప్రస్తుత పదవిలోనే ఉండబోతున్నందున ఆమె భద్రతపై కేంద్రం స్పందించింది. ఈ మేరకు హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ద్రౌపదీ ముర్ము స్వతహాగా ఆదివాసీ గిరిజన నేత కావడం, ఆమెను అధికార ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీలో నిలబెట్టడంతో ఆమె భద్రత కీలకంగా మారింది. ఇప్పటికే జార్ఖండ్ గవర్నర్ గా పనిచేసిన సమయంలోనూ ఆమెకు అదనపు భద్రత కల్పిస్తున్నారు. అయితే దాదాపు రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశాలున్న ద్రౌపది ముర్మును ఎన్నికలయ్యే వరకూ సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. దీంతో ద్రౌపదికి రాష్ట్రపతికి ఇచ్చే జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించారు.

ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీలో నిలిచిన నేపథ్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్న మావోయిస్తులు లేదా తీవ్రవాద గ్రూపులు ఆమెను టార్గెట్ చేయవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రపతి కాకుండానే ముర్ముకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కేటాయించినట్లు సమాచారం. అయితే ఇవే ఎన్నికల్లో విపక్షాల తరఫున పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హాకు మాత్రం ఎలాంటి భద్రత లేకపోవడం విశేషం. నిన్న మొన్నటి వరకూ టీఎంసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న యశ్వంత్ సిన్హాకు మమత ప్రభుత్వం ఇస్తున్న భద్రత మాత్రమే ఉంది.