LGBTQ: కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశంలో స్వలింగ సంపర్కుల వివాహ ప్రక్రియపై కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయి. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధతను కల్పించాలని, దీనికి అధికారిక గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయంపై సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇదివరకే విచారణ చేపట్టింది.
ఈ పిటీషన్లపై విచారణను జరిపించడానికి ప్రత్యేకంగా అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ఈ పిటీషన్లనింటినీ ఈ ధర్మాసనానికి బదిలీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లను విచారించనుంది. ఏప్రిల్ 18వ తేదీ నుంచి విచారణ కొనసాగుతోంది.
ఇవ్వాళ తాజాగా ఆయా పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు. స్వలింగ సంపర్కుల వివాహాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని, దీన్ని స్పష్టం చేస్తూ ఇదివరకే అఫిడవిట్‌ను దాఖలు చేసిందని అన్నారు. ఇలాంటి వివాహాలకు చట్టబద్ధతను కల్పించడం, అధికారికంగా గుర్తింపును ఇవ్వడం సరికాదని అన్నారు.

ఐపీసీలోని సెక్షన్ 377 ప్రకారం- స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవడం నేరమని తెలిపింది. స్వలింగ వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు అనేది చరిత్రలో లేదని వివరించింది. భిన్న లింగ వివాహానికి మాత్రమే ఈ దేశంలో గుర్తింపు ఉందని పేర్కొంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఎల్జీబీటీక్యూఐఏ ప్లస్ సామాజిక వర్గం ఎదుర్కొంటోన్న సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని సొలిసిటర్ జనరల్ తెలిపారు.
వారి సమస్యలపై అధ్యయనం చేయడానికి, వాటికి సరైన పరిష్కారాన్ని చూపించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తుందని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటీ తన కార్యకలాపాలను చేపడుతుందని వివరించారు. ఈ కమిటీలో ఎవరిని సభ్యులుగా చేర్చాలనే విషయంపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తుషార్ మెహతా తెలిపారు.
స్వలింగ వివాహాలకు గుర్తింపు కోసం పిటీషన్లను దాఖలు చేసిన తమ సలహాలను ఈ కమిటీ తమ తెలియజేయవచ్చని చెప్పారు. వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలను తీసుకోవడానికి కమిటీ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. వాటన్నింటినీ క్రోడీకరించిన అనంతరం ఎల్జీబీటీక్యూఐఏ ప్లస్ సామాజిక వర్గం ఎదుర్కొంటోన్న సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన చర్యలను కేంద్రం తీసుకుంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications