మీకు ఆ అధికారం లేదు-వక్ఫ్ చట్టంపై సుప్రీంకు తేల్చిచెప్పేసిన కేంద్రం..!
పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదం పొందిన వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. గత విచారణలో వక్ఫ్ చట్టంలోని కొన్ని సెక్షన్లు అమలు చేయకుండా స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు.. కేంద్రాన్ని వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో కేంద్రం ఇవాళ వక్ఫ్ చట్టంపై తమ అభిప్రాయం తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది.
కొత్త వక్ఫ్ చట్టం అమలుపై పాక్షికంగా లేదా పూర్తిగా స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం ఇవాళ వెల్లడించింది. అలాంటి సందర్భాలలో చట్టబద్ధమైన నిబంధనలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా స్టే చేసే అధికారం కోర్టులకు లేదని చట్టం చెబుతోందని ఇవాళ సమర్ఫించిన అఫిడవిట్ లో పేర్కొంది. పార్లమెంట్ చేసిన చట్టాల రాజ్యాంగబద్ధత తేల్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉందని, అయితే మధ్యంతర స్టే అనేది వ్యవస్ధల మధ్య అధికారాల సమతుల్యత సూత్రానికి విరుద్ధమనని పేర్కొంది.

వక్ఫ్ చట్టంపై ప్రస్తావిస్తూ ఇది ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ సిఫార్సులతో, పార్లమెంటు ఉభయ సభలలో విస్తృత చర్చ తర్వాత చట్టంగా మారిందని కేంద్రం తెలిపింది. చట్టం యొక్క రాజ్యాంగబద్ధతను పరిశీలించే అధికారం సుప్రీంకోర్టుకు నిస్సందేహంగా ఉన్నప్పటికీ, ఈ తాత్కాలిక దశలో ఏదైనా నిబంధన అమలుకు వ్యతిరేకంగా నిషేధాజ్ఞ జారీ చేయడం దేశంలోని వివిధ వ్యవస్థల మధ్య సున్నితమైన అధికార సమతుల్యతను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది.
వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్లలో పిటిషనర్లు ఏ వ్యక్తిగత కేసులోనూ అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేయవద్దని కేంద్రం సూచించింది. అలాగే ఎటువంటి మధ్యంతర ఉత్తర్వు ద్వారా రక్షణ కోరవద్దని తెలిపింది. గత వారం కోర్టు చట్ట సభల పరిధిని అతిక్రమించబోమని స్పష్టం చేసింది. అలాగే రాజ్యాంగం ద్వారా అధికారాల విభజన స్పష్టంగా ఉందని పేర్కొంది.ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ వక్ఫ్ చట్టంపై స్టే ఇచ్చే అధికారం లేదని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications