ఆ మెడికల్ స్టూడెంట్స్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం..!!
న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఏడాది కాలానికి పైగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధానికి 13 నెలలు దాటి పోయాయి. అయినప్పటికీ- ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. హోరాహోరీగా పోరు కొనసాగిస్తోన్నాయి. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని కీలక నగరాలను రష్యా సైన్యం కైవసం చేసుకుంది. రాజధాని కీవ్‌ను సొంతం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా సహా ఇతర పాశ్చాత్య దేశాలు అందిస్తోన్న ఆయుధాలతో ఉక్రెయిన్ ధీటుగా జవాబిస్తోంది.
ఈ యుద్ధం వల్ల భారత్‌కు చెందిన వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున నష్టపోయిన విషయం తెలిసిందే. యుద్ధం ఆరంభంలోనే వారంతా స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తోన్న విద్యార్థులు అర్ధాంతరంగా తమ చదువులను నిలిపివేయాల్సి వచ్చింది. స్వదేశంలోనూ వారికి పెద్దగా ఆదరణ లభించలేదు. ఇక్కడి వైద్య కళాశాలల్లో వారికి అడ్మిషన్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపలేదు. ఫలితంగా- సుమారు 14 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
ఈ వ్యవహారంపై పలువురు వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు- దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ నుంచి తమ పిల్లలను స్వదేశానికి తీసుకుని రావడంలో చూనించిన శ్రద్ధ.. వారికి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి సరైన దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనంటూ డిమాండ్ చేశారు.

వారి పిటీషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఇదివరకే కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను పంపించింది. ఈ నోటీసులపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. ఉక్రెయిన్ నుంచి అర్ధాంతరంగా చదువును మానివేసి స్వదేశానికి వచ్చిన భారత వైద్య విద్యార్థులు- దేశంలోని ఏ వైద్య కళాశాలలో కూడా తమ పేర్లను నమోదు చేయించుకోనప్పటికీ- ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షలను రాయడానికి అవకాశం ఇస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇది ఒకే ఒక్క అవకాశంగా మాత్రమే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది కేంద్రం. అంటే ఈ ఒక్కసారికి మాత్రమే ఉక్రెయిన్ నుంచి వెనక్కి వచ్చిన వైద్య విద్యార్థులకు పరీక్ష రాయడానికి అవకాశం లభించింది. థియరీ, ప్రాక్టికల్స్ కలుపుకొని ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పార్ట్-1, పార్ట్-2 పరీక్షలు రాయడానికి వారికి సింగిల్ ఛాన్స్ రూపంలో అవకాశం ఇచ్చింది. దీని తరువాత వైద్య విద్యార్థులు రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఉండే రొటేటరీ ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈ రొటేటరీ ఇంటర్న్‌షిప్‌లో తొలి సంవత్సరం ఉచితంగా సేవలను అందించాల్సి ఉంటుందనే నిబంధనను పెట్టింది కేంద్ర ప్రభుత్వం. రెండో సంవత్సరంలో మాత్రం నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ధారించిన మేరకు వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లిస్తామని పేర్కొంది. వన్ టైమ్ ఆప్షన్ అనేది కఠినంగా అమలవుతుందని, మళ్లీ మళ్లీ వారికి అవకాశాన్ని కల్పించలేమని కేంద్ర ప్రభుత్వం తేటతెల్లం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదికను అందించింది.












Click it and Unblock the Notifications