రైతులకు కేంద్రం గుడ్ న్యూస్- రబీ సీజన్ లో ఏకంగా రూ.22,303 కోట్ల లబ్ది..
ఇవాళ ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో రైతులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో రబీ సీజన్ లో రైతులకు చేకూర్చాల్సిన లబ్దిపై మంత్రులు చర్చించారు. అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ఇందులో రైతులకు ఏకంగా రూ.22303 కోట్ల మేర ప్రయోజనం కల్పించే నిర్ణయం కూడా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ధరలు అధికంగా ఉన్నప్పటికీ రైతులు సరసమైన ధరలకు నేల పోషకాలను పొందేలా చేయడం కోసం ప్రస్తుత రబీ సీజన్‌లో పి అండ్ కె ఎరువులపై రూ.22,303 కోట్ల సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రబీ పంట సీజన్‌లో (అక్టోబర్ 1, 2023 - మార్చి 31, 2024) నత్రజని, భాస్వరం, పొటాష్, సల్ఫర్ వంటి వివిధ పోషకాల కోసం పోషక ఆధారిత సబ్సిడీ రేట్లను (NBS) కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో డి-అమ్మోనియం ఫాస్ఫేట్ పాత ధర రూ. 1,350 చొప్పున విక్రయించబడుతుందని, మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపి) ధర తగ్గుతుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీంతో రైతులకు ఆ మేరకు ఊరట లభించినట్లయింది. అసలే ఎన్నికల వేళ కావడంతో కేంద్రం ప్రకటించిని నిర్ణయాలతో దేశవ్యాప్తంగా రైతులకు
ప్రయోజనం చేకూరబోతోంది.
వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న కరవు పరిస్ధితులు, రబీ సీజన్ లో పంట వేసే పరిస్ధితులు, ఇతర అంశాల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో కేంద్రం రైతులకు సంబంధించి ఈ మధ్య వరుసగా కీలక నిర్ణయాలు ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications