కోవిడ్ రిపోర్ట్ లేకపోయినా పేషెంట్లను చేర్చుకోవాల్సిందే... కేంద్రం కొత్త గైడ్ లైన్స్ ఇవే...
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్ రిపోర్టు లేకపోయినా సరే కోవిడ్ లక్షణాలతో ఆస్పత్రికి వచ్చేవారిని అడ్మిట్ చేసుకుని చికిత్స అందించాల్సిందేనని నిర్ణయించింది. కరోనా రిపోర్ట్ లేదన్న కారణంతో వారిని తిప్పి పంపరాదని నిర్ణయించింది. ఈ మేరకు కోవిడ్ పేషెంట్స్ అడ్మిషన్ పాలసీలో సవరణలు చేసింది.
కరోనా లక్షణాలతో ఆస్పత్రికి వచ్చే ఏ ఒక్క పేషెంట్‌కు వైద్యం నిరాకరించవద్దని కొత్త పాలసీలో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. పేషెంట్ వేరే నగరం నుంచి వచ్చినా సరే చికిత్స అందించాల్సిందేనని పేర్కొంది. మెడికల్ ఆక్సిజన్ సప్లై,అవసరమైన మందులు,చికిత్స తదితర వైద్య సౌకర్యాలు వారికి కల్పించాలని సూచించింది. దేశంలోని అన్ని కేంద్రపాలిత,రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని ఆస్పత్రులు,వైద్య ఆరోగ్య కేంద్రాల్లో ఈ నిబంధనలను అమలుచేయాల్సిందేనని ఆదేశించింది.

కేంద్ర కొత్త గైడ్ లైన్స్ ఇవే...
కోవిడ్ హెల్త్ సెంటర్‌లో పేషెంట్‌ను అడ్మిట్ చేసుకునేందుకు కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ తప్పనిసరి కాదు. కరోనా అనుమానిత పేషెంట్లను అడ్మిట్ చేసుకోవాలి. సీసీసీ,డీసీహెచ్‌సీ లేదా డీహెచ్‌సీ వార్డుల్లో వారికి చికిత్స అందించాలి.
ఒకవేళ పేషెంట్ వేరే పట్టణం లేదా నగరం నుంచి వచ్చినా... ఆ కారణంతో చికిత్స నిరాకరించరాదు. పేషెంట్‌కు అవసరమైన ఆక్సిజన్,మందులు,చికిత్స అందించాలి.
లోకల్ ఐడీ కార్డు లేదన్న కారణంతో పేషెంట్లను అడ్మిట్ చేసుకునేందుకు నిరాకరించరాదు.
మెడికల్ ప్రాతిపదికన మాత్రమే ఆస్పత్రుల్లో చేరికలు జరగాలి. అదే సమయంలో ఆస్పత్రిలో చికిత్స అందించాల్సిన అవసరం లేని పేషెంట్లకు అనవసరంగా బెడ్లు కేటాయించరాదు.అన్ని ఆస్పత్రులు డిశ్చార్జి పాలసీని పాటించాలి.
మూడు రోజుల్లోగా అన్ని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు ఈ కొత్త మార్గదర్శకాలపై ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
కేంద్రం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలను తెలంగాణలో ఇప్పటికే అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ రిపోర్ట్ లేకపోయినా ఎమర్జెన్సీ కేసులకు చికిత్స అందించాలని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఎమర్జెన్సీ కేసులకు కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కోవిడ్ పేషెంట్లకు కాస్త ఊరట లభించినట్లయింది.












Click it and Unblock the Notifications