NSA: నిరసనలపై కేంద్రం ఉక్కుపాదం? ఢిల్లీ పోలీసుల క్లారిటీ..
దేశ రాజధాని ఢిల్లీలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు, యువజన సంఘాలు చేపడుతున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. శాంతిభద్రతల పరిరక్షణ సాకుతో ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్‌కు జాతీయ భద్రతా చట్టం (NSA) కింద ముందస్తు నిర్బంధ (Preventive Detention) అధికారాలను కట్టబెడుతూ ఉత్వర్వులు జారీ చేసింది.
అక్టోబర్ 18 వరకు ఫుల్ పవర్స్..
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ మేరకు అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జూలై 19 నుంచి అక్టోబర్ 18 వరకు మూడు నెలల పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఈ NSA అధికారాలు అందుబాటులో ఉంటాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించే లేదా దేశ భద్రతకు భంగం కలిగించే ముప్పు ఉందనుకునే ఎవరినైనా వారెంట్ లేకుండా ముందస్తుగా అరెస్ట్ చేసి 12 రోజుల నుంచి గరిష్టంగా 12 నెలల వరకు డిటెన్షన్‌లో ఉంచే అధికారం ఈ చట్టం ద్వారా పోలీసులకు లభిస్తుంది.

జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..
నీట్ (NEET) పరీక్ష అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఇటీవల విద్యార్థులు చేపట్టిన పార్లమెంట్ మార్చ్ ను పోలీసులు బారికేడ్లతో అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. లాఠీచార్జ్, బాష్పవాయుగోళాల ప్రయోగంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగి పలువురు విద్యార్థులు, పోలీసులు గాయపడ్డారు.
ఢిల్లీ పోలీసుల క్లారిటీ..
ఈ వార్తలపై ఢిల్లీ పోలీసులు స్పష్టత ఇచ్చారు. శాంతిభద్రతల పేరుతో నిరసనకారులను అణచివేసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని పోలీసులు తీవ్రంగా ఖండించారు. పోలీస్ కమిషనర్‌కు ఎన్‌ఎస్ఏ (NSA) అధికారాలు ఇవ్వడం అనేది కొత్తగా తీసుకున్న అత్యవసర నిర్ణయం కాదని, ఇది ప్రతి మూడు నెలలకొకసారి (త్రైమాసికం) క్రమం తప్పకుండా జరిగే సాధారణ పరిపాలనా పునరుద్ధరణ (Routine Renewal) ప్రక్రియ మాత్రమేనని ఢిల్లీ పోలీస్ అధికారికంగా వెల్లడించారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలు ప్రారంభం కాకముందే ఈ అధికారిక ప్రక్రియ పూర్తయిందని వారు స్పష్టం చేశారు.
నిరసనలతో ముడిపెట్టవద్దు.. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు!
విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ సీజేపీ (CJP) మరియు విద్యార్థి సంఘాలు చేపడుతున్న ఆందోళనలతో ఈ ఎన్ఎస్ఏ ఉత్తర్వులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సాధారణ పరిపాలనా మార్గదర్శకాలను ప్రస్తుత నిరసనలకు తప్పుగా ముడిపెడుతూ నిందలు వేస్తున్నారని వివరించారు. పౌరులు, సోషల్ మీడియా వినియోగదారులు ఇటువంటి అవాస్తవాలను, తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పుకార్లు వ్యాప్తి చేస్తే చర్యలు!
రాజధానిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పౌరుల భద్రతే తమ ప్రాధాన్యమని తెలిపిన అధికారులు, ఆధారాలు లేని వార్తలను షేర్ చేయకూడదని కోరారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో అశాంతి రేకెత్తించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications