దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తులు వీరే- జాబితా నుంచి ఆ పేరు తప్పించారా?
న్యూఢిల్లీ: బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు వేల కోట్ల రూపాయల మేర కుచ్చుటోపీ పెట్టి దేశం విడిచి పారిపోయిన నేరస్థుల పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాళ రాజ్యసభలో విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి పంకజ్ చౌదరి సభ ముందు ఉంచారు.
ఈ జాబితాలో ఏడుమంది పేర్లు ఉన్నాయి. లిక్కర్ బరూన్, కింగ్ ఫిషర్ చీఫ్ విజయ్ మాల్యా పేరును ఇందులో చేర్చింది. ఇక నీరవ్ మోదీ, చేతన్ జయంతిలాల్ సందేశర, దీప్తి చేతన్ జయంతిలాల్ సందేశర, హితేష్ కుమార్ నరేంద్రభాయ్ పటేల్, నీరవ్ మోదీ, ఆసిఫ్ ఇక్బాల్ మీనన్, జునైద్ ఇక్బాల్ మీనన్, హజ్రా ఇక్బాల్ మెమోన్, రామచంద్రన్ విశ్వనాథన్ ఉన్నారు.

జయంతిలాల్ సందేశర- దీప్తి చేతన్ జయంతిలాల్ సందేశర 5,000 కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసగించారు. ఆర్థిక కుంభకోణానికి పాల్పడ్డారు. స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తోన్నారు వారిద్దరూ. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారు. నైజీరియాలో రియల్ ఎస్టేట్స్, చమురు బావులు ఉన్నాయి ఈ కంపెనీకి.
హితేష్ కుమార్ నరేంద్రభాయ్ పటేల్.. 8,100 కోట్ల రూపాయల మేర ఆర్థిక కుంభకోణానికి పాల్పడ్డారు. ఆయన కూడా సందేశర గ్రూప్ కంపెనీకి చెందిన వ్యక్తే. బినామీ కంపెనీలను సృష్టించి పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి రుణాలను తీసుకున్నారు. ఆయనపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్‌ను జారీ చేసింది.
ఆర్థిక నేరగాళ్లతో సహా పరారీలో ఉన్న మోసగాళ్ల నుంచి ఇప్పటివరకు 15,113 కోట్ల రూపాయలను రికవరీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల నుంచి రికవరీ చేసిన సొమ్మును ప్రభుత్వ రంగ బ్యాంకులకు తిరిగి చెల్లించామని పంకజ్ చౌదరి రాజ్యసభలో వెల్లడించారు.
ఈ జాబితాలో మేహుల్ చోక్సీ పేరు మిస్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 13,500 కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసాలకు పాల్పడిన చోక్సీ.. ప్రస్తుతం ఆంటిగ్వా అండ్ బార్బుడాలో నివసిస్తోన్న విషయం తెలిసిందే. ఆయనను భారత్‌ను తీసుకుని రావడానికి కేంద్రం ఎప్పటి నుంచో చర్యలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications