Monkeypox: కేంద్రం అలర్ట్: గైడ్‌లైన్స్ జారీ: విమాన ప్రయాణికుల కోసం: ఆ లోషన్స్ వాడొద్దు
న్యూఢిల్లీ: ప్రమాదకరమైన మంకీపాక్స్ భారత్‌లో అడుగు పెట్టింది. ఈ మహమ్మారి తొలి కేసు కేరళలో వెలుగులోకి వచ్చింది. ఈ నెల 12వ తేదీన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి నుంచి తిరువనంతపురానికి చేరుకున్న 35 సంవత్సరాల వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. కొల్లంకు చెందిన ఆ వ్యక్తికి నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా- పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు కేరళ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ చెప్పారు.

తగ్గని కోవిడ్..
ఇప్పటికే ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి పూర్తిగా నిర్మూలన కావట్లేదు. రోజువారీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ఈ ఉదయం జారీ చేసిన బులెటిన్ ప్రకారం.. 24 గంటల వ్యవధిలో కొత్తగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలను దాటింది. దేశవ్యాప్తంగా 20,038 కేసులు నమోదయ్యాయి. 16,994 మంది ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. 47 మంది మరణించారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,39,073కు చేరింది. పాజిటివిటీ రేటు 4.44 శాతంగా నమోదైంది.

ప్రైమరీ, సెకెండరీ కాంటాక్ట్స్
ఈ పరిస్థితుల మధ్య మంకీపాక్స్ కూడా భారత్‌కు విస్తరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీన్ని నియంత్రించడానికి కేరళ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంది. బాధితుడి ప్రైమరీ, సెకెండరీ కాంటాక్ట్స్‌ను ట్రేస్ చేసింది. వారి నుంచి నమూనాలను సేకరించే పనిలో ఉందక్కడి ప్రభుత్వం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తిరువనంతపురానికి చేరుకున్న విమానంలో 11 మంది ప్రయాణికులు, బాధితుడి తల్లిదండ్రుల నమూనాలను సేకరించింది. 21 రోజుల పాటు ఇంక్యుబేషన్ పీరియడ్‌ను నిర్ధారించింది.

కేంద్రం అప్రమత్తం..
దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సలహాదారు డాక్టర్ పీ రవీంద్రన్, ఎన్సీడీసీ జాయింట్ డైరెక్టర్ సంకేత్ కులకర్ణి, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి డిపార్ట్‌మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అరవింద్ కుమార్ అచార, డెర్మటాలజిస్ట్ డాక్టర్ అఖిలేష్ థోలెను ఇందులో సభ్యులుగా నియమించింది.

మార్గదర్శకాలు జారీ..
కొద్దిసేపటి కిందటే- మంకీపాక్స్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రత్యేకించి- విమాన ప్రయాణికులపై ఆంక్షలను విధించింది. ఒక చోటి నుంచి మరో చోటికి ప్రయాణం చేసే వారు- అనారోగ్యానికి గురైన వారిని, శరీరంపై గాయాలు ఉన్న వారిని కలుసుకోకూడదని సూచించింది. అటవీ జంతువులతో పాటు ఎలుకలు, ఉడతలు, కోతుల జీవించి ఉన్నా లేదా మరణించినా ఆ పరిసరాల్లో ఉండకూడదని పేర్కొంది.

ఆ లోషన్స్, క్రీమ్స్ వాడొద్దు..
దక్షిణాఫ్రికా నుంచి దిగుమతి అయిన జంతువుల అవశేషాల నుంచి తయారు చేసిన క్రీమ్స్, లోషన్స్, పౌడర్లను వినియోగించవద్దని సూచించింది. అనారోగ్యానికి గురైన వ్యక్తులు వినియోగించిన వస్తువులు, వస్త్రాలు, పరుపులు, హెల్త్‌కేర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని పేర్కొంది. మంకీపాక్స్ వ్యాప్తి చెందిన ప్రదేశంలో ఉంటే- ఆ సమాచారాన్ని తమ సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లేదా ఆసుపత్రిలో తెలియజేయాలని కోరింది.












Click it and Unblock the Notifications