
గే ను జడ్జిగా ఎలా ఒప్పుకోమంటారు: కేంద్రం
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానానికి కొత్త న్యాయమూర్తుల నియామకం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇదివరకు సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను ఆమోదించడానికి నిరాకరించింది. ప్రత్యేకించి 10 మంది సీనియర్ అడ్వొకేట్ల పేర్ల విషయంలో కేంద్రం అభ్యంతరం తెలిపింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను తిప్పి పంపించింది. వారిని న్యాయమూర్తులుగా ఎలివేట్ చేయడానికి అంగీకరించలేదు.

10 మంది పేర్లు వెనక్కి..
దీనికి సంబంధించిన ఓ ప్రత్యేక కథనాన్ని ఎన్డీటీవీ తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది. ఈ ప్రతిపాదనలను ఈ నెల 25వ తేదీ నాడే కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించినట్లు వివరించింది. ఈ 10 మందిలో సీనియర్ అడ్వొకేట్ సౌరభ్ కిర్పాల్ పేరు కూడా ఉంది. ఆయన హోమో సెక్సువల్. సీనియర్ అడ్వొకేట్‌గా మంచి పేరుంది. పలు కీలక పిటీషన్లపై ఆయన తన వాదనలను సమర్థవంతంగా వినిపించారు. తనను తాను గే గా అభివర్ణించుకున్నారు.

2017 నుంచీ..
ఈ కారణంతోనే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ- సౌరభ్ కిర్పాల్‌ను న్యాయమూర్తిగా ఎలివేట్ చేయడానికి అంగీకరించలేదని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. ఆయన పేరును పునః పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు కొలీజయాన్ని విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది. సీనియర్ అడ్వొకేట్ అయిన సౌరభ్ కిర్పాల్ పేరు 2017 నుంచీ తిరస్కరణకు గురవుతుందని స్పష్టం చేసిందా వెబ్‌సైట్.

స్పందించిన కిర్పాల్..
న్యాయమూర్తిగా నామినేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం తన పేరును పరిశీలించకపోవడం పట్ల సౌరభ్ కిర్పాల్ స్పందించారు. లైంగికత కారణంగా కేంద్ర ప్రభుత్వం తన పేరును తిప్పి పంపించడం సరికాదని అన్నారు. పురాణాలు, వేదాల్లో స్వలింగ సంపర్కం ఉందని, భారతీయ సంస్కృతి దీన్ని గుర్తించిందని ఆయన వ్యాఖ్యానించినట్లు ది క్వింట్ తెలిపింది.

ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీని..
రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీని గుర్తించడంలో ఎంతో వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. 2017 అక్టోబర్ 13వ తేదీన తొలిసారిగా సౌరభ్ కిర్పాల్ పేరును ఢిల్లీ హైకోర్టు కొలీజియం.. సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది. 2018 జులై 2వ తేదీన ఈ సిఫారసులను సుప్రీంకోర్టు పరిశీలనలోకి తీసుకుంది.

కొలీజియం సిఫారసుల్లో చేర్చిన అప్పటి సీజేఐ ఎన్వీ రమణ
ఆ తరువాత 2018 సెప్టెంబర్ 4, 2019 జనవరి 16, ఏప్రిల్ 1 నాటి కొలీజియం భేటీల్లో పరిగణనలోకి తీసుకున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయలేదు. 2021 మార్చి 2వ తేదీన కూడా అదే పరిస్థితి తలెత్తింది. అదే ఏడాది నవంబర్ 11వ తేదీన అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. కొలీజియం చేసే సిఫారసుల్లో సౌరభ్ కిర్పాల్ పేరును పొందుపరిచారు.