పెన్షనర్లకు కేంద్రం శుభవార్త- ఇక ఆధార్ తప్పనిసరి కాదు
కేంద్ర ప్రభుత్వం ఏటా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగ విరమణ చేసిన వారికి పింఛన్లు పంపిణీ చేస్తుంటుంది. వారికి ఏటా తాము బతికే ఉన్నామని నిరూపణ కోసం లైఫ్ సర్టిఫికెట్లు జారీ చేస్తుంటుంది. అయితే ఇందులో కేంద్రం విధించిన నిబంధనులు పింఛన్ దారుల ఉసురుతీస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్రం తాజాగా ఓ సవరణ చేసింది.
ప్రభుత్వం నుంచి పింఛన్లు తీసుకునే వారు ఏటా జీవన్ ప్రమాణ్ పేరుతో జారీ చేసే లైఫ్ సర్టిఫికెట్ కోసం ఆధార్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ వివరాలు ఇవ్వకపోతే జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్ల జారీని నిలిపేస్తున్నారు. దీంతో కేవలం ఆధార్ లేదన్న కారణంతో పింఛన్లు నిరాకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం వద్ద భారీగా ఫిర్యాదులు రావడంతో తాజాగా కేంద్రం ఆధార్ నిబంధనను ఎత్తేసింది. ఇకపై ఆధార్ సమర్పణ తప్పనిసరి కాదని తాజాగా కేంద్రం ప్రకటించింది.

వయోవృద్ధులైన పింఛనర్లు వేలిముద్రలు వేసే విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆధార్ వివరాలు తీసుకునే బయోమెట్రిక్ పరికరాల్లో వేలిముద్రలు పడకపోతే ఆధార్ గుర్తింపు రావడం లేదు. దీంతో ఇకపై ఆధార్ ఇవ్వకుండానే డిజిటల్ సర్టిఫికెట్ జీవన్ ప్రమాణ్ జారీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు నిబంధనలను సవరిస్తూ కేంద్రం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది పింఛనర్లకు ఊరట దక్కనుంది.












Click it and Unblock the Notifications