Delta Plus Variant : ఆ ఏడు రాష్ట్రాలకు కేంద్రం కీలక లేఖ-తక్షణం ఆ చర్యలు చేపట్టాలని ఆదేశం...
డెల్టా ప్లస్ వేరియంట్ పట్ల కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికిప్పుడు దీనితో పొంచి వున్న ముప్పేమీ లేకపోయినప్పటికీ దీర్ఘకాలంలో పంజా విసురుతుందేమో అన్న అనుమానం,ఆందోళన నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తిని ఆదిలోనే అరికట్టేలా కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు సూచిస్తోంది. తాజాగా ఏడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసిన కేంద్రం డెల్టా ప్లస్ వేరియంట్ కట్టడిపై కీలక సూచనలు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ పేరిట రాష్ట్రాలకు లేఖలు అందాయి.

లేఖలో ఏముంది...
డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడ్డ ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ చర్యలు చేపట్టాలని ఆ ఏడు రాష్ట్రాలను లేఖ ద్వారా కేంద్రం కోరింది. తమిళనాడు,కర్ణాటక,ఆంధ్రప్రదేశ్,గుజరాత్,పంజాబ్,హర్యానా,జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు ఈ ఆదేశాలను అమలుచేయాలని పేర్కొంది. ' కోవిడ్ నేపథ్యంలో ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్ కన్సార్షియం(INSACOG) నేత్రుత్వంలో మొత్తం జీనోమ్ విశ్లేషణ జరుగుతోన్న సంగతి మీకు తెలుసు. కేవలం జీనోమ్ సీక్వెన్లను గుర్తించడమే కాదు భౌగోళికంగా ఆయా ప్రాంతాల్లో కొత్తగా పుట్టుకొస్తున్న కోవిడ్ వేరియంట్లను గుర్తించి సమయానుసారం తగిన ఇన్‌పుట్స్‌ను ఇది అందజేస్తుంది.' అని పేర్కొంది.

ఆ జిల్లాల్లో తప్పనిసరిగా...
ఇప్పటివరకూ అందిన డేటాను విశ్లేషించిన ప్రకారం... డెల్టా ప్లస్ వేరియంట్‌లో మూడు ప్రధాన లక్షణాలను గుర్తించినట్లు లేఖలో కేంద్రం వెల్లడించింది. పెరిగిన వ్యాప్తి,ఊపిరితిత్తుల కణాలతో వైరస్ బలమైన బంధం,మోనోక్లోనల్ యాంటీబాడీలను సైతం తట్టుకునే లక్షణాలు గుర్తించినట్లు తెలిపింది. ప్రాధాన్యత క్రమం ప్రకారం... విస్తృతమైన టెస్టింగ్,సరైన ట్రేసింగ్,వ్యాక్సిన్ కవరేజీ చాలా అవసరమని పేర్కొంది. లేఖలో పేర్కొన్న ఏడు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తక్షణమే కంటైన్‌మెంట్ జోన్లు,క్లస్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందులో తమిళనాడులో-మధురై,కాంచీపురం,చెన్నై, కర్ణాటకలో మైసూరు,ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి,గుజరాత్‌లో సూరత్,హర్యానాలో ఫరీదాబాద్,పంజాబ్‌లో పటియాలా,లూథియానా,జమ్మూకశ్మీర్‌లో కత్రా జిల్లాలు ఉన్నాయి.

ఇప్పటివరకూ 51 కేసులు
ఇప్పటివరకూ 12 రాష్ట్రాల్లో 51 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో 22 కేసులు మహారాష్ట్రలో,9 కేసులు తమిళనాడులో,మధ్యప్రదేశ్‌లో ఏడు,కేరళలో మూడు,గుజరాత్,పంజాబ్‌లలో రెండు చొప్పున,ఏపీ,ఒడిశా,రాజస్తాన్,జమ్మూకశ్మీర్,హర్యానా,కర్ణాటకల్లో ఒకటి చొప్పున నమోదయ్యాయని తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి డెల్టా వేరియంటే కారణమని నిపుణులు చెప్పడంతో డెల్టా ప్లస్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ ముప్పు ఉంటుందా అన్న అనుమానాలు,ఆందోళన నెలకొన్నాయి. అయితే డెల్టా ప్లస్ అనేది కొత్త మ్యుటేషన్ మాత్రమేనని.... అంతమాత్రాన అది మహా ప్రమాదకారి ఏమీ కాదని జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ(ఐజీఐబీ) డైరెక్టర్ డా.అనురాగ్ అగర్వాల్ తెలిపారు. అయితే అంతర్జాతీయంగా చూస్తే ఇది ఆందోళనకారక వేరియంటేనని అన్నారు.












Click it and Unblock the Notifications