ఇక అలా పెళ్లి చేసుకుంటే పదేళ్ల జైలు ! కేంద్రం కొత్త బిల్లుతో షాక్ తప్పదా ?
దేశంలో కాలం చెల్లిన బ్రిటీష్ కాలం నాటి చట్టాలను సమూలంగా మార్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్ధానంలో మూడు కొత్త బిల్లుల్ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే వీటిపై మరింత అధ్యయనం అవసరం కాబట్టి నిపుణుల కమిటీకి సిఫార్సు చేసింది. అయితే కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ బిల్లుల్లో కీలకమైన ఐపీసీ స్ధానంలో వస్తున్న భారతీయ న్యాయ సంహిత బిల్లులో పెళ్లిళ్లకు సంబంధించి ఓ కీలక ప్రతిపాదన చేస్తోంది.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం చాలా చోట్ల పెళ్లిళ్ల మోసాలు పెరిగిపోతున్నాయి. ఇందులో ముఖ్యంగా గుర్తింపు దాచి మహిళల్ని పెళ్లి చేసుకోవడం, తద్వారా వాళ్లను మోసం చేయడం వంటి కేసులు పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తాజా బిల్లులో ఓ మార్పును ప్రతిపాదించింది. ఇప్పటివరకూ ఇలాంటి కేసులకు నిర్ధిష్టమైన శిక్షలు ఐపీసీలో లేకపోవడంతో దీని స్ధానంలో వస్తున్న భారతీయ న్యాయ సంహిత బిల్లులో గరిష్టంగా పదేళ్ల జైలుశిక్ష విధించేలా ప్రతిపాదిస్తున్నారు.

తాజా బిల్లు ప్రకారం పెళ్లి పేరుతో, పదోన్నతి పేరుతో, ఉద్యోగం ఇప్పిస్తాననే పేరుతో తప్పుడు వాగ్దానం చేసి మహిళల్ని లైంగికంగా వాడుకుంటే గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. అలాగే గుర్తింపును దాచిపెట్టి స్త్రీని మోసం చేసి పెళ్లి చేసుకున్నా ఇదే శిక్ష విధిస్తారు. 1860 నాటి భారత శిక్షాస్మృతి (IPC) స్థానంలో భారతీయ న్యాయ సంహిత (BNS) బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు . ఇందులో మహిళలపై నేరాలకు సంబంధించిన నిబంధనలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.
మహిళలపై నేరాలు, వారు ఎదుర్కొంటున్న అనేక సామాజిక సమస్యలను ఈ బిల్లులో ప్రస్తావించారు. తొలిసారిగా పెళ్లి, ఉద్యోగం, పదోన్నతి, తప్పుడు గుర్తింపు వంటి తప్పుడు వాగ్దానాలతో మహిళలతో లైంగిక చర్యలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఇప్పటివరకూ పెళ్లి చేసుకుంటానని మోసం చేసి అత్యాచారానికి పాల్పడినట్లు మహిళలు దాఖలు చేస్తున్న కేసులను కోర్టులు విచారించినప్పటికీ, ఐపీసీలో దీనికి నిర్దిష్ట శిక్ష విధించే నిబంధన లేదు. అందుకే ఈ బిల్లులో కొత్త నిబంధన పెట్టారు.












Click it and Unblock the Notifications