మరో రెండు రోజులు... ఏపీకి భారీ వర్ష సూచన... మత్య్సకారులకు హెచ్చరిక...
ఆంధ్రప్రదేశ్‌కు మరో రెండు రోజులు భారీ వర్ష సూచన ఉంది. అగస్టు 19,20,21 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. అలాగే విశాఖపట్నం,శ్రీకాకుళం,విజయనగరం,కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే రాయలసీమ,నెల్లూరు జిల్లాల్లోనూ ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఆ శాఖ కమిషనర్ కె.కన్నబాబు మాట్లాడుతూ... గోదావరికి మరింత వరద పోటెత్తే అవకాశం ఉండటంతో ఉభయ గోదావరి జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. లోతట్టు ప్రాంతాలతో పాటు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సముద్ర తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో...మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.

మూడు రోజుల వెదర్ రిపోర్ట్...
బుధవారం (ఆగస్టు 19): ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
గురువారం (ఆగస్టు 20) : ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
శుక్రవారం (ఆగస్టు 21) : తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు ప్రకటన విడుదల చేశారు.












Click it and Unblock the Notifications