Chandrayaan 3: అనూహ్య మలుపు తిరిగిన మిషన్..!!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్.. చంద్రయాన్ 3. ఏడాది జులై- ఆగస్టులో ఈ ప్రాజెక్ట్ ను చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లాంచ్ వెహికల్ ఇంజిన్ ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది.
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ప్రాజెక్ట్- మిషన్ చంద్రయాన్ 3. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలను సాగించడానికి చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 విఫలమైన అనంతరం దీనికి శ్రీకారం చుట్టింది ఇస్రో. ఈ ప్రాజెక్ట్ కీలక దశను పూర్తి చేసుకుంది. చంద్రయాన్ 3 రాకెట్ ఇంజిన్ ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. 25 సెకెండ్ల పాటు దాన్ని మండించారు.

క్రాష్ ల్యాండ్ తో..
చంద్రయాన్ 2లో భాగమైన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడిపై అడుగు పెట్టడం విఫలమైన విషయం తెలిసిందే. చిట్ట చివరి నిమిషంలో గతి తప్పింది. 2019 సెప్టెంబర్ 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 నుంచి 2:30 గంటల మధ్యలో చంద్రుడిపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు స్తంభించిపోయాయి. ఆ తరువాత అది క్రాష్ ల్యాండ్ అయింది. ఉత్తర ధృవం వైపు నేలకూలింది.

చంద్రయాన్ 2 విఫలం..
చంద్రుడి ఉపరితలానికి సమీపించిన తరువాత దాని వేగాన్ని నియంత్రించలేకపోయారు. ఫలితంగా శరవేగంతో అది ఉపరితలాన్ని ఢీకొట్టి.. ముక్కలైంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. దీనితో- ఈ ప్రయోగం విఫలమైనట్లు అప్పటి ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు. విక్రమ్ ల్యాండర్ ను చంద్రుడిపై ల్యాండ్ చేయించే ప్రయోగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వీక్షించారు. దీనికోసం ఆయన శ్రీహరికోటకు వచ్చారప్పట్లో.

ఉత్తర ధృవం వద్ద..
విక్రమ్ ల్యాండర్ లోని మూడు అతి కీలక పరికరాల్లో ఆర్బిటర్ ఒకటి. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్, ఆర్బిటర్.. ఈ మూడూ చంద్రయాన్-2 ప్రాజెక్టులో అత్యంత కీలకం. అందులో అమర్చిన ఆర్బిటర్ ద్వారానే ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ జాడను ఆ తరువాత కనుగొన్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఆర్బిటర్ లో అమర్చిన హైబీమ్ కెమెరా ద్వారా విక్రమ్ ల్యాండర్ జాడను గుర్తించారు. ఈ కెమెరా రిజల్యూషన్ 0.3.

చంద్రయాన్ 3..
ఇప్పుడు తాజాగా చంద్రయాన్ 3 మిషన్ ను చేపట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. ల్యాండర్ ను చంద్రుడిపైకి మోసుకెళ్లడానికి అవసరమైన లాంచింగ్ వెహికల్ క్రయోజనిక్ ఇంజిన్ సీ-20ని విజయవంతంగా పరీక్షించారు. 25 నిమిషాల పాటు దాన్ని మండించారు. తమిళనాడులోని మహేంద్రగిరిలో గల ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్ లో ఈ నెల 24వ తేదీన ఈ టెస్ట్ ఫైర్ చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

ల్యాండర్ టెస్ట్..
ఈ ప్రయోగం సంతృప్తికరమైన ఫలితాలను ఇచ్చిందని అన్నారు. ఈ మిషన్ లో భాగంగా చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన ల్యాండర్ ను- ఎలక్ట్రో మేగ్నటిక్ ఇంటర్‌ఫెరెన్స్/ఎలక్ట్రో మేగ్నటిక్ కాంపటిబిలిటీ టెస్ట్ కోసం బెంగళూరు పీణ్యాలోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ కు పంపించినట్లు వివరించారు. రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్, ఆటో కాంపాబిలిటీ టెస్ట్, యాంటెన్న పోలరైజేషన్, ల్యాండర్, దానికి అమర్చిన రోవర్ ను పరీక్షిస్తోన్నామని పేర్కొన్నారు.

జులై-ఆగస్టులో..
ఈ ఏడాది జులై-ఆగస్టులో శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రుడిపైకి పంపిస్తారు ఇస్త్రో శాస్త్రవేత్తలు. లాంచ్ వెహికల్ మార్క్ 3.. చంద్రయాన్ 3 ల్యాండర్ ను మోసుకెళ్తుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తున గల కక్ష్యలోకి దీన్ని లాంచ్ చేస్తుంది. అనంతరం ఈ ల్యాండర్ ను శాస్త్రవేత్తలు చంద్రుడిపై ల్యాండ్ చేస్తారు.












Click it and Unblock the Notifications