Chandrayaan 3 landing: ఉత్కంఠ భరిత క్షణాలు..!!
బెంగళూరు: ఇంకొన్ని నిమిషాల్లో భారత్.. నింగిని జయించబోతోంది. చందమామపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగరేయబోతోంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. ఇంకొద్దిసేపట్లో జాబిల్లి మీద అడుగు మోపబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సువర్ణాధ్యాయం కోసం దేశం మొత్తం ఉత్కంఠతగా ఎదురు చూస్తోంది.
ఇక అందరి దృష్టీ చంద్రయాన్ 3 మీదే నిలిచింది. గతంలో ఎదురైన చేదు సంఘటనలు పునరావృతం కాకూడదని యావత్ దేశం కోరుకుంటోంది. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ కావాలని కోరుతూ పలువురు దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మసీదుల్లో ప్రార్థనలు జరిపారు.

బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్‌కు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం చంద్రయాన్ 3 ల్యాండింగ్ పట్ల ఉత్కంఠతగా ఎదురు చూస్తోన్నారు. వర్చువల్ విధానంలో ఆయన ల్యాండింగ్ ప్రక్రియను వీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ ల్యాండింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తోన్నారు. బెంగళూరులోని మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ మొత్తం ఉత్కంఠభరితంగా మారింది. ల్యాండింగ్ అయ్యే క్షణాలను అక్కడి ఉద్యోగులు లెక్కిస్తోన్నారు. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎప్పటికప్పుడు మాడ్యుల్ పనితీరును గమనిస్తూ వస్తోన్నారు.

ల్యాండింగ్ సమయంలో ఎలాంటి పొరపాట్లకూ అవకాశం ఇవ్వదలచుకోలేదు. 2019లో ప్రయోగించిన చంద్రయాన్ 2 విఫలమైన నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. ఇప్పటివరకూ చంద్రయాన్ 3 పనితీరులో ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తలేదు. దాని పనితీరు సంతృప్తికరంగా ఉంటోంది.
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్.. ల్యాండింగ్ ప్రక్రియను దేశ రాజధాని నుంచే వీక్షిస్తోన్నారు. ఈ దఫా ఆయన బెంగళూరుకు రాలేదు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో ఈ ప్రక్రియను ఆయన తిలకిస్తోన్నారు. గంట కిందటే ఆయన సీఎస్ఐఆర్‌కు చేరుకున్నారు.












Click it and Unblock the Notifications