కుంభమేళా రైలు బద్దలు కొట్టి.. రాళ్లు రువ్వి...
ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. ఇప్పటికే కోట్ల సంఖ్యలో భక్తులు గంగా- యమున- సరస్వతి నదుల త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. జనవరి 29న మౌని అమావాస్య ను పురస్కరించుకుని మరో 10 కోట్ల మంది భక్తులు మహా కుంభమేళాకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మహాకుంభమేళాకు చేరుకునే రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. రైల్వే శాఖ, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తగిన రైళ్లను ఏర్పాటు చేసినా అవి ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో భక్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లోని హర్ పాల్ పుర్ రైల్వే స్టేషన్ లో జరిగింది. ఈ ఘటన 2002లో జరిగిన గోద్రా అల్లర్లను గుర్తుచేస్తోంది.

ఏం జరిగిందంటే..?
మహాకుంభమేళా సందర్భంగా ఝాన్సీ నుండి ప్రయాగ్ రాజ్ కు స్పెషన్ ట్రెయిన్ నడిపారు. ఆ స్పెషల్ ట్రైయిన్ మధ్యప్రదేశ్ లోని హర్ పాల్ పుర్ స్టేషన్ లో ఆగింది. అప్పటికే రైలు మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ట్రైయిన్ లో నిల్చోడానికి కూడా ఖాళీ లేదు. కానీ హర్ పాల్ పుర్ స్టేషన్ లో మాత్రం వందల సంఖ్యలో ప్రయాణికులు మహాకుంభమేళాను సందర్శన కోసం ట్రెయిన్ ఎక్కేందుకు ప్లాట్ ఫాం పైకి చేరుకున్నారు. కానీ రైలులో ఎక్కడా ఖాళీ లేదు. దీంతో ట్రెయిన్ లోని ప్రయాణికులు డోర్ తీయలేదు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు తీవ్ర ఆగ్రహంతో రైలును బద్దలు కొట్టారు. అద్దాలను రాళ్లతో ధ్వంసం చేశారు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గాలిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications