ఓ హత్య కేసు విచారణలో 17 ఏళ్ల రక్త చరిత్రను చెప్పేశాడు.. ఖాకీల ఎంక్వయిరీనా మజాకా!
నిజం నిప్పులాంటిది. అది ఏదో ఒకరోజు బయటపడుతుంది. అయితే, అలాంటి నిజాలను బయటకు తీయడంలో బిలాస్‌పూర్ పోలీసులు పీహెచ్‌డీ చేసినట్లే కనిపిస్తున్నారు. ఎందుకంటే, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో 17 ఏళ్లుగా వరుస హత్యలకు పాల్పడుతున్న సీరియల్ కిల్లర్ విషయం తెలిసినవారు ఎవ్వరైనా అక్కడి ఖాకీలకు సలామ్ కొట్టాల్సిందే అంటారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ పోలీసులు ఓ హత్య విషయమై అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. చూడడానికి అమాయకంగా కనిపించిన ఆ వ్యక్తి విచారణలో చెప్పిన విషయాలకు పోలీసుల వెన్నులో వణుకు పుట్టింది. 17 ఏళ్లుగా ఆ వ్యక్తి హత్యలు చేస్తూనే ఉన్నాడట. అంతేకాదు, ఇప్పటి వరకు అతడు చేసిన హత్యల్లో ఎలాంటి సమాచారం, ఆధారం పోలీసులకు దొరకలేదు. ప్రతి హత్యకు రాళ్లను తప్ప మరే ఇతర ఆయుధాన్ని తన దగ్గర ఉంచుకోకపోవడం ఈ సీరియల్ కిల్లర్ ప్రత్యేకత.

హత్యకేసు మూసేద్దాం అనుకుంటే..
బిలాస్‌పూర్‌లోని సర్కండ పోలీస్ స్టేషన్ పరిధిలో సత్యనారాయణ ప్రధాన్ అనే ఈ-రిక్షా డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ మంగళవారం అతని మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రదీప్ సింగ్ ఠాకూర్ (36) అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా తన మిత్రులు రింకూ సాహు, అజయ్ శ్రీవాస్‌తో కలిసి సత్యనారాయణను కొట్టామని, దాంతో అతను మృతి చెందాడని చెప్పుకొచ్చాడు. అక్కడివారంతా.. పరారీలో ఉన్న మిగతా ఇద్దరినీ అదుపులోకి తీసుకుంటే ఈ హత్యకేసు సుఖాంతం అయిపోతుంది అనుకున్నారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది.
పోలీసులు అవాక్కయ్యారు..
ప్రదీప్ సింగ్‌పై అనుమానం కలిగిన అక్కడి ఖాకీలు అతడిని మరింత లోతుగా విచారణ చేశారు. అంతే, అతను ఓ సీరియల్ కిల్లర్ అనే విషయం బయటపడింది. 17 ఏళ్ల క్రితం తన భార్యను చంపడంతో అతని రక్త చరిత్ర మొదలైంది. అలా దాశాబ్దానికిపైగా అడపా తడపా హత్యలు చేస్తూ.. తిరిగేస్తున్నానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. అంతేకాదు, ఈ సీరియల్ కిల్లర్ హత్య చేశాడంటే మూడోకంటికి కూడా అనుమానం రాకుండా చూసుకుంటాడట. అతని నేర చరిత్ర పూసగుచ్చినట్లు విచారణలో చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హత్యకు గురైన వారి వివరాల ఫైళ్లను బయటకు తీసే పనిలో పడ్డారు. ఎంతయినా ఖాకీల ఎంక్వయిరీనా మజాకా..!












Click it and Unblock the Notifications