చెన్నై సెకెండ్ ఎయిర్ పోర్ట్ పై విజయ్ ఫైనల్: అన్నపూర్ణి సూపర్ 6, ఫ్రీ సిలిండర్లు, ఫ్రీ బస్
తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. నూతన సంక్షేమ పథకాల గురించి సభకు వివరించారు. సూపర్ సిక్స్ లో భాగంగా ఉచిత సిలిండర్లు, ఉచి బస్సు ప్రయాణ సౌకర్యం విస్తరణ.. వంటి అంశాలపై ఆయన మాట్లాడారు. దీంతో పాటు చెన్నైలో ప్రతిపాదిత రెండో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంపైనా తన వైఖరిని స్పష్టం చేశారు.
మహిళలకు ఉచిత బస్సు..
తక్కువ ఆదాయం ఉన్న పేద కుటుంబాలకు సంవత్సరానికి మూడు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు అందించాలని నిర్ణయించినట్లు విజయ్ ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని మరింత విస్తరించానున్నామని, ట్రాన్స్‌జెండర్లకు కూడా ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాలన్నీ కూడా పేద, మధ్య తరగతి కుటుంబీకులకు ఆర్థిక భద్రతను కల్పిస్తాయని సీఎం విజయ్ పేర్కొన్నారు.

మూడు ఫ్రీ సిలిండర్లు..
అన్నపూర్ణి సూపర్ సిక్స్ పేరుతో నూతనంగా తీసుకువచ్చిన ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు 1.30 కోట్ల అర్హులైన కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రతి సంవత్సరం ఈ పథకం అమలు కోసం తమిళనాడు ప్రభుత్వం దాదాపు 4,000 కోట్ల రూపాయలను వ్యయం చేస్తోంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువగా ఉండే కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది.
బ్యాంక్ అకౌంట్లల్లో..
2027 పొంగల్ పండుగ నుండి అన్నపూర్ణి సూపర్ సిక్స్ పథకం పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఈ సందర్భంగా విజయ్ వెల్లడించారు. లబ్ధిదారులు సిలిండర్ బుక్ చేసుకుని డెలివరీ పొందిన తర్వాత, వీటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా గ్యాస్ ఏజెన్సీల నుంచి సేకరిస్తామని, ఆ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. దీనికోసం రూ. 4,000 కోట్లను ఖర్చు చేయనున్నట్లు వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణం..
ప్రస్తుతం ఆర్డినరీ టౌన్ బస్సుల్లో మాత్రమే అమలులో ఉన్న మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని విస్తరించనున్నామని విజయ్ పేర్కొన్నారు. వెట్రి పయన థిట్టం పథకం కింద ఇకపై ఎక్స్‌ప్రెస్, ఎల్‌ఎస్‌ఎస్, డీలక్స్ సర్వీసుల్లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని అన్నారు. ఈ ఫ్రీ బస్ సౌకర్యం అక్టోబర్ 2వ తేదీన ప్రారంభిస్తామని ప్రకటించారు. ట్రాన్స్‌జెండర్లు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు.
పరందూర్ ఎయిర్ పోర్ట్ స్క్రాప్..
కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన ప్రతిపాదిత పరందూర్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ పైనా విజయ్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. పరందూర్‌లో నూతన విమానాశ్రయం నిర్మించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తోన్నామని తేల్చి చెప్పారు. పరందూర్ వద్ద ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తే వందల హెక్టార్లల్లో పంట నష్టపోవాల్సి ఉంటుందని, స్థానికులను ఖాళీ చేయించి, వారికి ఇబ్బందులకు గురిచేసే ఎలాంటి అభివృద్ధి ప్రాజెక్టులను ప్రోత్సహించబోమని అన్నారు.
అయిదో టెర్మినల్..
పరందూర్ కు ప్రత్యామ్నాయంగా చెన్నై సమీపంలో వ్యవసాయేతర ప్రాంతాలను పరిశీలిస్తున్నామని, ఇందుకోసం ఇప్పటికే కొన్ని ప్రదేశాలను కూడా ప్రాథమికంగా గుర్తించామని విజయ్ వివరించారు. చెన్నై మీనంబాక్కం ఎయిర్ పోర్ట్ లో కొత్తగా అయిదో టెర్మినల్ నిర్మాణానికి త్వరలో చర్యలు చేపడతామని అన్నారు.














Click it and Unblock the Notifications