ఛత్తీస్‌గఢ్ దాడి: అమరులకు అమిత్ షా నివాళి -నక్సలిజానికి ముగింపు తప్పదన్న కేంద్ర హోం మంత్రి
దేశంలో వామపక్ష తీవ్రవాదం సృష్టించిన అశాంతికి వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటానికి తార్కిక ముగింపు పలకాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించుకుందని, మావోయిస్టులు సహా నక్సలిజాన్ని అంతం చేస్తామని, జవాన్ల బలిదానాలకు ప్రతీకారం తప్పక తీర్చుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మావోయిస్టుల దాడి నేపథ్యంలో సోమవారం ఛత్తీస్ గఢ్ లో పర్యటించిన ఆయన తొలిసారిగా బస్తర్ అడవుల్లోకి వెళ్లారు.
మావోయిస్టుల దాడిలో అమరులైన జవాన్లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ లు సోమవారం నివాళులు అర్పించారు. జవాన్ల పార్ధివదేహాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. జగదల్‌పూర్‌లో 14 మంది అమర జవాన్ల మృతదేహాలను ఉంచారు. మావోయిస్టుల దాడిలో మొత్తం 24 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా, ఇప్పటి వరకు 14 మంది జవాన్ల మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి.

జగదల్‌పూర్‌లో అమరులకు నివాళులు అర్పించిన తర్వాత హోం మంత్రి అమిత్ షా.. బీజాపూర్ - సుక్మా జిల్లాల సరిహద్దులో దాడి ఘటన చోటుచేసుకున్న టెర్రాం ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులతో ఆయన సమీక్ష చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను అమిత్ షా పరామర్శించారు.

ఛత్తీస్ గఢ్ లో శనివారం నాటి మావోయిస్టుల దాడిలో 24 మంది జవాన్లు చనిపోగా, 31 మంది జవాన్లు గాయపడ్డారు. చనిపోయిన జవాన్లలో ఎపికి చెందిన మురళీ కృష్ణ, జగదీశ్ ఉన్నారు. ఈ ఇద్దరు కోబ్రా 210 దళంలో జవాన్లుగా పని చేస్తున్నారు. ఇటీవల కాలంలో పుల్వామా దాడి తర్వాత భారత భద్రతా బలగాలపై జరిగిన రెండో అతిపెద్ద దాడిగా టెర్రాం ఎన్ కౌంటర్ నిలిచింది.












Click it and Unblock the Notifications