విమానాలకు బాంబు బెదిరింపులు: మైనర్ బాలుడి అరెస్ట్, కారణం తెలిసి షాక్!
దేశ వ్యాప్తంగా మూడు విమానాలకు బాంబు బెదిరింపులకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, విమానాలకు బాంబు బెదిరింపులకు పాల్పడింది ఓ మైనర్ బాలుడు కావడం గమనార్హం. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్నాయుడు వెల్లడించారు. విమానాలకు బెదిరింపులు రావడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని తెలిపారు.
ముంబై నుంచి బయల్దేరిన విమానాలకు భద్రతా ముప్పు ఉందంటూ పోస్టు పెట్టిన ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాటి మూలాలు ఛత్తీస్‌గఢ్ నుంచి ఉన్నట్లు గుర్తించారు. ఓ వ్యాపారవేత్త కుమారుడు (17) సోషల్ మీడియాలో ఈ బెదిరింపు పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. ఈ కేసులో సదరు వ్యాపారవేత్తకు సమన్లు పంపిన పోలీసులు.. నిందితుడైన మైనర్ ను అదుపులోకి తీసుకుని ముంబై తరలించారు.

అయితే, నిందితుడు విమానాల బెదిరింపులకు ఎందుకు పాల్పడ్డాడో చెప్పిన కారణాలు మాత్రం పోలీసులను విస్తుపోయేలా చేశాయి. నగదు విషయంలో గొడవపడిన ఓ స్నేహితుడిని ఇరికించేందుకు ఈ బాలుడు ఇదంతా చేసినట్లు తెలిసింది. తన స్నేహితుడి పేరుతో ఎక్స్ ఖాతా ఓపెన్ చేసి.. ఆ అకౌంట్ నుంచి విమానాలకు బాంబు బెదిరింపు పోస్టులు పెట్టాడు. ఇలాగే మూడు విమానాలకు బాంబు బెదిరింపు సందేశాలు పోస్టు చేశాడు.
ఎయిర్ లైన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఆ పోస్టుల వెనుక ఉన్న నిందితుడిని పట్టుకున్నారు. ఈ మేరకు బాలుడి తల్లిదండ్రులకు నోటీసులు ఇచ్చి.. బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకి తరలించారు. మిగిలిన విమానాలకు వచ్చిన బాంబు బెదిరింపు కాల్స్, మెసేజ్ లకు ఈ బాలుడికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, వరుసగా విమానాలకు బెదిరింపులు రావడంపై ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు. సంబంధిత దర్యాప్తు సంస్థలు ఆయా కేసులపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. విమానయాన సంస్థలు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని రామ్మోహన్నాయుడు తెలిపారు.












Click it and Unblock the Notifications