సస్పెండ్ చేశారని తుపాకీతో కాల్చుకుని ఎస్పి ఆత్మహత్య
రాయ్‌పూర్: తనను సస్పెండ్ చేశారని మనస్తాపానికి గురైన ఓ సీనియర్ ఐపిఎస్ అధికారి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనితోపాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలను కూడా తుపాకీతో కాల్చేశాడు. దీంతో ఆయన భార్య మృతి చెందగా, ఇద్దరు పిల్లల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ విషాధ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగ్దల్‌పూర్‌లో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నారనే ఆరోపణతో అదనపు జిల్లా జడ్జిని జగ్దల్‌పూర్ ఎస్పి దేవ్‌నారాయణ్ పటేల్ (40) వాహనాన్ని నిలిపేశాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన దేవ్ నారాయణ్ పటేల్ అదనపు జిల్లా జడ్జి(ఎడిజె)పై దాడికి పాల్పడ్డాడు.
దాడిపై ఎడిజె కోర్టును ఆశ్రయించాడు. ఎడిజె కోర్టును ఆశ్రయించిన వెంటనే రాష్ట్ర పోలీసు శాఖ స్పందించి దేవ్‌నారాయణ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దేవ్‌నారాయణ్ అతని అధికారిక నివాసంలోనే మంగళవారం ఉదయం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందే అతని భార్య, పిల్లలపై కాల్పులు జరిపాడు. దేవ్‌నారాయణ్ భార్య ప్రతిమ అక్కడికక్కడే మృతి చెందగా.. కుమారుడు ఆర్యన్(6), కూతురు పూజ (11)లకు తీవ్ర గాయాలయ్యారు.

ఆర్యన్, ప్రతిమలను రాయ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. చిన్నారులిద్దరికీ బుల్లెట్ గాయాలయ్యాయని, వారికి ప్రస్తుతం శస్త్ర చికిత్స జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన అతని నివాసంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు చెప్పారు. ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ అంకిత్ ఆనంద్ మెజిస్ట్రియల్ విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. జగ్దల్‌పూర్ అడిషనల్ జిల్లా మెజిస్ట్రేట్ చందన్‌కుమార్ కూడా విచారణకు ఆదేశించారు. కాగా మావోయిస్టులను సమర్థవంతంగా ఎదుర్కొన్నందుకు నారాయణ్‌దేవ్ పటేల్‌ను ప్రభుత్వం గతంలో గ్యాలంట్రీ అవార్డుతో సత్కరించింది.












Click it and Unblock the Notifications