ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లడమే పాపమా.. చిన్నారులకు హెచ్ఐవీ రక్తం ఎక్కించిన వైద్యులు !!!
ఆరోగ్యమే మహా భాగ్యం.. చిన్నారులు నుంచి పెద్దల వరకు.. పేదల నుంచి ధనికుల వరకు.. ఎవరికైనా సరే ఆరోగ్యం బాగుంటే చాలు అనుకుంటారు. అనారోగ్యం బారిన పడినప్పుడు మాత్రం ఎవరి స్థాయికి తగ్గట్టు వారు చికిత్స తీసుకుంటూ ఉంటారు. అయితే పెదలు, మధ్యతరగతి వారికి ఆరోగ్యం విషయంలో అండగా ఉండేందుకే ప్రభుత్వం ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ నిర్వహణ, చికిత్స విధానంపై ఎప్పుడూ విమర్శలు వస్తూనే ఉంటాయి. సదరు ఘటన జరిగినప్పుడు మాత్రం హడావిడి చేయడం.. మొక్కుబడిగా కొన్ని చర్యలు చేపట్టడం తప్ప.. సర్కారు ఆస్పత్రులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతూనే ఉంటున్నాయి.
ఇక ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోని సత్నా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తలసేమియాతో బాధపడుతున్న ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ సోకిన రక్తం ఎక్కించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రక్తమార్పిడిలో జరిగిన భద్రతా లోపమే దీనికి కారణమని తేలింది. ఈ దారుణమైన నిర్లక్ష్య ఘటనపై చిన్నారుల కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ప్రజా సంఘాలు, ప్రముఖులు సైతం ఫైర్ అవుతున్నారు.

కాగా ప్రాణాలను నిలుపుకోడానికి తరచుగా రక్తమార్పిడిపై ఆధారపడే ఈ చిన్నారులకు మూడు వేర్వేరు బ్లడ్ బ్యాంకుల నుంచి మొత్తం 189 యూనిట్ల రక్తం ఎక్కించారు. దాదాపు 150 మందికి పైగా దాతల నుంచి సేకరించిన రక్తాన్ని సరిగా పరీక్షించకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని జిల్లా స్థాయి విచారణలో స్పష్టమయ్యింది. ఈ ఘటనపై ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెంటనే స్పందించింది. బ్లడ్ బ్యాంక్ ఇన్‌ఛార్జ్‌తో పాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను సస్పెండ్ చేయగా.. సత్నా జిల్లా ఆసుపత్రి మాజీ సివిల్ సర్జన్ డాక్టర్ మనోజ్ శుక్లాకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
అయితే ఈ ఏడాది మార్చిలోనే చిన్నారులలో మొదటి హెచ్‌ఐవీ పాజిటివ్ కేసు నమోదైంది. అయినప్పటికీ దాదాపు తొమ్మిది నెలల పాటు ఆసుపత్రి యాజమాన్యం, జిల్లా అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారన్న తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. సదరు ఘటన పట్ల ఎవరికి ఫిర్యాదు చేయాలి? అంటూ ఓ చిన్నారి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విషయాన్ని సైలెంట్ చేసేందుకు చూస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఈ నిర్లక్ష్యంపై సీరియస్ యాక్షన్ తీసుకొని చిన్నారులను ఆదుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications