వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది.. ఈ ‘విధ్వంసానికి’ 5 కారణాలు..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చైనా

ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ తగ్గిపోవడంతోపాటు తాము అనుసరిస్తున్న జీరో-కోవిడ్ వ్యూహాల వల్ల చైనా ఆర్థిక వృద్ధి మందగిస్తోంది.

జులై నుంచి సెప్టెంబరు త్రైమాసిక గణాంకాలు త్వరలో విడుదల కాబోతున్నాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ తిరోగమన దిశలో ఉన్నట్లు తేలితే, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ అవుతాయి.

చైనా వార్షిక వృద్ధి రేటు లక్ష్యం 5.5 శాతంగా నిర్దేశించారు. దీన్ని చేరుకోవడం దాదాపుగా అసాధ్యం.

గత ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోయే ముప్పును తృటిలో చైనా తప్పించుకుంది. అయితే, ఈ ఏడాది అసలు ఎలాంటి వృద్ధీ ఉండబోదని కొందరు ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు.

అమెరికా, బ్రిటన్ తరహాలో ఇక్కడ ద్రవ్యోల్బణం విపరీతంగా కనిపించడం లేదు. కానీ, అయితే, ఇటు దేశీయంగా, అంతర్జాతీయంగా వస్తువుల డిమాండ్ తగ్గిపోవడం లాంటి సమస్యలు చైనాను వేధిస్తున్నాయి. అమెరికా లాంటి అగ్ర దేశాలతో వాణిజ్య విభేదాలు కూడా వృద్ధికి కళ్లెం వేస్తున్నాయి.

కొన్ని దశాబ్దాలలో చూడని రీతిలో డాలరుతో యువాన్ మారకపు విలువ దారుణంగా పడిపోతోంది. కరెన్సీ బలహీనపడితే మదుపరులు వేరే ఆర్థిక వ్యవస్థల వైపు వెళ్లిపోతారు. దీంతో మార్కెట్లు కుప్పకూలే ముప్పు ఉంటుంది. మరోవైపు ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చెలామణీలోకి తీసుకురావడం కూడా దేశ కేంద్ర బ్యాంకుకు కష్టం అవుతుంది.

అక్టోబరు 16న జరగబోతున్న కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ (సీపీసీ)లో షీ జిన్‌పింగ్‌కు మూడో దఫా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి కీలక పరిణామాల నేపథ్యంలో చైనా ఆర్థిక వ్యవస్థ గాడితప్పుతోంది. అసలు దీనికి కారణాలు ఏమిటి?

షీ జిన్‌పింగ్

1. జీరో కోవిడ్ వ్యూహంతో విధ్వంసం

చైనాలోని షెంజెన్, తియాంజిన్ లాంటి పరిశ్రమలు ఎక్కువగా ఉండే నగరాల్లో కోవిడ్-19 వ్యాప్తి కొనసాగుతోంది. దీంతో ఇక్కడి పరిశ్రమలు చాలా ప్రభావితం అవుతున్నాయి.

ఆహారం, పానీయాలు, రీటెయిల్, పర్యటకం లాంటి వాటిపై ప్రజలు పెద్దగా ఖర్చు పెట్టడం లేదు. దీంతో ఈ రంగాలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

తయారీ రంగం విషయానికి వస్తే, సెప్టెంబరులో చాలా పరిశ్రమల్లో మళ్లీ పనులు మొదలయ్యాయని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ చెబుతోంది.

మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయం పెరగడంతో మళ్లీ తయారీ రంగం ఊపందుకుంది.

అయితే, డిమాండ్ తగ్గిపోవడంతో ఉత్పత్తి, కొత్త ఆర్డర్లు, ఉద్యోగాలపై ప్రభావం పడుతోందని తాజాగా ఒక ప్రైవేటు సర్వే వెల్లడించింది.

వడ్డీ రేట్లు పెంచడం, ద్రవ్యోల్బణం, యుక్రెయిన్‌లో యుద్ధం లాంటి కారణాల వల్ల అమెరికా సహా చాలా దేశాల్లో డిమాండ్ తగ్గిపోయింది.

అయితే, ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టేందుకు చైనా చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే, మొదటగా జీరో కోవిడ్ వ్యూహాలకు స్వస్తి పలకాలని వారు సూచిస్తున్నారు.

''వ్యాపార కార్యకలాపాలు విస్తరించనప్పుడు లేదా ప్రజలు ఖర్చు పెట్టలేనప్పుడు.. ఆర్థిక వ్యవస్థలోకి భారీగా నగదు చెలామణీలోకి తీసుకొచ్చి ఏం లాభం?’’అని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ చీఫ్ ఆసియా ఎకనమిస్ట్ లూయిస్ కుజ్స్ అన్నారు.

చైనా

2. చైనా సరిపడా చర్యలు తీసుకోవడం లేదు

చిన్న పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్ రంగాలకు ఊతం ఇచ్చేందుకు ఒక ట్రిలియన్ యువాన్ (16.54 లక్షల కోట్లు) ప్యాకేజీని చైనా ప్రకటించింది.

అయితే, వృద్ధి లక్ష్యాలను అందుకునేందుకు, కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించేందుకు అధికారులు ఇంకా చాలా చర్యలు తీసుకోవచ్చు.

ముఖ్యంగా మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెంచడం, గృహ రుణాలు, ప్రాపర్టీ డెవలపర్ల నిబంధనలు సరళీకరించడం, పన్ను మినహాయింపులు ఇలా చాలా చర్యలు తీసుకోవచ్చు.

''ఇదివరకు ఇలాంటి ఆర్థిక మందగమనాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలిస్తే, ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు ఒక మోస్తరుగానే కనిపిస్తున్నాయి’’అని కుజ్స్ వివరించారు.

చైనా

3. ప్రాపర్టీ మార్కెట్ సంక్షోభంలో..

రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు నెమ్మదించడంతోపాటు గృహ నిర్మాణ రంగంలో ప్రతికూల వాతావరణం వృద్ధి రేటుపై కచ్చితంగా ప్రభావం చూపిస్తాయి.

ఎందుకంటే చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ప్రాపర్టీ, ఇతర పరిశ్రమల వాటా మూడో వంతు వరకు ఉంటుంది.

''గృహ నిర్మాణ రంగంపై ప్రజల నమ్మకం తగ్గినప్పుడు.. పూర్తిగా ఆర్థిక వ్యవస్థపై నీలినీడలు కమ్ముకుంటాయి’’అని కుజ్స్ చెప్పారు.

ఇళ్లను కొనుగోలు చేసేవారు తమ ఇంటి నిర్మాణం పూర్తికాకపోతే ఈఎంఐలు చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు. కొందరు అసలు ఈ నిర్మాణాలు ఎప్పటికైనా పూర్తవుతాయా? అని ఆందోళన చెందుతున్నారు. కొత్త ఇళ్లకు డిమాండ్ తగ్గింది. దీంతో నిర్మాణ రంగంలో ఉపయోగించే వస్తువుల దిగుమతులు కూడా పడిపోయాయి.

రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు జీవం పోయాలని చైనా ప్రయత్నిస్తున్నప్పటికీ, చాలా నగరాల్లో ఇళ్ల ధరలు ఈ ఏడాది 20 శాతానికిపైగా తగ్గిపోయాయి.

ప్రాపర్టీ డెవలపర్లపై ఒత్తిడి పెరుగుతోంది. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ప్రజల విశ్వాసాన్ని పెంచేందుకు అధికారులు ఇంకా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.

చైనా

4. వాతావరణ మార్పులతో పరిస్థితి మరింత దారుణం

విపరీత వాతావరణ పరిస్థితులు చైనా పరిశ్రమలపై ప్రభావం చూపిస్తున్నాయి.

తీవ్రమైన హీట్‌వేవ్, ఆ తర్వాత నీటి ఎద్దడి వాయువ్య సిచువాన్ ప్రావిన్స్, సెంట్రల్ బెల్టులోని చాంగ్‌కింగ్ నగరంపై గత ఆగస్టులో తీవ్ర ప్రభావాన్ని చూపించాయి.

ఇక్కడ ఏసీల డిమాండ్ పెరిగింది. దీంతో విద్యుత్ గ్రిడ్‌పై ఒత్తిడి ఎక్కువైంది. ఈ ప్రాంతాలు చాలావరకు జల విద్యుత్‌పైనే ఆధారపడి ఉంటాయి.

ఐఫోన్లను తయారుచేసే ఫాక్స్‌కాన్‌తోపాటు టెస్లా లాంటి ప్రధాన పరిశ్రమలకు కూడా విద్యుత్ సమస్యలు వెంటాడాయి. కొన్ని పరిశ్రమలు గంటలపాటు పనిచేసే సమయాన్ని తగ్గించుకుంటే, మరికొన్ని పూర్తిగా మూతపడాల్సిన పరిస్థితి వచ్చింది.

గత ఏడాదితో పోల్చినప్పుడు, 2022 మొదటి ఏడు నెలల్లో ఇనుము, స్టీలు లాంటి రంగాల్లో లాభాలు దాదాపు 80 శాతం తగ్గిపోయాయని చైనా స్టాటిస్టిక్స్ బ్యూరో విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. అయితే, విద్యుత్ కంపెనీలతోపాటు రైతులను ఆదుకునేందుకు బిలియన్ డాలర్ల ప్యాకేజీని చైనా ప్రకటించింది.

5. చైనా టెక్ దిగ్గజాల పరిస్థితి దారుణం..

చైనా టెక్ దిగ్గజాలపై నియంత్రణా పరమైన నిబంధనలు పరిస్థితిని మరింత తీవ్రం చేస్తున్నాయి.

తాజా త్రైమాసికంలో టెన్సెంట్, అలీబాబా తమ రెవెన్యూ తగ్గిపోయిందని తొలిసారి ప్రకటించాయి. టెన్సెంట్ లాభాలు 50 శాతం పడిపోగా, అలీబాబా నికర ఆదాయం సగానికి తగ్గిపోయింది.

వేల మంది యువత తమ ఉద్యోగాలు కోల్పోతున్నారు. దీంతో నిరుద్యోగ సంక్షోభం ముదురుతోంది. 16 నుంచి 24 మధ్య వయసున్న ప్రతి ఐదుగురిలో ఒకరు నిరుద్యోగులేనని గణాంకాలు చెబుతున్నాయి. దీని వల్ల చైనా ఉత్పాదకత, వృద్ధి రేటుపై దీర్ఘకాలంలో ప్రభావం చూపే అవకాశముంటుంది.

చైనాలో విజయవంతమైన కొన్ని ప్రైవేటు కంపెనీలపై జిన్‌పింగ్ పట్టు మరింత పెరుగుతుందనే ఆందోళన కూడా మదుపరులను వెంటాడుతోంది. అదే సమయంలో చైనా ప్రభుత్వ కంపెనీలపై విదేశీ మదుపరుల విశ్వాసం పెరుగుతోంది.

ప్రైవేటు సంస్థ అలీబాబా నుంచి జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ భారీగా నిధులను ఉపసంహరించుకుంది. మరోవైపు వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హ్యాథ్‌వే కూడా వాహనాల తయారీ సంస్థ బీవైడీలోని తమ వాటాను విక్రయిస్తోంది. ఏడాది ద్వితీయార్ధంలో 7 బిలియన్ డాలర్లు (రూ. 57,066 కోట్లు) పెట్టుబడులను టెన్సెంట్ వెనక్కి తీసుకొంది.

మరోవైపు అమెరికా స్టాక్‌ మార్కెట్‌లో రిజిస్టర్ అయిన చైనా కంపెనీలపై అమెరికా నిఘా మరింత పెరిగింది.

''పెట్టుబడులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు వాయిదా పడుతున్నాయి. కొన్ని విదేశీ కంపెనీలు ఇతర దేశాల్లో తమ వ్యాపారాలను విస్తరించుకొంటున్నాయి’’అని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ ఇటీవల వెల్లడించింది.

ఇంతకుముందులా నేడు చైనా తమ వ్యాపార ద్వారాలను ప్రపంచ దేశాల కోసం తెరచి ఉంచకపోవచ్చనే వాదన నానాటికీ బలపడుతోంది. కొన్ని దశాబ్దాలుగా చైనా శక్తికి కారణమైన ఆర్థిక వృద్ధిని షీ జిన్‌పింగ్ పణంగా పెడుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
China's economy is in trouble.. 5 reasons for this 'destruction'..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X