డోక్లామ్ ఇష్యూ: బరితెగించిన చైనా, తప్పంతా భారత్ దేనంటూ వీడియో.. వైరల్!
అంతర్జాతీయ సమాజం ఎదుట భారతదేశాన్ని దోషిగా నిలబెట్టేందుకు చైనా మీడియా తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. మసి పూసి మారేడు కాయ చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది.
న్యూఢిల్లీ: మీ ఇంట్లోకి దూరిన దొంగ మిమ్మల్నే.. దొంగ దొంగ అంటే మీకెలా ఉంటుంది. ఇప్పుడు చైనా కూడా అచ్చం ఇలాగే చేస్తోంది. డోక్లామ్ ప్రాంతంలోకి రెండు నెలల క్రితం చొచ్చుకొచ్చిన చైనా.. ఇప్పడు ఆ పనిచేసింది ఇండియా అంటూ అభాండాలు వేస్తోంది.
అంతర్జాతీయ సమాజం ఎదుట భారతదేశాన్ని దోషిగా నిలబెట్టేందుకు చైనా మీడియా తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. మసి పూసి మారేడు కాయ చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది.

ఇన్నాళ్లూ భారత్ ను ఉద్దేశించి రకరకాల వార్నింగ్ లు ఇస్తూ కథనాలు ప్రచురించిన చైనా అధికారిక మీడియా ఇప్పుడు ఓ తప్పుడు వీడియోను రూపొందించి అందులో భారత్ పై అనేక అభాండాలు వేసింది.
'సెవెన్ సిన్స్ ఆఫ్ ఇండియా' పేరుతో రూపొందించిన ఈ వీడియోను చైనా ప్రభుత్వ అధికారిక చానల్ జినువా ప్రసారం చేసింది. చైనా లెక్క ప్రకారం మన దేశం ఏడు పాపాలు చేసిందట.
భారత్ చేసిన ఏడు పాపాలంటూ.. ఇంగ్లిష్‌లో రూపొందించిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. డోక్లామ్ ప్రాంతం నుంచి భారత్ వెనక్కి తగ్గకపోవడంతో చైనా తన మీడియా ద్వారా భారత్‌పై ఇలా ఆక్రోశాన్ని వెళ్లగక్కుతోంది.
#TheSpark: 7 Sins of India. It’s time for India to confess its SEVEN SINS. pic.twitter.com/vb9lQ40VPH
— China Xinhua News (@XHNews) August 16, 2017
వాళ్ల ప్రాంతంలో వాళ్లు పనిచేసుకుంటుంటే.. మనదేశం బుల్ డోజర్లతో వెళ్లి అడ్డుకుందట. అసలు డోక్లామ్ ప్రాంతం చైనాదే అని ఇండియా కూడా అంగీకరించిందట. ఇండియా కావాలనే నిద్ర నటిస్తోందని, వాళ్లను నిద్ర లేపడం అసాధ్యమనీ ఈ వీడియోలో చైనా ఆరోపించింది.
పక్కనే ఉన్న చిన్న దేశం భూటాన్ ను మభ్యపెట్టి ఆ దేశ భూభాగానికి రక్షణగా ఉంటున్నామని ఇండియా చెప్పుకుంటోందట. కొసమెరుపు ఏమిటంటే.. ఈ వీడియోలో ఆఖర్న'చట్టాలను గౌరవించాలని మీ అమ్మ మీకెప్పుడూ చెప్పలేదా?' అంటూ యాంకర్ ఒక ప్రశ్న వేయడం.
తలపాగా, కళ్లద్దాలతో ఓ నటుడితో భారత యాసలో ఇంగ్లిష్ మాట్లాడిస్తూ.. తన జాత్యాహంకారాన్ని చాటింది. భూటాన్ కూడా డోక్లాం ప్రాంతం తనది కాదని చెబుతోందని, ఇండియా ప్రవర్తన పట్ల భూటాన్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోందంటూ కొత్త కథలు చెబుతోంది.
చైనాలో సోషల్ మీడియాపై నిషేధం ఉండటంతో బయట ఏం జరుగుతుందో వారికి అంతగా తెలియదు. దీంతో డోక్లాం విషయంలో తప్పంతా భారత్‌దే అని వారిని నమ్మించడానికి చైనా ప్రభుత్వం మీడియా ద్వారా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.


Click it and Unblock the Notifications