చిప్కో ఉద్యమనేత కన్నుమూత: దేశ గతిని మలుపు తిప్పిన మహోద్యమానికి సారథ్యం
డెహ్రాడున్: దేశ గతిని మలుపు తిప్పిన మహోద్యమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.. చిప్కో మూవ్‌మెంట్. అడవుల నరికివేతకు నిరసనగా లక్షలాదిమందిని ఏకతాటిపై నడిపించిన ఆ ఉద్యమానికి సారథ్యం వహించిన సుందర్ లాల్ బహుగుణ.. ఇక లేరు. కరోనా వైరస్ మహమ్మారి సోకడంతో ఉత్తరాఖండ్ రిషికేష్‌లోని అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతోన్న ఆయన కొద్ది సేపటి కిందటే కన్నుమూశారు. రిషికేష్ ఎయిమ్స్ అధికారులు దీన్ని ధృవీకరించారు. ఆయన వయస్సు 94 సంవత్సరాలు.
కరోనా బారిన పడిన ఆయన ఈ నెల 8వ తేదీన ఎయిమ్స్-రిషికేష్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆయన డయాబెటిక్ పేషెంట్. ఆసుపత్రిలో చేరిన తరువాత న్యుమోనియా బారిన పడ్డారు. దీనితో ఆయనకు అత్యాధునిక వైద్య చికిత్సను అందించారు డాక్టర్లు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను గురువారం వెంటిలేటర్‌పై ఉంచారు. అయినప్పటికీ- ఆయన ప్రాణాలను నిలపలేకపోయారు. కొద్దిసేపటి కిందటే ఆయన కన్నుమూసినట్లు వెల్లడించారు. సుందర్‌లాల్ బహుగుణ భౌతిక కాయానికి రిషికేష్‌లోని గంగానదీ తీరంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్, ఆ రాష్ట్ర మంత్రులు సంతాపం తెలిపారు. ఆయన చేసిన కృషి, నడిపించిన ఉద్యమం వల్లే అడవులు పచ్చగా ఉన్నాయని పేర్కొన్నారు. చిప్కో ఉద్యమం వల్ల దేశవ్యాప్తంగా అడవుల సంరక్షణ కోసం పలు చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఉమ్మడి ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, దక్షిణాదిన విస్తరించిన పశ్చిమ కనుమల్లో అడవుల నరికివేతను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిషేధించాయి. అడవులు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలను చేపట్టాయి.
1970లో చిప్కో ఉద్యమానికి బహుగుణ శ్రీకారం చుట్టారు. చూస్తోండగానే ఈ ఉద్యమం ఊపందుకుంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా కొనసాగిన అనేక ఉద్యమాల్లో దీనిది ప్రథమస్థానం. ఉద్యమంలో భాగంగా సుందర్‌లాల్ బహుగుణ 1981-83 మధ్య హిమాలయ పర్వత ప్రాంతాల్లో 500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. దాని ఫలితంగా హిమాలయ పర్వత సాణువుల్లో చెట్ల నరికివేతను నిషేధిస్తూ ప్రభుత్వం చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.












Click it and Unblock the Notifications