సభలో చిరు స్పీచ్: దూసుకొచ్చిన సిఎం, గుడ్ యాక్టరని
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)పై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి గురువారం రాజ్యసభలో ప్రసంగించారు. సభలో ఇది తన తొలి ప్రసంగమని, అందరూ సహకరించాలని చిరంజీవి కోరారు. చిరు ప్రసంగం సమయంలో కొంత వాగ్వాదం, గందరగోళం కనిపించింది. చిరు ప్రసంగిస్తుండగా సిఎం రమేష్ చిరంజీవి పైకి దూసుకు వచ్చారు. కాంగ్రెసు సభ్యులు అడ్డుకున్నారు.
చిరు ప్రసంగం.... నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. తెలుగు ప్రజల తరఫున మాట్లాడుతున్నా. విభజన అనేది పదకొండు కోట్ల మంది తెలుగు ప్రజలకు గుండెకోత వంటింది. విభజన విషయంలో అనుసరించిన వైఖరి దురదృష్టకరం. బాధతో, ఆవేశాలతో విడిపోకూడదు. నేను ఏ ఒక్క ప్రాంతం తరఫునో మాట్లాడటం లేదు.

కాంగ్రెసు పార్టీ ఒక్కటే విభజన విషయంలో నిర్ణయం తీసుకోలేదు. శ్రీకృష్ణ కమిటీ కూడా సమైక్యాంధ్రనే ఉత్తమమని చెప్పింది. లోకసభలో చర్చకు అవకాశం ఇవ్వకుండా బిల్లు పెట్టారు. టిడిపి, బిజెపి, వైయస్సార్ కాంగ్రెసు అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చెప్పాయి.
తెలంగాణకు మద్దతుగా ఆఖరుగా నిర్ణయం తీసుకున్న పార్టీ కాంగ్రెసు మాత్రమే. లోకసభలో బిల్లు ప్రవేశ పెట్టిన తీరు విచారకరం. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా టిడిపి, బిజెపి, వైయస్సార్ కాంగ్రెసు, తెరాస అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఆర్టికల్ 3 ప్రకారం విభజించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పింది.
చిరు వర్సెస్ వెంకయ్య అండ్ జైట్లీ
చిరంజీవి మాట్లాడుతుండగా అరుణ్ జైట్లీ లేచి.. చిరు పదవికి రాజీనామా చేసి మాట్లాడలన్నారు. కాంగ్రెసు నాయకుడిగా మాట్లాడారా లేక ప్రభుత్వ హోదాతో మాట్లాడారో చెప్పాలన్నారు. మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు.
వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. చిరంజీవి మంచి యాక్టర్ అన్నారు. దానిపై సభలో కొంత గందరగోళం చెలరేగింది. దానికి వెంకయ్య సమాధానంగా తన ఉద్దేశ్యం ఇక్కడ నటిస్తున్నాడని కాదని, ఎపిలో మంచి యాక్టర్ అని, తామిద్దరం మంచి మిత్రులమని అన్నారు. చిరు తన అభ్యంతరాలను పార్టీ వేదికలపై చెప్పాలన్నారు. బిజెపి నేతల వ్యాఖ్యలకు సమాధానంగా చిరు మాట్లాడుతూ... తాను ప్రజల తరఫున మాట్లాడుతున్నానని చెప్పారు.
టిడిపి చెబుతున్న సమన్యాయం అంటే ఏమిటి. హైదరాబాదుతో సీమాంధ్ర ప్రయోజనాలు ముడివడి ఉన్నాయి. హైదరాబాదును ఛండీగఢ్ తరహా యూటి చేయాలి. జనాభా నిష్పత్తి ప్రకారం మిగులు ఆదాయం సీమాంధ్రకు కేటాయించాలి. ఉత్తరాంధ్, సీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. సీమాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలి. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలపాలి.












Click it and Unblock the Notifications