మన నయాగరా జలపాతాన్ని చూసొద్దామా..? ఎక్కడ ఉందో తెలుసా..?
అమెరికా- కెనడా సరిహద్దులో ఉన్న నయాగరా జలపాతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నిత్యం వేలాదిమంది పర్యటకులు ప్రపంచం నలు మూలలనుంచి ఇక్కడికి వస్తుంటారు. సాధారణ పర్యటకుల నుంచి అంతర్జాతీయ ప్రతినిధుల వరకూ ఈ జలపాతాన్ని చూసేందుకు ఇష్ట పడతారు. ప్రపంచంలోనే అతి సుందరమైన జలపాతాల్లో ఒకటిగా నయాగరా ఉంది. అయితే మన దేశంలోనూ నయాగరా జలపాతం ఉందన్న సంగతి మీకు తెలుసా..? అవును.. ఛత్తీస్ గఢ్ లోని చిత్రకూట్ జలపాతాన్ని కూడా నయాగరా జలపాతంతో పోల్చుతారు. మరి ఆ జలపాతం విశేషాలు ఇక్కడ చూడండి.
ఛత్తీస్ గఢ్ లోని చిత్రకూట్ జలపాతం అందాలు చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి ఇంద్రావతి నది నుంచి ఉప్పొంగే నీరు దుంకుంతుంటే ఆ దృశ్యాలు వర్ణనాతీతంగా ఉంటాయి. అంత ఎత్తు నుంచి నీరు కిందకు పడుతుంది కాబట్టే ఈ జలపాతాన్ని కూడా నయాగరా జలపాతంతో పోలుస్తారు. అంతేకాక ఈ జలపాతం రంగులు కూడా మారుస్తుంది. అదే దీని ప్రత్యేకత. ఈ జలపాతం ఛత్తీస్ గఢ్ లోని జగ్దల్ పుర్ పట్టణానికి 39 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. దాదాపు 1000 అడుగుల వెడల్పుతో ఈ జలపాతం ఉంటుంది. దేశంలోనే వెడల్పైన జలపాతంగా పేరు పొందింది.
ఈ జలపాతం వద్ద శివాలయంతోపాటు అక్కడి పరిసర ప్రాంతాల్లో సహజంగా ఏర్పడిన కొండ గుహలు కూడా ఉన్నాయి. ఓవైపు దండకారణ్యం, పెద్ద పెద్ద కొండలు, చెట్లు, పక్షుల రాగాలు, జంతువుల అరుపులు.. ఇలా వీటన్నింటినీ దాటి వెళ్తే చిత్రకూట్ జలపాతం అందాలు, జల సవ్వడులు కనువిందు చేస్తాయి. వర్షాకాలంలో ఈ ప్రాంతానికి ఎక్కువమంది పర్యటకులు వస్తుంటారు. అయితే ఈ జలపాతం వాతావరణం, కాలం బట్టి రంగులు మారుతుంది. ఈ అందాలను చూసేందుకు పర్యటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

ఇక చిత్రకూట్ జలపాతానికి చేరుకోవాలంటే.. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి జగ్దల్ పూర్ కు రోడ్డు మార్గం ఉంది. అక్కడి నుంచి మీరు జలపాతానికి చేరుకోవచ్చు. ఇక రైలు మార్గం అయితే జగ్దల్ పుర్ కు రైలు మార్గం లేదు. అయితే వైజాగ్ నుంచి జగ్దల్ పుర్ కు ప్రతిరోజు రైలు ఉంది. ఇక విమానంలో రావాలంటే రాయ్ పుర్, విశాఖ పట్నం విమానాశ్రయాల నుంచి చేరుకోవచ్చు.












Click it and Unblock the Notifications