కర్ణాటక కాంగ్రెస్ లో కిస్సా సీఎం కుర్సీ కా; డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య!!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. రాష్ట్రంలోని 224 స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటి అనేక నియోజకవర్గాలలో ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. దీంతో కచ్చితంగా అధికారం తమ హస్తగతం అవుతుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవడం తాజాగా కొనసాగుతున్న కౌంటింగ్ ట్రెండ్ ను బట్టి కనిపిస్తుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం పెరగడంతో ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి ముఖ్యమంత్రిగా ఎవరికి అవకాశం ఇవ్వాలి అన్నది కీలకంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన సిద్ధరామయ్య, కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇద్దరు ముఖ్యమంత్రి పదవిని బలంగా ఆశిస్తున్న నాయకులు.

ఇప్పటికే డీకే శివకుమార్ మల్లికార్జున ఖర్గే వద్దకు వెళ్లి ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలని మంతనాలు జరిపితే, సిద్దరామయ్య కొడుకు ఏకంగా తన తండ్రికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ శాసనసభ్యులు ఇష్టపడే నాయకుడికే అవకాశం ఇవ్వాలని సిద్ధరామయ్య కోరుతున్నారు. దీంతో సిద్దరామయ్య, డీకే శివకుమార్ లో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలన్న దానిపై కాంగ్రెస్ హైకమాండ్ ఉత్కంఠ గా ఉంది.
ఎన్నికల పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాత గెలుపొందిన ఎమ్మెల్యేలను ఆధారంగా చేసుకొని శాసన సభాపక్ష సమావేశంలో ఎన్నిక నిర్వహించి, ఎక్కువ మద్దతు వచ్చిన నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ అలాకాకుండా హంగ్ ఏర్పడితే, ఎవరైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కీలక భూమిక పోషించి, ఇతర పార్టీ నాయకులతో మంతనాలు జరిపి కాంగ్రెస్ పార్టీకి లాభాన్ని చేకూరుస్తారో వారివైపు అధిష్టానం మొగ్గుచూపే అవకాశం కూడా లేకపోలేదని చర్చ జరుగుతుంది.
గెలుపు ధీమాతో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల మద్దతు కోసం మాజీ సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు తమకు ఉన్న నెట్ వర్క్ లతో కాంగ్రెస్ పార్టీలో విజయం సాధించే అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారు. తమకు మద్దతు కూడగట్టటం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఏది ఏమైనా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక తో సహా కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ఈజీ చేయడం కోసం ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు రణదీప్ సింగ్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ లను హైకమాండ్ ప్రతినిధులుగా కర్ణాటకకు పంపింది. ఇక ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా బెంగళూరులోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications