ఆసుపత్రిలో 'అమ్మ': ఆమె సూచనలే కీలకం, ఎవరీ షీలా బాలకృష్ణన్
హైదరాబాద్: అనారోగ్యం కారణంగా గత 14 రోజులుగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమె కోసం రాష్ట్రం మొత్తం కలత చెందుతోంది. అయితే రాష్ట్ర అధికార యంత్రాంగం మాత్రం ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూనే ఓ మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తోంది.
ఆమె షీలా బాలకృష్ణన్. అనారోగ్య కారణంగా సీఎం జయలలిత ఆసుపత్రిలో ఉన్న వేళ రాష్ట్రాన్ని నడిపించే బాధ్యత ఆమె తన భుజస్కంధాలపై వేసుకున్నారు. పాలనాపరంగా ప్రస్తుతం తమిళనాడులో ఉన్నతాధికారులతో పాటు జయలలిత మంత్రులు సైతం ఆమె సూచనల మేరకు నడుచుకుంటున్నారు.

2014లో షీలా బాలాకృష్ణన్ (62) తన సర్వీసు నుంచి రిటైర్ అయ్యారు. ఆమె నిజాయితీ, పని పట్ల దీక్షతను గుర్తించిన జయలలిత ఆమెను సలహాదారుగా నియమించుకున్నారు. జ్వరం, డీహైడ్రేషన్‌తో సెప్టెంబర్ 22వ తేదీన అమ్మ ఆసుపత్రిలో చేరడంతో అమ్మ స్థానంలో పరిపాలన బాధ్యతలను షీలా బాలకృష్ణన్‌నే నిర్వహిస్తున్నారు.
అంతేకాదు ఆమె రాష్ట్రంలో అత్యంత కీలక వ్యక్తిగా మారారని, ఆమె సమ్మతి లేకుండా ఏమీ జరగడం లేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆమె అనుమతి లేకుండా పాలనపై పెదవి విప్పడానికి అధికార వర్గాలు గానీ, సీనియర్ మంత్రులు కానీ ఒప్పుకోవడం అంగీకరించడం లేదంటే నమ్మండని తెలిపారు.
జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రిలో అమ్మ ఉన్న గదికి పక్కనే ఓ గదిలో షీలా బాలాకృష్ణన్ ఉంటున్నారు. అదే అంతస్తులో ఆమె పక్క గదిలో జయలలిత స్నేహితురాలు శశికళ బస చేశారు. జయలలిత ఆరోగ్యంపై వాకబు చేసేందుకు ఆసుపత్రికి వస్తున్న ఉన్నతాధికారులు పాలన విషయంలో షీలా బాలాకృష్ణన్ సూచనలు తీసుకుంటున్నారు.
కేరళలోని తిరువనంతపురానికి చెందిన షీలా 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. జయలలితకు అత్యంత విశ్వసనీయురాలైన సలహాదారుగా షీలా బాలాకృష్ణన్ పేరుగాంచారు. ఆమె సలహాల మేరకే తమిళనాడు సీఎస్ పీ రామమోహన్‌రావు, డీజీపీ టీకే రాజేంద్రన్ నడుచుకుంటున్నారు.
అన్నాడీఎంకేలో కీలక మంత్రులుగా ఉన్న పన్నీరు సెల్వం లాంటి వారు కూడా పాలనలో షీలా సూచనన ప్రకారమే నడుచుకుంటున్నట్టు తెలుస్తోంది. అమ్మ ఆసుపత్రిలో ఉన్నా, తమిళనాడులో పరిపాలనలో ఎలాంటి చిక్కులు రాకుండా ఆమె సమర్థవంతంగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications