బేటీ బచావో అంటే ఇదేనా మోడీ గారూ..!!
ఇంఫాల్: మణిపూర్‌లో చెలరేగిన హింస చల్లారట్లేదు. రెండున్నర నెలలుగా ఈ ప్రశాంత రాష్ట్రం మండిపోతూనే వస్తోంది. మేటీ, కుకీ సామాజిక వర్గాల మధ్య మొదలైన రిజర్వేషన్ అంశం రోజురోజుకూ తీవ్రరూపాన్ని దాల్చుతూనే ఉంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపినప్పటికీ.. ఏ మాత్రం ఫలితం ఉండట్లేదు.
మే 3వ తేదీన మణిపూర్‌లో మేటీ, కుకీ సామాజిక వర్గాల మధ్య హింస చెలరేగింది. అప్పటి నుంచి 150 మందికి పైగా మరణించారు. అనేకమంది గాయపడ్డారు. ఇప్పటివరకూ ఈ హింసాత్మక పరిస్థితులకు అడ్డుకట్ట పడట్లేదు. దాడులు, ప్రతిదాడులతో తగలబడుతూనే ఉంది మణిపూర్. రాజకీయ జోక్యం కూడా పని చేయట్లేదు.

ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి.. ఊరేగించడం, అందరూ చూస్తుండగానే వారిపై అత్యాచారానికి పాల్పడిన అమానవీయ సంఘటనల వీడియోలు వెలుగులోకి రావడం- అక్కడి హింసాత్మక పరిస్థితులకు ఆజ్యం పోసినట్టయింది. ఈ ఘటన- అటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ ప్రస్తావనకు వచ్చింది. ఉభయసభల్లో ప్రకంపనలు పుట్టించింది.
ఈ దాష్ఠీకానికి బలైన ఇద్దరు మహిళల్లో ఒకరు- మాజీ సైనికాధికారి భార్య కూడా. కార్గిల్ వార్ యుద్ధంలో పాల్గొన్నారాయన. భారత భూభాగంపైకి చొచ్చుకు వచ్చిన పాకిస్తానీయులను తరిమి కొట్టిన జవాన్లకు నాయకత్వాన్ని వహించారు అప్పట్లో. అస్సాం రెజిమెంట్‌లో సుబేదార్ హోదాలో పని చేశారు. గతంలో శ్రీలంకలో శాంతి బలగాల్లో పాల్గొన్న భారత సైన్యానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహించారు.
ఈ దారుణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈ మధ్యాహ్నం కోల్‌కతలో నిర్వహించిన భారీ ర్యాలీని ఉద్దశించి ప్రసంగించారు. మణిపూర్ ప్రజలకు సంఘీభావాన్ని తెలిపారు. భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వ పనితీరుపై నిప్పులు చెరిగారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బేటీ బచావో అని నినాదాన్ని ఇస్తుంటారని, బీజేపీ దీన్ని విస్తృతంగా ప్రచారం చేసిందని, దాన్ని చేతల్లో చూపించట్లేదంటూ మండిపడ్డారు. బేటీ బచావో అనే స్లోగన్ ఇప్పుడేమైంది? ఎక్కడ ఉంది? అంటూ నిలదీశారు. మణిపూర్ ప్రజలకు తాము సంఘీభావం తెలియజేస్తున్నామని చెప్పారు.
రెండున్నర నెలలుగా మణిపూర్ మండుతోందని, ఎన్డీఏ పరిపాలనలో దేశం మొత్తం ఇలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయంటూ మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. బిల్కిస్ బానో కేసులో ప్రధాన నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారని గుర్తు చేశారు. రెజ్లర్ల కేసులో నిందితుడైన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు కూడా బెయిల్ లభించిందని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఈ దేశ మహిళలందరూ కలిసి ప్రధాని మోదీ, బీజేపీని రాజకీయాల నుంచి తరిమికొడతారని మమతా బెనర్జీ విమర్శించారు. మణిపూర్‌లో జరిగిన సంఘటనలు కొంచెం కూడా బాధించట్లేదా అంటూ మోదీని నిలదీశారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా మణిపూర్ తరహాలో చిచ్చు పెట్టడానికి బీజేపీ ప్రయత్నించిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications