తప్పుకొన్న నితీష్ కుమార్- రాజీనామా: ఇకపై
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. తన శాసన మండలి సభ్యత్వానికి గుడ్ బై చెప్పారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతిప్పాయి. బీహార్ రాజకీయాల నుండి ఆయన పూర్తిగా వైదొలగినట్టయింది. మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఆదేశాలు, తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా తాజా పరిణామం చోటు చేసుకుంది. ఇది- రాష్ట్రీయ జనతాదళ్ (యునైటెడ్)లో చర్చనీయాంశమైంది.
ఆయన ఇటీవల రాజ్యసభకు ఎన్నిక కావడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. పార్లమెంటరీ నిబంధనల ప్రకారం రాజ్యసభ సభ్యత్వాన్ని స్వీకరించిన తర్వాత ఎమ్మెల్సీ పదవిని వదులుకోవడం తప్పనిసరి. దీంతో ఆయన రాజీనామా చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ ఉదయం ఆయన 10:15 నిమిషాలకు తన రాజీనామా విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా మారింది.

నితీష్ కుమార్ రాజీనామాపై ఆదివారం సాయంత్రం నుంచే బీహార్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సోమవారం ఉదయం నుంచి ఈ పరిణామంపై గందరగోళం కొనసాగింది. తొలుత జేడీయూ వర్గాలు రాజీనామా లేఖ తమ వద్ద ఉందని ప్రకటించగా, తర్వాత ఆ పార్టీ నాయకులు లేఖను శాసన మండలి సభాపతికి సమర్పించారు. ఎమ్మెల్సీ సంజయ్ గాంధీ స్వయంగా నితీష్ కుమార్ రాజీనామా పత్రాన్ని మండలికి అందజేశారు.
ఈ రాజీనామా లేఖను ఎమ్మెల్సీ సంజయ్ గాంధీ మండలికి అందజేసినట్లు జేడీయూ సీనియర్ నాయకుడు, మంత్రి విజయ్ కుమార్ చౌదరి మీడియాకు ధృవీకరించారు. ఆయన మీడియా ముందు ఆ రాజీనామా లేఖను ప్రదర్శించి వివరాలు తెలిపారు. ఒక వ్యక్తి రెండు చట్టసభల్లో సభ్యుడిగా ఉండకూడదనే రాజ్యాంగ సూత్రాలను గౌరవిస్తూ నితీష్ కుమార్ తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారని సంజయ్ గాంధీ అన్నారు.
శాసన మండలి సభ్యత్వాన్ని వదులుకోవడంతో నితీష్ కుమార్ ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగరు. సీఎంగా ఎప్పుడు రాజీనామా చేస్తారనేది ప్రస్తుతం ప్రధాన ప్రశ్నగా మారింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా నిబంధనల ప్రకారం ఆయన మరో ఆరు నెలల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చు. అన్ని రోజులు ఆయనను సీఎం కుర్చీలో ఉంచకపోవచ్చు బీజేపీ. నితీష్ వారసుడి ఎంపిక పూర్తికాగానే ఈ స్థానాన్ని నితీష్ కుమార్ ఖాళీ చేయాల్సి ఉంటుంది.
ఇది రాష్ట్ర రాజకీయాల్లో అనేక ఊహాగానాలకు తావిస్తోంది. నితీష్ కుమార్ అధికారిక ప్రకటన వెలువడటానికి ముందు, జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ కుమార్ ఝా, మంత్రులు విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర యాదవ్, అశోక్ చౌదరి వంటి కీలక నేతలు ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. ఈ పరిణామాలు పరిస్థితి తీవ్రతను స్పష్టం చేశాయి.












Click it and Unblock the Notifications